పెరుగుతున్న కోతుల బెడద..జనం అవస్థలు

పెరుగుతున్న కోతుల బెడద..జనం అవస్థలు

అసలే కోతి.. ఆపై వనం వీడింది.. జనంలోకి వచ్చింది. ‘నీ ఊరొచ్చా.. నీ చేనుకొచ్చా.. నీ ఇంటికొచ్చా.. ’ అంటున్నది. ఇప్పటికే ఊళ్లో సెటిలైంది. టౌనులోనూ టెంటేసింది. కాయలు, పండ్లే కాదు, మనుషుల్లాగే జంక్​ఫుడ్​ తింటున్నది. నాన్​వెజ్ రుచిమరిగింది. ‘ఇంతింతై కోతింతై’ అన్నట్లు గడిచిన దశాబ్దం నుంచి కోతుల జనాభా అంతకంతా పెరుగుతున్నది. ఇప్పుడు తెలంగాణలో తక్కువలో తక్కువ 35 లక్షల కోతులు మనుషుల మధ్య బతుకుతున్నయ్. 

కోతులు మనుగడ కోసం చేస్తున్న పోరాటంలో మనుషులపైనే తిరగబడుతున్నయ్​. ఆహారం కోసం ఇండ్ల మీద, పంటపొలాల మీద దాడులు చేస్తున్నయ్​. ఒక రకంగా తెలంగాణలో కోతులకు, మనుషులకూ మధ్య కొన్నేండ్లుగా ప్రత్యక్ష యుద్ధం జరుగుతున్నదని చెప్పొచ్చు. కోతులను పట్టుకునేందుకు మనిషి చేస్తున్న అన్ని ప్రయత్నాలు, కోతుల తెలివితేటల ముందు తేలిపోతున్నాయి.

ఇండియాలో ప్రధానంగా రెండు రకాల కోతులు ఉన్నాయి​. ఒకటి బానెట్​ మకాక్​. రెండోది రీసెస్​ మకాక్​. తెలంగాణలో ఎక్కువగా కనిపించేవి బానెట్​రకపు కోతులు. ఇవి కొన్ని శతాబ్దాలుగా దక్షిణ భారతంలో... ముఖ్యంగా గోదావరి వెంట ఉన్న అడవులు, గుట్టల్లో ఉన్నాయి. క్రమంగా దక్షిణాది మొత్తం విస్తరించాయి​. రీసెస్​ మకాక్​లు ఇండియాతోపాటు నేపాల్​, చైనాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవేకాకుండా మనదేశంలో తక్కువ సంఖ్యలో ‘లాంగూర్​’ అనే కొండెంగలు కూడా ఉన్నాయి. వీటిని  ‘హనుమాన్​ మంకీ’ అని పిలుస్తారు. మనుషులకు దూరంగా అడవుల్లో ఉండే కొండెంగలతో ఎలాంటి సమస్యా లేదు. సమస్యంతా బానెట్, రీసెస్​ మకాక్​ కోతులతోనే. 
ఈ  కోతులు 25 ఏండ్ల నుంచి 30 ఏండ్ల వరకు జీవిస్తాయి. ఆడకోతికి మూడేండ్లు, మగ కోతికి నాలుగేండ్లు వచ్చేసరికి సంతానోత్పత్తికి రెడీ అవుతాయి. ఆడ, మగ కోతులు ప్రతి ఏటా అక్టోబర్​, డిసెంబర్​ నెలల మధ్య కలుస్తాయి. గర్భధారణ 164  రోజులు ఉంటుంది. సాధారణంగా అయితే ఒక కోతి పిల్లకి జన్మనిస్తాయి. కొన్ని సందర్భాల్లో రెండింటిని కూడా కంటాయి.

అలాగైతే మూడు రకాలు!  

సైకాలజీపరంగా మన రాష్ట్రంలోని కోతులను జువాలజిస్టులు మూడు రకాలుగా విభజించారు. అందులో ఒకటి కమెన్ సెల్ఫ్, రెండు సెమి కమెన్ సెల్ఫ్, మూడోది నాన్ కమెన్ సెల్ఫ్. కమెన్ సెల్ఫ్ ​కోతులు  ఊళ్లల్లో తిరుగుతాయి. ఇవి పూర్తిగా మనుషులపై ఆధారపడతాయి. సెమి కమెన్ సెల్ఫ్ కోతులు అటూ ఇటూ కానివి. రోడ్డు పక్కన, హైవేలపై ఉంటూ ప్రయాణికులు వేసే ఆహారాన్ని తింటాయి. ఇవి క్రమంగా కమెన్​సెల్ఫ్​ కోతులుగా మారతాయి. ఇక నాన్  కమెన్ సెల్ఫ్​ కోతులు పూర్తిగా అడవుల్లో ఉంటాయి. వీటికి సిగ్గు ఎక్కువ. కానీ, ఆహారం దొరక్కపోతే మాత్రం అడవుల నుంచి ఊళ్లలోకి వస్తాయి. క్రమంగా కమెన్​సెల్ఫ్​ రకంగా మారిపోతాయి. 

జనం వల్లే జనంలోకి

ఒకప్పుడు కోతి పూర్తిగా అడవుల్లోనే ఉండేది. అక్కడే గుట్టల్లో... ఆకులు, అలములు, కాయలు, పండ్లు తిని బతికేది. కానీ, మనుషుల జనాభా పెరుగుతున్న కొద్దీ అడవులు తరిగిపోయాయి. నిజాంకాలంలో తెలంగాణలో అడవుల విస్తీర్ణం 40శాతానికి పైగా ఉంటే ఇప్పుడది 24శాతానికి పడిపోయింది. ముఖ్యంగా గోదావరి తీరాన ఉన్న కరీంనగర్​లాంటి జిల్లాలో గ్రానైట్​క్వారీల దెబ్బకు 300కు పైగా గుట్టలు కనుమరుగయ్యాయి. ఆదిలాబాద్​లోని​ కవ్వాల్​, పాలమూరులోని నల్లమలతోపాటు వరంగల్​, ఖమ్మం జిల్లాల్లోని అడవులు నాలుగోవంతే మిగిలాయి. మనిషి తన అవసరాల కోసం చెట్లను నరుకుతూ, గుట్టలను తవ్వుతూ పోవడంతో కోతుల సహజ ఆవాసాలు దెబ్బతిన్నాయి. దాంతో తిండి కోసం మెల్లమెల్లగా ఊళ్లలోకి రావడం మొదలైంది. ముందుగా అడవులకు దగ్గరగా ఉన్న ఊళ్లలో, తర్వాత గుట్టల మధ్య ఉండే పుణ్యక్షేత్రాల్లో మకాం వేయడం మొదలుపెట్టాయి. దేవాలయాల్లో భక్తులు ఇచ్చే కొబ్బరి చిప్పలు, ప్రసాదాలు, అడవి చుట్టుపక్కల గ్రామాల్లోని గిరిజనులు పెట్టే తిండికి మొదట అలవాటు పడ్డాయి. క్రమంగా మనిషికి దగ్గరై గడిచిన 30 ఏండ్లలో రాష్ట్రమంతా విస్తరించాయి.

మనుషుల్లో ఉన్నా డొమెస్టికేట్​ కాలేదు 

దశాబ్దాల కిందే  కోతులు జనాల్లోకి వచ్చినా డొమెస్టికేట్​​ కాలేదు. అంటే పెంపుడు జంతువులు అవ్వలేదు. కానీ.. కోతులు, మనుషులను ఇప్పటికీ శత్రువులుగానే చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా జనాల్లో ఉండే కోతులు ఈజీ ఫుడ్​కు అలవాటుపడ్డాయి. ఫుడ్​ విషయంలో వాటికి కోపం చాలా ఎక్కువ. కండ్ల ముందు కనిపించే ఫుడ్​ను వాటి సొంతం చేసుకునేందుకు ఎంతకైనా తెగిస్తాయి. మనుషులపై ఊహించని రీతిలో దాడి​ చేసి మరీ ఆహారాన్ని ఎత్తుకెళ్తాయి. ఫుడ్​పై కోతులకు ఉండే ఇన్​సెక్యూరిటీ ఫీలింగే అందుకు కారణమని జువాలజిస్టులు చెప్తున్నారు. ఈ ఇన్​సెక్యూరిటీ ఫీలింగ్​తోనే వీలైనంత ఆహారాన్ని వాటి సొంతం చేసుకోవాలనే ఆరాటంలో ఎక్కువ వేస్టేజీ చేస్తాయని చెప్తున్నారు వాళ్లు.

గుంపులో ఉంటే సింహమే

‘ సింహం సింగిల్​గా వస్తుంది. కానీ కోతులు గుంపులుగా వస్తాయి’ – ఒంటరిగా ఉన్నప్పుడు కొండెంగకు సైతం భయపడే కోతి, గుంపులో ఉంటే మాత్రం సింహంలా మనుషులపైనా తిరగబడుతుంది. కోతులు సైగలు, సౌండ్స్​తో కమ్యూనికేట్​ చేసుకుంటాయి. తమపై మనుషులు దాడి చేస్తున్నప్పుడో, ఫుడ్​ దక్కకుండా అడ్డుకుంటున్నప్పుడో అవన్నీ కలిసి దాడి​ చేస్తాయి. కోతుల దాడుల్లో రాష్ట్రంలో ఏటా పది వేలమందికి పైగా గాయపడుతున్నారని ఒక అంచనా. సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో మూడేండ్ల కింద దర్రా మల్లవ్వ కోతుల దాడిలో తీవ్రంగా గాయపడి ట్రీట్మెంట్​ తీసుకుంటూ చనిపోయింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలోనూ ఒక మహిళ పైన కోతుల గుంపు దాడి చేస్తే... బంగ్లా పైనుండి పడిపోయి చనిపోయింది. రాష్ట్రంలో ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొదట్లో కోతులు, కొండెంగలకు భయపడేవి. దీంతో గ్రామ పంచాయతీలు సొంత ఖర్చుతో కొండెంగలను తెప్పించి, కోతులు తిరిగే చోట్ల కట్టేసేవారు. కానీ ఇప్పుడు... కొండెంగలకు కోతులు భయపడట్లేదు. ఇదివరకు పొలాలు, ఇండ్ల వద్ద పెద్ద పులిబొమ్మలు పెడితే వాటిని చూసి కోతులు పారిపోయేవి. కానీ, ఇప్పుడు డోంట్​కేర్​ అంటున్నాయి. 

ప్రొడక్షన్​ ఎక్కువ.. డెత్​ రేట్​ తక్కువ

మెటర్నల్ కేర్ ఎక్కువగా ఉండటంతో కోతుల్లో డెత్ రేట్ తక్కువగా ఉంటుంది. ప్రతి పది కోతి పిల్లల్లో తొమ్మిది బతుకుతాయి. ఒక్కో ఆడ కోతి జీవితకాలంలో పది పిల్లలకు జన్మనిస్తుంది. అందుకే  కోతుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న 35 లక్షల కోతులు రాబోయే పదేండ్లలో రాష్ట్ర జనాభాను దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు జువాలజిస్టులు. యాదాద్రి లాంటి కొన్ని జిల్లాల్లో కోతులు ఇప్పటికే జనాభాలో సుమారు 50 నుంచి 70శాతానికి చేరుకోవడంతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం కోతుల జనాభా అత్యధికంగా ఉన్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణతో పాటు హిమాచల్ ప్రదేశ్​, ఉత్తరాఖండ్ ఉన్నాయి.

జంక్​ఫుడ్​, నాన్​వెజ్​...

మనుషుల మధ్య ఉండే కోతులు క్రమంగా మన ఆహార అలవాట్లు నేర్చుకుంటున్నాయి. ఒకప్పుడు ఆకులు, కూరగాయలు, పండ్లు, విత్తనాలు మాత్రమే తినే కోతులు ఇప్పుడు మనుషులు తినే అన్నం, బ్రెడ్, చపాతీలు, పప్పులు, పల్లీలు, పుట్నాల్లాంటివి తింటున్నాయి. కేకులు, చిప్స్, ​కుర్​కురే, నూడుల్స్, పిజ్జాల్లాంటి జంక్​ఫుడ్​కు కూడా అలవాటుపడ్డాయి. ఈ మధ్యకాలంలో చికెన్, మటన్​లాంటి నాన్​వెజ్​ సైతం లాగిస్తున్నాయని నిర్మల్​లోని మంకీ రెస్క్యూ, రిహాబిలిటేషన్ సెంటర్​కు చెందిన వెటర్నరీ అసిస్టెంట్​ సర్జన్​ డాక్టర్ భట్టు శ్రీకర్ రాజు చెప్పారు. ఇలా వెజ్​తో పాటు నాన్​వెజ్​ తినే కోతులను ఓమ్నీ వోస్  రకం కోతులని పిలుస్తారు.

పంట పొలాల్లో విధ్వంసం

గ్రామాల్లో తిష్టవేసిన కోతులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా తిండి కోసం పంటపొలాలపై దండయాత్ర చేస్తున్నాయి. పండ్లు, కూరగాయలే కాదు వరి, మక్క, జొన్న, గోధుమ, పత్తి, పల్లీ, కంది, సోయా, శనగ.. ఇలా ఒకటేంటి కోతులు ధ్వంసం చేయని పంట లేదు. పంట చేల మీద కోతులు పడ్డప్పుడు తినేది10శాతం ఉంటే వేస్ట్​ చేసేది 90శాతం. ఒకప్పుడు వరి, పత్తి జోలికి వచ్చేవి కాదు. కానీ కొన్నిరోజులుగా పత్తికాయలను ఒలిచి లోపలి గింజలను తింటున్నాయి. వరి పంట పొట్ట దశలో ఉండగా పొట్టను చీల్చి మరీ చప్పరిస్తున్నాయి. మక్క, పెసర, బబ్బర మొగ్గలను గిల్లేస్తున్నాయి. కోతుల మంద పండ్లు, కూరగాయల తోటల్లోకి వెళ్లిందంటే సర్వనాశనమే. 

‘‘భారీ గాలివాన వల్ల వచ్చే నష్టంకంటే కోతుల మంద పడితే కలిగే నష్టమే ఎక్కువ’’ అంటున్నారు రైతులు. చేతికందిన కాయలు, పండ్లను తెంపి పడేస్తున్నాయి. ఒక కాయ తినకముందే పది వేస్ట్​ చేస్తున్నాయి. కూరగాయల చేన్లలో పడితే మొక్కలను తొక్కి పిప్పి చేస్తున్నాయి. నల్గొండ, యాదాద్రి, మంచిర్యాల, కరీంనగర్​లాంటి జిల్లాల్లో ఒకప్పుడు లక్షల ఎకరాల్లో మామిడి, జామ, సపోటా, బత్తాయి లాంటి ఉద్యానపంటలు సాగుచేసిన రైతులు, కోతుల దెబ్బకు తోటలు నరికేస్తున్నారు. టౌన్లు, సిటీలు, మండల కేంద్రాల చుట్టూ ఒకప్పుడు పెద్ద ఎత్తున కూరగాయలు సాగుచేసిన రైతులు కోతుల కారణంగా సగానికి తగ్గించారు. దీంతో పక్క రాష్ట్రాల నుంచి పండ్లు, కూరగాయలను ఎక్కువ రేటుకు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అక్కడక్కడ సాగుచేసిన కూరగాయలు, పండ్ల తోటలను కాపాడుకునేందుకు మన రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. లక్షలు ఖర్చు చేసి ఎలక్ట్రిక్​ ఫెన్సింగ్​లు, నెట్​లు ఏర్పాటుచేసుకుంటున్నారు. అంత ఖర్చు పెట్టలేని వాళ్లు పొద్దంతా డప్పులు, సౌండ్​ సిస్టమ్​తో రాత్రి లేజర్​ లైట్లతో కోతుల నుంచి పంటలను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని వ్యవసాయ దిగుబడుల్లో 20 నుంచి 30 శాతం పంటను కోతుల వల్లే నష్టపోతున్నామని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెప్తున్నారు. కోతుల్ని నియంత్రించకపోతే రాబోయే పదేండ్లలో 50శాతం పంటకు గ్యారెంటీ ఉండదని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ‘ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన’ రివైజ్డ్ గైడ్ లైన్స్ ప్రకారం వన్యప్రాణుల వల్ల నష్టపోయిన పంటలకు రాష్ట్రాలు యాడ్- ఆన్ కవరేజీని అందించాలి. కానీ మన రాష్ట్రంలో రెగ్యులర్ పంట నష్టానికి కూడా సర్కారు పరిహారం ఇవ్వట్లేదు.

జనావాసాల్లో అరాచకం

గ్రామాలు, పట్టణాల్లో కోతులు సృష్టిస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా తలుపులు తీసుకొని ఇండ్లలోకి దూరుతున్నాయి. సంచులు, డబ్బాలు, అన్నం గిన్నెలు.. ఇలా ఏది దొరికితే అది ఎత్తుకెళ్తున్నాయి. బట్టల్ని చించేస్తున్నాయి. వస్తువులను చిందరవందర చేస్తున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో ఇండ్ల ముందు జామ, మామిడిలాంటి పండ్ల చెట్లు, బీర, సొర, చిక్కుడు లాంటి తీగజాతి మొక్కలు పెంచేవారు. కానీ పెరట్లో చెట్లు ఉంటే కోతులు వాటి మీద అడ్డా పెట్టి, ఇండ్లలోకి దూరుతున్నాయని... ఆ చెట్లను కొట్టేస్తున్నారు. దీంతో ఊళ్లలో పెరటితోటలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. 

కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి వరకు  మెయిన్​రోడ్డు వెంట పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉండేవి. వీటిపై కోతులు తిష్టవేసి సమీపంలోని పంట పొలాలను నాశనం చేస్తున్నాయని వాటన్నింటినీ నరికేశారు. రోడ్డు మీద నడుస్తున్న వాళ్లనూ కోతులు వదలట్లేదు. దాడిచేసి, చేతిలో ఉన్న బ్యాగులు లాక్కెళ్తున్నాయి. కిరాణా దుకాణాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కోతుల భయానికి షాపులను ఐరన్​గ్రిల్స్ తో మూసేసి చిన్న కౌంటర్ ద్వారా సరుకులు అమ్మాల్సి వస్తోంది. లేదంటే దుకాణాలను లూటీ చేస్తున్నాయి. ఆఖరికి స్కూళ్లకూ కోతుల బెడద తప్పట్లేదు. పిల్లలను మధ్యాహ్నం భోజనం చేయనీయట్లేదు. కోతుల బెడద భరించలేక జగిత్యాల జిల్లా మల్యాలలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ కొండెంగను పెంచారు. మూడు నెలల క్రితం అటవీశాఖ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు వచ్చి దాన్ని పట్టుకెళ్లారు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఊళ్లల్లో కోతులు ఇండ్లపై పెంకులను పగులగొడుతున్నాయి. దాంతో ఇండ్లకు పైకప్పుగా పెంకుల బదులు రేకులు వేసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి కార్మిక క్షేత్రాల్లో కోతుల దెబ్బకు క్వార్టర్ల మీది రేకులు కూడా విరిగిపోతున్నాయి. కాలనీల్లో గుంపులుగా తిరుగుతూ స్థానికులపై దాడులు చేస్తున్నాయి. సింగరేణి జీఎం ఆఫీస్​ల్లోని విలువైన కంప్యూటర్ పరికరాలను పగులగొట్టి, రికార్డులను ఎత్తుకెళ్తున్నాయి. గనుల ఆవరణలోని షెడ్లలో ఉంచిన బైక్ సీట్లు, ట్యాంకు కవర్లను చింపేస్తున్నాయి. రామకృష్ణాపూర్​లోని రవీంద్రఖని, మందమర్రి రైల్వే స్టేషన్లలో కూడా గుంపులు, గుంపులుగా చేరిన కోతులు ప్రయాణికుల వస్తువులను ఎత్తుకెళ్తూ, అడ్డుకున్నవాళ్లను గాయపరుస్తున్నాయి. 

కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం సున్నా  

మన రాష్ట్రంలో కోతుల జనాభా పెరగడంతో... దాన్ని నియంత్రించేందుకు 2018లో  సర్కారు 30 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇందులో భాగంగా వందలాది గ్రామాలు, పట్టణాల్లో కోతులను పట్టించి ఆదిలాబాద్​లోని కవ్వాల్​ లాంటి అటవీప్రాంతాల్లో వదిలేశారు. నెలలు తిరగకముందే మళ్లీ ఎప్పట్లాగే కోతులు వచ్చి చేరాయి. ఊరూరా మంకీ ఫుడ్​కోర్టులు ఏర్పాటుచేయాలని మొక్కలు నాటారు. కానీ సంరక్షణ లేక​ అవి ఎండిపోతున్నాయి. ఈక్రమంలో గతేడాది వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని సర్కారు చెప్పింది. కోతుల వల్ల అది సాధ్యంకాదని రైతులు తేల్చి చెప్పారు. దీంతో గతేడాది కోతుల జనాభాపై అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​తో రాష్ట్రమంత్రులు రివ్యూ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల కోతులు ఉన్నట్టు అంచనా వేస్తున్నామని, ప్రతి జిల్లాలో కోతుల కుటుంబ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రులు చెప్పారు. 

హిమాచల్ ప్రదేశ్​లో కోతుల నియంత్రణకు ఫాలో అవుతున్న పద్ధతులను స్టడీ చేయాలని సూచించి, కోతుల బెడద నివారణకు కమిటీ కూడా వేశారు. ఈ కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయో తెలియదుకానీ కోతుల లెక్కపై మంత్రుల అంచనా తప్పని ఇటీవల వ్యవసాయశాఖ నిర్వహించిన సర్వేలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షల కోతులు ఉన్నాయని ఆ సర్వే చెప్పడంతో... వాటి నియంత్రణకు సర్కారు ఏమిచేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఎన్ని వేషాలు వేసినా..

ఇండ్లు, పొలాలపై దాడులు చేస్తున్న కోతుల నివారణకు సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జనం వాళ్లకు తోచిన పద్ధతుల్లో కోతులను తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదట్లో కోతుల గుంపులు ఉన్న చోట కొండెంగలను కట్టేసేవారు. మొదట్లో వీటిని చూసి భయపడ్డ కోతులు రానురాను లైట్​ తీసుకున్నాయి. దీంతో మంకీ గన్స్​తో శబ్దం చేసి అవి పారిపోయేలా చేస్తున్నారు. రెండు పైప్ లైన్ ముక్కలు తీసుకుని వాటికి మధ్యలో కప్లింగ్ అమర్చి చివర మూత పెట్టి రంధ్రం మూసేస్తారు. పైప్ మధ్యలో చిన్న హోల్ చేసి లైటర్ అమర్చి ట్రిగ్గర్​లా వాడతారు. హోల్​లో క్యాల్షియం కార్బొనేట్, నాలుగైదు చుక్కల నీరు పోసి ట్రిగ్గర్ నొక్కితే పెద్ద సౌండ్ వస్తుంది. కొందరు ఇండ్ల దగ్గర, పొలం గట్ల దగ్గర పులి బొమ్మలు పెడుతున్నారు. క్రూర మృగాలకు కోతులు బెదురుతుంటాయి. అలాగే ఈ బొమ్మలు చూసి పారిపోతాయన్న ఉద్దేశంతో ఎలాంటి ఎత్తులు వేసినా కోతులముందు పారట్లేదు. దీంతో బ్యాటరీల ద్వారా నడిచే సౌండ్ ఎక్విప్​మెంట్​ను రికార్డు చేసి రాత్రంతా పొలాల్లో పెడుతున్నారు. ఇలాంటి ప్రయత్నాలు కూడా వర్కవుట్​ కాకపోవడంతో సిద్దిపేట జిల్లా నాగసముద్రాల గ్రామంలో ఒక రైతు కొత్తగా ఆలోచించాడు. ఓ కూలీని మాట్లాడి, అతనికి ఎలుగుబంటి వేషం కట్టించి, పొలంలో తిప్పుతున్నాడు. రైతులు కోతులతో పడుతున్న ఇబ్బందులకు ఈ ఎలుగుబంటి వేషమే ఒక ఉదాహరణ.

దక్షిణాదిలో మొదటిది

మన దేశంలో కోతుల జనాభాను అరికట్టడానికి హిమాచల్​ ప్రదేశ్​లోని సిమ్లాలో మొట్టమొదటి మంకీ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్  సెంటర్ ఏర్పాటైంది. తెలంగాణలోనూ కోతుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో 2020 డిసెంబర్ 20 న అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మల్​లోనూ ఇలాంటి సెంటర్​మొదలుపెట్టారు. దేశంలో ఇది రెండో సెంటర్ కాగా, దక్షిణాదిలో మొదటిది. ఇక్కడ కోతులకు స్టెరిలైజేషన్ ఆపరేషన్​ చేసి అడవుల్లోకి వదిలేస్తారు. ఈ సెంటర్​లో రోజుకు 30 కోతులకు ఆపరేషన్​ చేసే ఫెసిలిటీ ఉంది. ఆపరేషన్  తర్వాత వాటిని ఐదు రోజుల పాటు ఇక్కడే ఉంచుతారు. ఇక్కడ ఒక వెటర్నరీ సర్జన్​తో బాటు ఐదుగురు స్టాఫ్​ పనిచేస్తున్నారు. కానీ గడిచిన 16 నెలల్లో కేవలం 735 ఆపరేషన్లు మాత్రమే చేశారు. ఇక్కడికి కోతులను పట్టి, తీసుకొచ్చే బాధ్యతను సర్కారు ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకే అప్పగించింది. కానీ అందుకుమాత్రం ఎలాంటి ఫండ్స్​ కేటాయించలేదు.

 ఒక్కో కోతిని పట్టాలంటే సగటున వెయ్యి రూపాయలు ఖర్చవుతోంది. అసలే ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న లోకల్​బాడీల​కు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కోతులను పట్టి తేవడం కష్టమవుతోంది. కొన్ని గ్రామాలు, మున్సిపాలిటీలో జనరల్​ ఫండ్స్​, ప్రజల నుంచి చందాలు వసూలు చేసి కోతులను పట్టిస్తున్నా కొద్దిరోజుల్లోనే పక్క ఊళ్ల నుంచి వచ్చేస్తున్నాయి. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో కోతుల ఆగడాలు తట్టుకోలేక అక్కడి సర్పంచ్ బాల్ రెడ్డి మూడు లక్షల రూపాయల ఖర్చుతో సుమారు 300 కోతులను పట్టించారు. వాటిని  ఆదిలాబాద్​లోని కవ్వాల్​ అడవుల్లో వదిలేశారు. నెల రోజులు గడిచాయో లేదో పక్క ఊళ్ల నుంచి ఎప్పట్లాగే కోతులు వచ్చి చేరాయి. సర్కారే మండలాలవారీగా కొన్ని కోతులు పట్టే టీములను ఏర్పాటుచేసి, పద్ధతి ప్రకారం నిర్మల్​ తరలించి స్టెరిలైజేషన్​ చేయిస్తే తప్ప కోతులను నియంత్రించడం సాధ్యం కాదని జువాలజిస్టులు అంటున్నారు. 

మక్కజొన్న నాశనం

నేను మూడెకరాల్లో వరి, ఒక ఎకరం మక్కజొన్న వేసిన. కోతుల మందలు చేను మీద పడి మొత్తం మక్క కంకులను విరిచిపారేసినయ్​. వరిపంట మీద పడి నానా బీభత్సం చేసినయ్​. ఏ ఆఫీసరుకు చెప్పినా ‘మమ్మల్నేం జేయమంటవ’ని అంటున్నరు. కోతుల బాధ తప్పించి, పంటలను సర్కారే కాపాడాలె.
- గట్టు స్వామి, మొట్లపల్లి, పెద్దపల్లి జిల్లా

చేతులిరిగి లక్ష ఖర్చు

మా ఊళ్లో వేల కోతులున్నయ్​. 20 మందిని కర్సినయ్​. కోతులు దాడి చేస్తే కింద పడి మా ఇద్దరి పిల్లల చేతులు విరిగినయ్​. ట్రీట్మెంట్​కు లక్షకుపైగా ఖర్చయింది. పబ్లిక్ మస్తు ఇబ్బంది పడుతున్నా... కోతుల గురించి ఎవరూ పట్టించుకుంటలేరు.
- శ్రీనివాస్, రైతు, శివ్వంపేట, మెదక్ జిల్లా

గోస పడుతున్నం   

కోతుల సమస్యతో రోజూ నరకయాతన పడుతున్నం. ప౦టలను కాపాడుకునే౦దుకు పగలు, రాత్రి చేన్లలోనే ఉంటున్నం. రోజుకు ఇద్దర౦ కాపలా ఉండవలసి వస్తున్నది. ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుంటలేరు. ప౦ట చేతికొచ్చేదాక పరేషాన్​ అయితుంది. కోతులను చేలలోకి రాకుండా వలలు, మైకులు పెడుతున్నం.
- రొడ్డ చిన్న గ౦గన్న, నలదుర్తి, 
మామడ మండలం, నిర్మల్ జిల్లా​

పౌష్టికాహారం దూరం

కోతుల వల్ల గిరిజన చిన్నారులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. ఐటీడీఏ ఆఫీసర్లు చేసిన సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా కోతుల ప్రభావం ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ. వాటి బాధ తట్టుకోలేక ఆదిలాబాద్‌‌‌‌, కుమ్రంభీం ఆసిఫాబాద్​, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలాంటి‌‌‌‌ జిల్లాలో గిరిజనులు ఆహార పంటలు, పప్పుధాన్యాల సాగును వదిలి పెట్టి పత్తి, పొగాకు లాంటి పంటల వైపు మళ్లారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం రాష్ట్రంలో అత్యధిక పోషకాహార లోపం ఉన్న జిల్లాగా ఆదిలాబాద్ నమోదైంది. జిల్లాలో ఐదేండ్లలోపు పిల్లల్లో 38 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. ఆహార పంటలు సొంతంగా వేసుకుంటే పోషకాహార లోపం చాలావరకు తగ్గేది. కానీ కోతుల వల్ల అలాంటి పంటలు వేసుకునే అవకాశం లేకుండా పోతోంది.

కోతులతో పరేషాన్ 

కోతులతో రోజూ కష్టాలు పడుతున్నం. ఇంట్లో ఉన్నా తలుపులు బంద్​ చేసుకోవాల్సి వస్తంది. తలుపు తీసి ఉంటే ఇంట్లో చొరబడి వస్తువులు ఎత్తుకుపోతున్నయ్​. ఇంటి ముంగిట ఉన్న చెట్ల మీది పండ్లు, కూరగాయలు చేతికి రానిస్తలేవు. వచ్చినప్పుడల్లా 3,4 వందల కోతులు మందలెక్క వస్తున్నయ్​.
- దేవరనేని శ్రీమతి, 
ముత్తారం

యాదాద్రి జిల్లాలో జనాభాకు చేరువలో.. 

యాదాద్రి జిల్లాలో కోతుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. జిల్లా జనాభాకు చేరువలోకి కోతులు వచ్చేశాయి. యాదాద్రి జిల్లాలోని17 మండలాల్లో 7.94 లక్షల జనాభా  ఉండగా కోతుల సంఖ్య 5లక్షల17వేల578  కు(67శాతానికి) చేరింది. ఈ జిల్లాలోని రాజాపేట, గుండాల మండలాల్లోనైతే జనాభాను మించి కోతుల సంఖ్య ఉంది. గతేడాది సర్కారు ఆదేశాలతో అగ్రికల్చర్​ ఆఫీసర్లు రాష్ట్రవ్యాప్తంగా కోతుల లెక్క తీశారు.  దీంతో అన్ని జిల్లాల్లో సర్వే చేసి, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 లక్షల కోతులు ఉన్నట్లు గుర్తించారు. ఇది రాష్ట్ర జనాభాలో దాదాపు పది శాతం కాగా, అనూహ్యంగా యాదాద్రి జిల్లాలో 5లక్షలకు పైగా కోతులు ఉన్నట్లు తేలింది.  

::: చిల్ల మల్లేశం
::: వెలుగు నెట్​వర్క్​