
- నెలలు గడుస్తున్నా పరిష్కారం కాని భూసమస్యలు
- కలెక్టరేట్లో వందకు పైగా అర్జీలు పెండింగ్
మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ధరణి పోర్టల్‌కు వస్తున్న అర్జీలు పెండింగ్‌లో పడుతున్నాయి. నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను పరిష్కరించాలంటూ ఇటు మండల రెవెన్యూ ఆఫీసులు, అటు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. అయినా సరైన టైంలో సమస్యలు పరిష్కారం కావడం లేదు.
వెలుగులోకి వచ్చిన సమస్యలెన్నో
ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో భూసమస్యలు వెలుగులోకి వచ్చాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో 33 రకాల మాడ్యూల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రజలు వివిధ సమస్యలపై మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకొని వాటి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ గత రెండు నెలల నుంచి ఫైల్స్ మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. పై అధికారుల ను ఆరా తీస్తే చేస్తే కలెక్టరేట్లోనే వందకు పైగా పెండింగ్ ఉన్నట్టు సమాధానాలు వస్తున్నాయని చెపుతున్నారు.
కలెక్టర్ ట్రాన్స్ఫర్ కావడంతో అర్జీలు పెండింగ్..
ధరణి దరఖాస్తులు దాదాపు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. నెల కిందట కలెక్టర్ భారతి హోళికేరి ట్రాన్స్ఫర్ కావడం, కొత్త కలెక్టర్‌గా బదావత్ సంతోష్ వచ్చారు. కలెక్టర్ల బదిలీల వల్లనే ధరణి దరఖాస్తుల పరిశీలన కాస్త మందగించినట్టు తెలుస్తోంది. హోళికేరి ట్రాన్స్ఫర్ కావడానికి 15 రోజుల ముందు నుంచి వీటిని పెండింగ్‌లో పెట్టారు. కొత్త కలెక్టర్ సంతోష్ బాధ్యతలు చేపట్టి నెలరోజులు దాటింది. నిత్యం వివిధ కార్యక్రమాలు, పర్యటనలతో బిజీగా ఉంటున్నారు.
పెరుగుతున్న అర్జీలు
మీసేవా కేంద్రాలతో పాటు, ఇటు ప్రజావాణిలోనూ ధరణి సమస్యలపై అర్జీలు పెరుగుతన్నాయి. సర్వేనంబర్ల తారుమారు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, పట్టా భూములు ప్రైవేట్, అసైన్డ్ భూములుగా నమోదు కావడం, విరాసత్, మ్యుటేషన్ తదితర సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయి. మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే నేరుగా కలెక్టర్ లాగిన్‌కు వెళ్తాయి. అక్కడినుంచి అడిగిన రిపోర్టులను తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసుల నుంచి కలెక్టరేట్‌కు పంపుతారు. నెల రోజులుగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు మండల రెవెన్యూ ఆఫీసుల్లో సంప్రదిస్తున్నారు. అయితే వారి దరఖాస్తులు కలెక్టర్ లాగిన్‌లో పెండింగ్ ఉన్నాయని ఆఫీసర్ల నుంచి సమాధానం వస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ ఫైల్స్‌ను త్వరగా టేకప్ చేయాలని అర్జీదారులు కోరుతున్నారు.