స్కూల్ యాజమాన్యంతో ఆఫీసర్లు కుమ్మక్కు..బస్ ప్రమాదంపై తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు

స్కూల్ యాజమాన్యంతో ఆఫీసర్లు కుమ్మక్కు..బస్ ప్రమాదంపై తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు
  • యాక్సిడెంట్​ జరిగిన టైంలో బస్సులో 120 మంది స్టూడెంట్లు..
  • 63 మంది మాత్రమే ఉన్నట్లు అధికారుల నివేదిక
  • రీ ఎంక్వైరీలో బయటపడిన బాగోతం
  • ప్రమాద సమయంలో మద్యం మత్తులో డ్రైవర్

ఖమ్మం/పెనుబల్లి, వెలుగు:  ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశ్ పాడు దగ్గర ఈనెల 2న జరిగిన ప్రైవేట్  స్కూల్  బస్సు ప్రమాదంపై ఎంక్వైరీ చేసిన వేంసూరు మండల రెవెన్యూ అధికారులు ఆ స్కూల్​ యాజమాన్యంతో కుమ్మక్కు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మంత్రుల ఆదేశాల మేరకు పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని వేంసూరు మండల రెవెన్యూ అధికారులను కల్లూరు సబ్​ కలెక్టర్  అజయ్​ యాదవ్ ఆదేశించారు.

 దర్యాప్తు చేసిన అధికారులు ఆ తర్వాతి రోజు నివేదిక ఇచ్చారు. ఆ రోజు బస్సులో 80 మంది ఎక్కారని, ప్రమాదం జరిగిన సమయంలో 63 మంది స్టూడెంట్స్  మాత్రమే ఉన్నారని నివేదించారు. దీంతో అనుమానం వచ్చిన సబ్​ కలెక్టర్​ అజయ్​ యాదవ్​ వెంటనే పెనుబల్లి మండల అధికారులతో రీ ఎంక్వైరీకి ఆదేశించారు. వారు విద్యార్థులతో పాటు పేరెంట్స్  నుంచి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి రిపోర్ట్  ఇచ్చారు. 

దీంతో వేంసూరు ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్ట్  తప్పు అని, ప్రమాద సమయంలో బస్సులో 103 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు టీచర్లు ఉన్నట్లు తేలింది. ఆ రోజు మొత్తం 120 మంది స్టూడెంట్స్ ఉండగా, ప్రమాదం జరగక ముందే 17 మంది స్టూడెంట్స్ దిగిపోయారని రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఘటన జరిగిన సమయంలో బస్సు డ్రైవర్  మద్యం మత్తులో ఉన్నాడని, తరచూ మద్యం తాగి డ్యూటీకి వస్తాడని విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్పినట్లు సమాచారం. 

తప్పిన ఘోర ప్రమాదం..

వేంసూరు మండలం మొద్దులగూడెంలో శ్రీ వివేకానందా విద్యాలయం ఉంది. ఈ నెల 2న సాయంత్రం 4 గంటలకు స్కూలు నుంచి 120 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లను ఎక్కించుకొని బస్సు బయల్దేరింది. వేంసూరు మండలం బీరాపల్లి వద్ద 17 మంది విద్యార్ధులు దిగిపోయారు. పెనుబల్లి మండలం గణేశ్ పాడు దగ్గర ఎన్ఎస్పీ కాలువలోకి బస్సు దూసుకెళ్లడంతో బోల్తా పడింది. 

ప్రమాద సమయంలో బస్సులో పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామానికి చెందిన 41 మంది విద్యార్థులు, కందిమల్ల వారి బంజర్ కు చెందిన ఏడుగురు విద్యార్థులు, కొత్త కారాయిగూడెంకి చెందిన ఒకరు,  కొత్త కుప్పెనకుంట్లకు చెందిన 21 మంది విద్యార్ధులు, లంకా శేషయ్యబంజర్ కు చెందిన ఏడుగురు, మర్లకుంటకు చెందిన 26 మంది విద్యార్ధులు ఉన్నట్లు పెనుబల్లి రెవెన్యూ అధికారులు విచారణలో గుర్తించారు. 

ఆ గ్రామాల్లో స్వయంగా పర్యటించి, పేరెంట్స్​తో మాట్లాడి సమాచారం సేకరించారు. ప్రమాదం జరిగిన రోజు స్కూల్  బస్ లో ఏడు గ్రామాలకు చెందిన 120 మంది విద్యార్థులతో పాటు అదే స్కూల్ కు చెందిన ఇద్దరు టీచర్లు ఉన్నట్లు నివేదికలో తెలిపారు. దీంతో వేంసూర్  మండల రెవెన్యూ అధికారులు స్కూలు యాజమాన్యాన్ని కాపాడేందుకు వారికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చినట్లు తేలింది.

ఓవర్  లోడ్, డ్రంక్  అండ్  డ్రైవ్​ వల్లే ప్రమాదం!

స్కూల్  బస్సు ప్రమాదానికి ఓవర్ లోడ్, డ్రైవర్​ మద్యం మత్తులో ఉండడమే కారణమని ఆఫీసర్లు రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 45 మంది సీటింగ్  కెపాసిటీ ఉన్న బస్సులో దాదాపు మూడు రెట్లు ఎక్కువగా విద్యార్థులను ఎక్కించడంతోనే బస్సును డ్రైవర్​ కంట్రోల్  చేయలేకపోయాడని గుర్తించారు. 

దీంతో పాటు మద్యం సేవించి డ్రైవింగ్  చేస్తున్నా కనీసం చెకింగ్  చేయకుండా యాజమాన్యం నిర్లక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్​ ను పోలీసులు అరెస్ట్  చేసి బ్లడ్​ శాంపిల్  సేకరించి ల్యాబ్​కు పంపించారు. రెండు, మూడు రోజుల్లో రిపోర్ట్స్  వస్తాయని పోలీసులు చెబుతున్నారు.