ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి ఆర్డీఓ

ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి ఆర్డీఓ

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఆర్డీఓ, రామగుండం కార్పొరేషన్​ఇన్ చార్జ్ కమిషనర్ శంకర్ కుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం కార్పొరేషన్​లో కాంట్రాక్టర్​గా పనిచేస్తున్న రజినీకాంత్​కు పట్టణ ప్రగతి, శానిటేషన్ లిక్విడ్ కు సంబంధించిన రూ.9.25లక్షల బిల్లు రావాల్సి ఉంది. చెక్కు రిలీజ్​చేయాలంటే రూ.లక్ష లంచంగా ఇవ్వాలని ఆర్డీఓ శంకర్​ కుమార్​ డిమాండ్​ చేశాడు. ఇస్తానని ఒప్పుకున్న రజినీకాంత్ ఏసీబీని ఆశ్రయించాడు. ముందుగా సూచించిన ప్రకారం ఆర్డీఓ బంధువు అయిన మల్లికార్జున్ అనే వ్యక్తికి కాంట్రాక్టర్​మంగళవారం రూ.లక్ష ఇచ్చాడు. మల్లికార్జున్ ఆ డబ్బును ఆర్డీఓ శంకర్​కుమార్​కు అతని ఆఫీస్​లో ఇస్తుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. శంకర్​కుమార్, మల్లికార్జున్ పై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. రెండు నెలల కింద పెద్దపల్లి సీపీఓ కూడా ఇలాగే కాంట్రాక్ట్​పనుల బిల్లు జారీ విషయంలో లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కాడు. ఆ ఘటన మర్చిపోకముందే జిల్లాకు చెందిన మరో ఉన్నతాధికారి దొరకడం చర్చనీయాంశమైంది.

నాగర్​ కర్నూల్​ జిల్లాలో మరొకరు
ఉప్పునుంతల(వంగూర్): నాగర్​కర్నూల్ జిల్లాకు చెందిన పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఏస్పీ శ్రీకృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వంగూరు మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన సంకెళ్ల రాము తన తల్లి పేరు మీద ఉన్న ఇంటిని తన పేరు మీదికి మార్చాలని పంచాయతీ కార్యదర్శి చింతకుంట్ల రామస్వామికి అప్లికేషన్​పెట్టుకున్నాడు. అందుకు రామస్వామి 6 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇస్తానని ఒప్పుకున్న రాము తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం రాము నుంచి పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు.