అవినీతికి కేరాఫ్ పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీస్..ఆన్ లైన్ అప్లికేషన్లను పక్కన పెడుతున్న ఆఫీసర్లు

అవినీతికి కేరాఫ్ పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీస్..ఆన్ లైన్ అప్లికేషన్లను పక్కన పెడుతున్న ఆఫీసర్లు

 

  • ఏజెంట్ల ద్వారా వస్తేనే పని పూర్తి     
  • దాడులకు దొరకకుండా అధికారుల ప్లాన్స్  
  • ఆఫీసర్లకు మరకలంటకుండా పనులు చక్కబెడుతున్న ఏజెంట్లు  

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ఈ ఏడాది మొదటి నుంచి పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసు అవినీతి నిరోధక శాఖకు టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిపోయింది. ఫిబ్రవరి నెలలో ఓ లారీ ఓనర్​ తనను లంచాల కోసం వేధిస్తున్నారనే ఆరోపణతో ఆర్టీఏ ఆఫీసు ముందు కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో రాష్ట్రస్థాయిలో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. 

పెద్దపల్లి ఆర్టీఏ కార్యాలయంలో ఏజెంట్ల హవా నడుస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం ఆన్​లైన్​పద్ధతి తీసుకొచ్చినా ఇక్కడి అధికారులు పట్టించుకుంటలేరు. ఆన్​లైన్ లో వచ్చిన అప్లికేషన్లు ఆఫీసులోనే మూలుగుతున్నాయి. ఏజెంట్ల ద్వారా వచ్చిన వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారు. 

 ఏసీబీ అధికారుల రైడ్ లో పట్టుబడ్డ ఏజెంట్లు  

 ఈ క్రమంలో జూన్​26న ఏసీబీ అధికారులు పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసుపై ఆకస్మిక దాడులు చేశారు.  కానీ ఏ అధికారి కూడా వారికి డబ్బులతో పట్టుబడ లేదు. ఆరుగురు ఏజెంట్ల నుంచి మాత్రం రూ. 60 వేలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.  పలు అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు చెప్పారు. నాలుగు రోజుల క్రితం విజిలెన్స్​ అధికారుల ఆకస్మిక దాడి జరిగింది. ఏజెంట్లు ఆఫీసులో ఉండటం గమనించి వారితో మాట్లాడి వివరాలు సేకరించినట్లు విజిలెన్స్​ అధికారులు పేర్కొన్నారు. 

 పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసు  ప్రభుత్వం నిర్ణయించిన టార్గెట్​ను ఫుల్​ ఫిల్​ చేయడంలో స్టేట్​ ఫస్ట్​గా ఉంది.  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు మాత్రం ఏ అవినీతి నిరోధక శాఖకు చిక్కడం లేదు. ఇక్కడ పనిచేస్తున్న ఏజెంట్లే పూర్తిగా కీలకంగా మారి అధికారులకు ఎలాంటి మరకలు అంటకుండా పనులను చక్కబెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

ఏజెంట్లే కీలకంగా...

ఆర్టీఏ ఆఫీసులో ఏజెంట్లు  క్లయింట్ల నుంచి మామూళ్లు వసూలు చేసి పనులు చక్కబెడుతున్నారు. అధికారులు మాత్రం ఏజెంట్లను ఆఫీసులోకి రానివ్వడం లేదని చెప్తున్నారు.  దాదాపు పదుల సంఖ్యలో ఏజెంట్లు ఆఫీసుల్లోనే తిష్టవేసి ఉంటున్నారు. ఏ పేపర్​ కావాలన్నా పైసలు ఇయ్యాల్సిందే అని క్లయింట్స్​చెప్తున్నారు. ఆన్​లైన్​ విధానం సర్కార్ ప్రవేశపెట్టినా ఇక్కడ మాత్రం ఏజెంట్ల ద్వారానే పనులు జరుగుతున్నాయి. ఆన్​లైన్​ ద్వారా డైరెక్టుగా వెళ్తే పేపర్లలో ఏదో మిస్టేక్​ ఉందని పక్కన పడేస్తున్నట్లు బాధితులు చెప్తున్నారు. ఆఫీసులో ఏజెంట్ల ద్వారా కలెక్ట్​ అయిన సొమ్మును అటెండర్​ నుంచి ఆఫీసర్​ వరకు వాటాలు వేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. 

పట్టుబడ్డ వాహనాలను విడిచిపెట్టేందుకు కొంతమంది ఏజెంట్లను మధ్యవర్తులుగా, అధికారులు నియమించుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏజెంట్ల ద్వారానే పైసల వసూళ్లు జరుగుతున్నాయి.  డైరెక్టుగా ఏ అధికారి కూడా ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు.  ఈ మధ్యకాలంలో జరిగిన ఏసీబీ, విజిలెన్స్​అధికారుల తనిఖీల సందర్బంగా ఆయా శాఖల అధికారులు నివేదికను తయారు చేసి సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందించారు. కాగా దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.