రాష్ట్రంలో 64 వేల మంది ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్…పెరిగిపోతున్న మందుబాబులు.

రాష్ట్రంలో 64 వేల మంది ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్…పెరిగిపోతున్న మందుబాబులు.

దేశవ్యాప్తంగా 21.2 శాతం మంది పగటి సమయంలోనే ఆల్కహాల్‌‌ తీసుకుంటున్నట్టు డాక్టర్లు గుర్తించారు. 26.8 శాతం మంది తాగినంక తన్నులాటకు దిగుతున్నారు.  సుమారు 5 శాతం యాక్సిడెంట్లలో ఆల్కహాల్ ప్రమేయం ఉంటోంది. మొత్తంగా దేశంలో ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవాళ్లలో  5.7 కోట్ల మంది తాగుడు మానేయలేక ఇబ్బంది పడుతున్నట్టు సర్వే వెల్లడించింది.

డ్రగ్స్ మత్తులో..

తెలంగాణలో 64 వేల మంది ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్‌‌ ఎక్కించుకుంటున్నారు. మరో పది లక్షల మందికిపైగా గంజాయి, కొకైన్​, హెరాయిన్​, ఓపియాడ్స్, సెడేటివ్స్​ లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డారు. వీరందరికీ వెంటనే నిపుణుల సాయం అవసరమని, ట్రీట్మెంట్​ అవసరమని ఈ సర్వే చేసిన డాక్టర్ల టీం తెలిపింది.

సెంట్రల్​ సోషల్​జస్టిస్​ అండ్​ ఎంపవర్​మెంట్​ శాఖ సారథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్, నేషనల్​ డ్రగ్ డిఫెండెన్స్​ ట్రీట్​మెంట్​ సెంటర్​ ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆల్కహాల్, గంజాయి, డ్రగ్స్ వినియోగంపై  సైకియాట్రిస్టులు, డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు దీన్ని నిర్వహించారు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్​ డాక్టర్ల టీం రాష్ట్రంలో సర్వేను చేపట్టింది. 10 నుంచి 75 ఏండ్ల వయసున్న వారినే సర్వేకు ఎంచుకుంది. ఇందులో ఆసక్తికర  విషయాలు వెలుగుచూశాయి.

సౌత్​లో మందులో మనోళ్లే ముందు

తెలంగాణలోని మొత్తం జనాభాలో 16.8 శాతం మందికి..  మొత్తం మగవాళ్లలో 30.4 శాతం మందికి లిక్కర్​ తాగే అలవాటుంది. తాగేటోళ్లలో మగవాళ్లే ఎక్కువని, అన్ని రాష్ట్రాల్లో ఆడవాళ్లు కూడా ఆల్కహాల్​కు అలవాటుపడుతున్నారని సర్వేలో తేలింది. ఇది రెండు శాతం వరకు ఉందని ప్రకటించింది. ఆల్కహాల్​కు అలవాటు పడ్డ ప్రతి అయిదుగురిలో ఒకరు తాగుడు బంద్ చేయలేని స్థితిలో ఉన్నట్లు హెచ్చరించింది.  దేశ జనాభాలో 14.6 శాతం మందికి అంటే.. 16 కోట్ల మందికి మద్యం తాగే  అలవాటు ఉంది. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మందుతాగేటోళ్ల శాతం ఎక్కువగా ఉంది. దక్షిణాది విషయానికి వస్తే మందు తాగే వాళ్లలో తెలంగాణవాళ్లే ముందు వరుసలో ఉన్నట్లు తేలింది. మందు తాగేవాళ్ల జాబితాలో మన రాష్ట్రం 15వ ర్యాంకును ఆక్రమించింది. 15 ర్యాంకుకు ముందున్న రాష్ట్రాల్లో రెండు మూడు రాష్ట్రాలు మినహా మిగతావాన్ని చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలే ఉన్నాయి. ఈ లిస్టులో మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​ 20వ స్థానంలో ఉంది. దేశంలోనే అత్యధికంగా చత్తీస్‌గఢ్​లో 35.6 శాతం మంది లిక్కర్​కు అలవాటు పడ్డారు. త్రిపుర, పంజాబ్‌, అరుణాచల్ ప్రదేశ్‌, గోవా, ,ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.