కరుణించని.. కరెంటోళ్లు..!

కరుణించని.. కరెంటోళ్లు..!
  •     కనెక్షన్​ కోసం నెలలుగా రైతుల ఎదురుచూపులు

సిరికొండ, వెలుగు :  ట్రాన్స్​కో ఆఫీసర్ల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూర్​గ్రామంలో గతేడాది కురిసిన భారీ వర్షాలకు పెద్దమ్మ ఫీడర్ స్తంభాలు నేలకూలాయి. దీంతో కొట్టాల ఫీడర్​తో రైతుల పంట పొలాలకు తాత్కాలికంగా కరెంట్​కనెక్షన్​ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇటీవల కురిసిన గాలి వానకు కొట్టాల ఫీడర్ స్తంభాలు సైతం విరిగిపడడంతో సమస్య తీవ్రమైంది. 8 నెలల కిందట పెద్దమ్మ ఫీడర్​కు సంబంధించి స్తంభాలు వేసి, వైర్లు వేయకుండా అలాగే వదిలేశారు.

ప్రస్తుతం ఖరీఫ్​పనులు స్టాట్​కావడంతో సుమారు 350 మందికిపైగా రైతుల మోటర్లకు కరెంట్​కనెక్షన్​ లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు సమస్య తీర్చాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కొందరు రైతులు ట్రాక్టర్ల డైనమో ద్వారా బోరు మోటర్లకు కనెక్షన్​ఇచ్చి నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం గంటకు రూ.200 నుంచి 300 వరకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, జిల్లా స్థాయి ఆఫీసర్లు స్పందించి తమ సమస్య తీర్చాలని రైతులు కోరుతున్నారు.