
- వాస్క్యులైటిస్, ఆర్థరైటిస్, కవాసాకి డిసీజ్‌లు వచ్చే ప్రమాదం
- పీజీఐఎంఈఆర్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సుర్జీత్ సింగ్
- కిమ్స్ హాస్పిటల్లో పీడియాట్రిక్ రుమటాలజీపై సదస్సు
పద్మారావునగర్, వెలుగు: శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువైతే.. అది మన సొంత శరీర అవయవాలనే శత్రువులుగా భావించి వాటిపై దాడి చేస్తుందని ప్రపంచ ప్రఖ్యాత పీడియాట్రిక్ రుమటాలజిస్ట్, ఇమ్యునాలజిస్ట్, చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ సుర్జీత్ సింగ్ తెలిపారు. అప్పుడు ఆ అవయవాలు క్షీణిస్తాయని పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ రుమటాలజీపై జరిగిన సదస్సులో కీలక ప్రసంగం చేశారు. రోగనిరోధక శక్తి ఎక్కువవడం వల్ల వచ్చే వాస్క్యులైటిస్, ఆర్థరైటిస్, కవాసాకి డిసీజ్ లు అత్యంత ప్రమాదకరమని చెప్పారు.
పిల్లలకు కూడా ఇవి సోకే అవకాశం ఎక్కువని తెలిపారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, తరచూ జ్వరం, ఒంటిమీద దద్దుర్లు, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇమ్యునాలజీ నిపుణుల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని పేర్కొన్నారు. అంతకుముందు ఈ సదస్సును కిమ్స్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, చీఫ్ నియోనటాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ బాబు ఎస్.మదార్కర్, పీడియాట్రిక్ ఇమ్యునాలజీ, రుమటాలజీ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ అబర్ణా తంగరాజ్, పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ పరాగ్ శంకర్‌రావు డెకాటే ప్రారంభించారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 400 మందికి పైగా వైద్యులు హాజరయ్యారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ రుమటాలజీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి మాట్లాడుతూ.. పిల్లలకు15 ఏండ్లలోపు పై వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని, పిల్లల వైద్యులు, జనరల్ఫిజీషియన్లు వీటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పీడియాట్రిక్ అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (పాట్స్), ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్(ఐఏపీ) జంట నగరాల శాఖ, లిటిల్ వన్స్ క్యూర్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో కిమ్స్ కడల్స్ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అపర్ణ.సి, డాక్టర్లు కేవీ.అనిల్ కుమార్, అంజని, శ్రీరేఖ, సంబిత్ సాహు, రాకేశ్‌కుమార్ పాల్గొన్నారు.