- గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యమే చెక్ డ్యామ్ కూలడానికి కారణం: ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపల్లి, వెలుగు: మానేరు వాగుపై ఉన్న చెక్ డ్యామ్‌ను బ్లాస్ట్ చేయలేదని, గత సర్కార్ నాసిరకంగా కట్టడం వల్లే కూలిపోయిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల పరిధిలోని మానేరుపై నిర్మించిన ఈ చెక్ డ్యామ్ రెండ్రోజుల కింద ధ్వంసమైంది. ఈ డ్యామ్ పేల్చివేతకు గురైనట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే విజయరమణారావు ఆదివారం చెక్‌డ్యామ్‌ను పరిశీలించి మాట్లాడారు. ఈ డ్యామ్ వద్ద పేలుడు జరగలేదని, గత బీఆర్‌ఎస్ సర్కార్ నిర్మించిన చెక్ డ్యామ్‌లు ఎన్నో కొట్టుకుపోయాయని, అలాగే గుంపుల చెక్ డ్యామ్ కూడా కూలిపోయిందన్నారు. సంబంధిత అధికారులు, పోలీసులు బ్లాస్టింగ్పై ప్రత్యేకంగా ఆరా తీశారని, ఎక్కడ కూడా బ్లాస్టింగ్ జరిగిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు చెప్పారన్నారు.
చెక్ డ్యామ్ బ్లాస్టింగ్‌కు గురైనట్లు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన 10 చెక్ డ్యామ్‌ల్లో, ఇప్పటికి 8 చెక్ డ్యామ్‌లు కూలిపోయాయని గుర్తుచేశారు.
నాసిరకం చెక్ డ్యామ్ కట్టించిన బీఆర్ఎస్ నాయకులు.. ఎక్కడ తాము బద్నాం అవుతామేమోనని బ్లాస్టింగ్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పటి ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపం, బీఆర్ఎస్ నాయకుల వైఫల్యమే దీనికి కారణమన్నారు.
