బెల్లంపల్లిని కమ్మేస్తున్న డంప్ యార్డ్ పొగ .. ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు

బెల్లంపల్లిని కమ్మేస్తున్న డంప్ యార్డ్ పొగ .. ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణాన్ని డంపింగ్​యార్డు పొగ కమ్మేస్తోంది. మున్సిపాలిటీ నిర్వాకంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. పట్టణంలోని తాళ్ల గురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఐటీడీఏ నర్సరీ మధ్యలోని డంపింగ్ యార్డులోనుంచి వచ్చే పొగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్​అధికారులు చెత్తను రీసైక్లింగ్​ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుండడంతో చెత్త గుట్టలుగా పేరుకుపోయి, ఎక్కడో ఓ చోట మంటలు అంటుకొని నిత్యం పొగ వెలువడుతూనే ఉంది. దీనికి తోడు దుర్వాసన ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

నిత్యం పొగ కారణంగా పట్టణంలోని గోల్ బంగ్లా బస్తీ, బెల్లంపల్లి బస్తీ, నెంబర్ టూ ఇంక్ లైన్ బస్తీ , బూడిద గడ్డ బస్తీకి చెందిన ప్రజలు శ్వాస కోస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. రాత్రి వేళల్లో నిద్రిస్తున్న సమయంలో ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారిందని వాపోతున్నారు. గతంలో కన్నాలబస్తీలో ఉన్న డంపింగ్ యార్డును ఎత్తివేయాలని చుట్టుపక్కల ప్రజలు డిమాండ్​చేశారు.

 ఆ స్థలంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయడంతో ఆ డంప్​యార్డును మున్సిపాలిటీ ఎత్తేసి బస్తీ పోచమ్మ చెరువు పరిసర ప్రాంతాల్లోని తాళ్ల గురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హార్టికల్చర్ నర్సరీ మధ్యలో ఏర్పాటు చేసింది. చెత్తను రీసైక్లింగ్ చేయాల్సిన మున్సిపల్ పాలకవర్గం పట్టించుకోకపోవడంతో సమస్య తలెత్తుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్య తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.