- నిర్మాణ అంచనా వ్యయం రూ.10కోట్లు కాగా ఇప్పటికే రూ.6 కోట్లు మంజూరు
- ఫిబ్రవరిలోనే పూర్తయిన టెండర్లు
- ఏడాదిలోపు పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఆర్టీసీ బస్ డిపో పనులు స్పీడందుకున్నాయి. ఇరవై ఏళ్ల క్రితమే డిపో ఏర్పాటు కావాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆ ప్రతిపాదన పక్కకు పోయింది. ఆ కల త్వరలోనే సాకారం కాబోతుంది. కాంగ్రెస్పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే స్థలం కేటాయింపు పూర్తికాగా.. అంతా చదును చేస్తున్నారు. ఏడాది లోపు డిపో నిర్మాణం పూర్తిచేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు పనుల్లో వేగం పెంచారు.
ఇప్పటికే ఫండ్స్ రిలీజ్
కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగానే పెద్దపల్లి జిల్లాకేంద్రంలో బస్ డిపో ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేశారు. నిర్మాణ వ్యయం రూ.10 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటికే రూ.6 కోట్లు విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే టెండర్లు పూర్తయ్యాయి. పెద్దపల్లి బస్టాండ్ పక్కనే ఎంపీడీవో ఆఫీస్ ప్రాంగణంలో 4 ఎకరాల 15 గుంటల విస్తీర్ణంలో డిపో నిర్మాణ పనులు చేపట్టారు. నాలుగు రోజులుగా స్థలంలో ఉన్న బిల్డింగ్స్, చెట్లను తొలగిస్తున్నారు.
ఏడాదిలోపు అందుబాటులోకి...
బస్ డిపోను ఏడాదిలోపు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిపో కోసం రూ. 14 కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించగా.. తొలుత ఈ డబ్బును ఆర్టీసీ నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు స్థలాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి ఉచితంగా అందజేసింది. ఈ డిపో అందుబాటులోకి వస్తే పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు ధర్మపురి నియోజకవర్గంలోని పలు మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం ఏర్పాటవుతుంది.
పెద్దపల్లి నియోజకవర్గంలోని జూలపల్లి, ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాలకు ఇప్పటికి రోజుకు రెండు మూడు ట్రిప్పులు తప్ప బస్సులు ఉండవు, అలాగే సాయంత్రం ఆరు గంటలు దాటితే ఆయా మండల పరిధిలోని గ్రామాలకు రాకపోకలు కూడా బంద్ అవుతాయి. పెద్దపల్లి రైల్వే స్టేషన్‌లో సాయంత్రం దిగిన ప్యాసింజర్లు తమ ఇండ్లకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాత్రి 9 గంటలకు రైలు దిగిన వారు రైల్వేస్టేషన్‌లోగానీ బస్టాండ్‌లో గానీ పడుకొని తెల్లవారిన తర్వాత ఇండ్లకు పోతున్నారు. బస్ డిపో అందుబాటులోకి వస్తే ఆయా గ్రామాలకు బస్సులను నిత్యం నడిపే అవకాశం ఉంటుంది.
