
- ఇద్దరు పోస్టల్ సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం
- పోలీసు స్టేషన్ కు చేరిన పంచాయితీ
- జనగామ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
బచ్చన్నపేట,వెలుగు: జనగామ జిల్లాలో రూ. 5 లక్షల చేయూత పింఛన్ డబ్బులు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పోస్టల్ సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం బుధవారం (సెప్టెంబర్ 03) బచ్చన్నపేట స్టేషన్‌కు చేరడంతో బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. పోచన్నపేట పోస్టుమాస్టర్ పాకాల నాగయ్య .. గత సోమవారం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది.
చిన్నరామచర్ల పోస్టాఫీస్సిబ్బంది రాకేశ్ రోజువారి బట్వాడా పోచన్నపేటలో అందిస్తుంటాడు. పోస్టుమాస్టర్ నాగయ్య పంపిణీ చేయాల్సిన పింఛన్ డబ్బు రూ. 5లక్షలు రాకేశ్ద్వారా పంపాలని బచ్చన్నపేట సబ్‌పోస్టు మాస్టర్‌కు మెసేజ్చేశాడు. దీంతో డబ్బులు పంపించగా మధ్యలోనే మాయమైంది. డబ్బులు పోస్టు మాస్టర్నాగయ్యకు ఇచ్చానని, ముట్టినట్లు రసీదు ఇచ్చాడని రాకేశ్ చెబుతున్నాడు. తనకు రూ. 5 లక్షలు ఇవ్వకముందుకే రసీదుపై సంతకం చేయించుకున్నాడని నాగయ్య అంటున్నాడు.
ఇది జరిగి మూడు రోజులవుతున్నా బయటకు రాలేదు. బుధవారం వారు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది. డబ్బులు ఇవ్వకుండానే సంతకం తీసుకొని రాకేశ్మోసం చేశాడని పోస్ట్ మాస్టర్ నాగయ్య ఆరోపించారు. ఇద్దరు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. రూ. 5 లక్షల పింఛన్ డబ్బులు ఎటూ పోయాయని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.