
త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో గురువారం నుంచి జరిగే సరస్వతి పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ప్రభుత్వం తరపున ఆహ్వానిస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెప్పారు. మంగళవారం కాళేశ్వరంలో పర్యటించిన ఎంపీ పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు. కుంభమేళా కన్నా పది రెట్లు వైభవంగా సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తామని, అదే తరహాలో ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు.
సమయం ఎక్కువ లేదని, పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి పుష్కరాలకు వస్తున్నారని చెప్పారు. యూపీలో జరిగే మహాకుంభమేళాకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించగా.. తెలంగాణలోనే అత్యంత వైభవంగా పుష్కరాలు జరుగుతాయని.. ప్రధానిని ఆహ్వానిస్తామని సీఎం అప్పుడే చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు మోదీ కాళేశ్వరం వచ్చి సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించాలని కోరుకుంటున్నట్లు వంశీకృష్ణ తెలిపారు.