ఫ్రీ స్కీమ్​లు వద్దు.. విద్య, వైద్యం కావాలి... సోషల్ మీడియాలో జనం పోస్టులు

ఫ్రీ స్కీమ్​లు వద్దు.. విద్య, వైద్యం కావాలి... సోషల్ మీడియాలో జనం పోస్టులు
  • నగదు పంపిణీతో సోమరితనం పెరుగుతుందని కామెంట్స్​

  • ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం

  • ఇలా పంచుకుంటూ పోతే ఇంకింత అప్పుల కుప్ప అవుతుందని ఆవేదన

  • తమపై విద్య, వైద్యం భారం తగ్గిస్తే చాలని విన్నపాలు

హైదరాబాద్, వెలుగు:  రాజకీయ పార్టీలు గుప్పిస్తున్న డబ్బుల పంపిణీ స్కీమ్‌‌లపై ఓటర్లు పెదవి విరుస్తున్నారు. తమకు చిల్లర వెదజల్లి, వేల కోట్లు దోచుకునేందుకే పార్టీలు ఉచితాల పేరుతో ముందుకు వస్తున్నాయని విమర్శిస్తున్నారు. తాము కష్టపడి సంపాదించిన సొమ్మును ఈ డబ్బుల పంపిణీ స్కీమ్‌‌ల అమలు కోసం పన్నుల రూపంలో ప్రభుత్వాలు రాబట్టుకుంటాయని అంటున్నారు. ఉచితాలు, నగదు పంపిణీ పథకాలు జనాన్ని  సోమరిపోతులుగా మారుస్తాయని, వాటికి బదులు ఎంతో కీలకమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించాలని సోషల్ మీడియా వేదికగా కొన్నిరోజులుగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. 

జీతంలో పెద్ద మొత్తం విద్య, వైద్యానికే 

ఉచితాలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వారిలో పార్టీలకు దూరంగా ఉండే తటస్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఉచిత పథకాల వల్లే నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని, తమ సంపాదనలో పెద్ద మొత్తాన్ని ట్యాక్స్‌‌ రూపంలో ప్రభుత్వాలకు కట్టాల్సి వస్తుందని వీరు భావిస్తున్నారు. డబ్బుల పంపిణీ స్కీమ్‌‌లకు బదులు, మెరుగైన విద్య, వైద్యం ఉచితంగా అందించాలని కోరుతున్నారు. జనం సంపాదనలో అధిక భాగం పిల్లల చదువులకు, హాస్పిటల్‌‌  ఖర్చులకు వెచ్చిస్తున్నామని గుర్తుచేస్తున్నారు. విద్య, వైద్యం ఖర్చుల భారం నుంచి జనాలను బయటపడేస్తే.. అదే పదివేలని కోరుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల బరిలో  ఉన్న దాదాపు అన్ని పార్టీలు పోటాపోటీగా డబ్బుల పంపిణీ స్కీమ్‌‌లను ప్రకటించి, వాటి గురించి చెబుతూనే ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. 

రాష్ట్రంలో ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే, నెలకు రూ.3 వేల చొప్పున చెల్లిస్తామని బీఆర్‌‌‌‌ఎస్ ప్రకటించింది. ఏడాదికి ఎకరానికి రూ.పది వేలు ఉన్న రైతు బంధును రూ.15 వేలు చేస్తామని కాంగ్రెస్ చెబితే, దశలవారీగా రూ.16 వేల వరకూ పెంచుతామని బీఆర్‌‌‌‌ఎస్ ప్రకటించింది. ఇట్లా ఉచితాలపై పార్టీలన్నీ ఫోకస్​ పెట్టాయి. ఇప్పటికే 5 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన రాష్ట్రం, ఈ పథకాలు అన్నింటినీ అమలు చేస్తే ఇంకో ఐదు లక్షల కోట్లు అప్పు చేయక తప్పదని సోషల్​ మీడియాలో జనం అంటున్నారు. ఆర్థికంగా వెనుకబడినవాళ్లకు, ప్రత్యేక అవసరాలు ఉన్నవాళ్లకు ఇవ్వాల్సిన ఉచితాలను ఇవ్వాల్సిందే కానీ.. అంతకంటే కీలకమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తే అందరూ బాగుపడ్తారని పేర్కొంటున్నారు.