ఫ్లూ వైరస్​లతో ఇమ్యూనిటీ వీక్.. తెలంగాణలో సర్ది, దగ్గుతో జనం అవస్థలు

ఫ్లూ వైరస్​లతో ఇమ్యూనిటీ వీక్..   తెలంగాణలో సర్ది, దగ్గుతో జనం అవస్థలు

 

  • ఫ్లూ వైరస్​లతో ఇమ్యూనిటీ వీక్
  • అదను చూసి ఎటాక్ చేస్తున్న బ్యాక్టీరియా‌‌‌‌ 
  • రాష్ట్రంలో రోజుల తరబడి సర్ది, దగ్గుతో జనం అవస్థలు
  • ఫ్లూ వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లే కారణమంటున్న డాక్టర్లు 
  • బలంగా మారిన ఇన్‌‌ఫ్లుయెంజా రకం వైరస్​లు 

హైదరాబాద్, వెలుగు:  కొన్నాళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా చాలా మంది జ్వరం, సర్ది, దగ్గుతో బాధపడుతున్నారు. గతంలో నాలుగైదు రోజుల్లో.. మహా అంటే వారం, పది రోజుల్లో తగ్గిపోయే ఈ రోగాలు ఇప్పుడు మాత్రం ఒక పట్టాన వదలడం లేదు. కనీసం 15 నుంచి 20 రోజులపాటు జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. కొంత మంది జ్వరం, దగ్గుతో పాటు లంగ్ ఇన్ఫెక్షన్ బారిన కూడా పడుతున్నారు. చాలా మందికి రోగ తీవ్రత ఎక్కువగా ఉండి, దవాఖాన్లలో కూడా అడ్మిట్ అవుతున్నారు. 

దీంతో దవాఖాన్లు కిటకిటలాడుతున్నాయి. అయితే, దీనంతటికి కారణం ఫ్లూ వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లేనని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా మళ్లీ విజృంభిస్తోందన్న ప్రచారం సాగుతోందని, అది మాత్రం నిజం కాదని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం బడి ఈడు పిల్లల్లో శ్వాసనాళంపై ప్రభావం చూపే ఆర్ఎస్‌‌వీ(రెస్పిరేటరీ సిన్‌‌సీషియల్ వైరస్‌‌), సర్దికి కారణమయ్యే రైనో వైరస్‌‌ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండగా.. పెద్ద వాళ్లలో ఇన్‌‌ఫ్లుయెంజా ఏ రకం (హెచ్‌‌1ఎన్‌‌1, హెచ్‌‌3ఎన్‌‌2) వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇవన్నీ పాత వైరస్‌‌లే. కానీ ఇప్పుడు ఇవి ఇంతగా విజృంభించడానికి, వారాల తరబడి రోగం తగ్గకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయని చెప్తున్నారు.   

బలంగా మారిన వైరస్

ఇన్‌‌ఫ్లుయెంజా వైరస్‌‌లు ఏటా జనాలను ఇబ్బంది పెట్టడం సాధారణ విషయమే. అయితే, ఈ వైరస్‌‌లు ఎప్పుడూ మార్పులు చెందుతూ ఉంటాయని.. కొన్నిసార్లు బలంగా, మరికొన్నిసార్లు బలహీనంగా మారుతాయని ఎక్స్‌‌పర్ట్స్ చెబుతున్నారు. ఈసారి రాష్ట్రంలో, దేశంలో విస్తరిస్తున్న వైరస్‌‌ల వేరియంట్లు బలంగా ఉన్నాయంటున్నారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ఈ వైరస్‌‌ల బారిన పడి, తిరిగి కోలువడానికి ఎక్కువ రోజులు పట్టడానికి ఇదే కారణమని  పేర్కొంటున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్‌‌ల ప్రభావం ఎక్కువగా పడి, దవాఖాన్లలో చేరాల్సిన పరిస్థితి వస్తోందని చెబుతున్నారు. ఇక వృద్ధులు, డయాబెటిస్ పేషెంట్లు, ఇతర క్రానిక్ ఇల్‌‌నెస్‌‌ ఉన్న పేషెంట్లలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోంది. హాస్పిటళ్లలో అవుతున్న అడ్మిషన్లలో 90 శాతం మంది కోమార్బిడ్ పేషెంట్లే ఉంటున్నారు. ఇంకో పది శాతం మందిలో ఎలాంటి కోమార్బిడిటీస్ లేకపోయినా, రోగం తీవ్రత ఎక్కువగా ఉంటోందని అంటున్నారు. కరోనా వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ పడిపోవడం లేదా ఇంకేదైనా కారణాల వల్ల వీరిలో రోగ తీవ్రత ఎక్కువగా ఉండొచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. 

లంగ్స్‌‌పైనా ఎఫెక్ట్‌‌

జ్వరాల బారిన పడి దవాఖాన్లలో చేరుతున్న వారిలో కొంత మందికి లంగ్‌‌ ఇన్ఫెక్షన్ కూడా ఉంటోంది. వైరల్ ఇన్ఫెక్షన్‌‌ వల్ల ఇమ్యూనిటీ లెవల్స్‌‌ పడిపోయిన తర్వాత బ్యాక్టీరియా ఎటాక్ చేస్తుండడం వల్లే ఇలా జరుగుతోందని పల్మనాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వస్తున్న లంగ్ ఇన్ఫెక్షన్లకు కరోనాకు సంబంధం లేదని చెబుతున్నారు. మన శరీరం లోపలికి చేరే హానికర బ్యాక్టీరియాను మన ఇమ్యూన్ సిస్టమ్ అడ్డుకుంటుంది. వైరస్‌‌ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు, బ్యాక్టీరియా ఎటాక్‌‌ను అడ్డుకోలేకపోవడం వల్లే లంగ్‌‌ ఇన్ఫెక్షన్ వంటివి కనిపిస్తున్నాయంటున్నారు.  

ఫ్లూ వైరస్​లే కారణం 

ఇమ్యూనిటీ తక్కువున్న కొంతమందిలో వైరల్ న్యుమోనియా లంగ్‌‌ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. జ్వరం తగ్గిపోయాక కూడా దగ్గు, ఆయాసం, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే.. పీవీబీగా భావించవచ్చు. కరోనా వల్లే ఇలా జరుగుతోందన్న ప్రచారంలో నిజం లేదు. ఇన్‌‌ఫ్లుయెంజా, స్వైన్‌‌ఫ్లూ వైరస్‌‌లే పాజిటివ్‌‌గా వస్తున్నాయి.      
- డాక్టర్ వి.వి.రమణ ప్రసాద్, కిమ్స్ ఆస్పత్రి 

ఈ వైరస్ చాలా బలంగా ఉంది

మనలో ఇమ్యూనిటీ లెవల్స్‌‌ తక్కువగా ఉన్నప్పుడు వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నా, రోగ తీవ్రత ఎక్కువే ఉంటుంది. వైరస్‌‌ బలంగా ఉన్నప్పుడు, ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్నవారిలో కూడా ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు వ్యాపిస్తున్న వైరస్‌‌ బలంగా ఉన్నందుకే ఇమ్యూనిటీ లెవల్స్ మంచిగా ఉన్నవారికీ సీరియస్ అవుతోంది.
- డాక్టర్ రాజారావు,
సూపరింటెండెంట్‌‌, గాంధీ హాస్పిటల్ 

ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలె  

ఇన్‌‌ఫ్లుయెంజా వైరస్‌‌ల బారిన పడకుండా ఉండడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఏడాదికి ఓసారి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే, ఇలాంటి రోగాల బారి నుంచి రక్షణ పొందొచ్చు. వయసును బట్టి రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. 
- డాక్టర్ హరీశ్‌‌ రెడ్డి, 
గ్యాస్ట్రో కేర్ క్లినిక్‌‌, నల్లగండ్ల