కరోనా టైంలో 9లక్షల కొత్త బండ్లు కొన్నరు

కరోనా టైంలో 9లక్షల కొత్త బండ్లు కొన్నరు

హైదరాబాద్​, వెలుగు: కరోనా మహమ్మారి సమయంలో జనం వాహనాలను మస్తు ఎక్కువ కొన్నారు. కరోనా భయం కావొచ్చు.. ఆర్టీసీ బస్సులు, రైళ్లు సరిగా నడవకపోవడం కావొచ్చు.. కారణమేదైనా ఎక్కువ మంది సొంత బండ్లలోనే ప్రయాణం కట్టారు. ఈ క్రమంలోనే ఎక్కువగా వాహనాలను కొనుగోలు చేశారు. ఫస్ట్​వేవ్​లో కాస్త డల్​గానే ఉన్నా.. సెకండ్​వేవ్​లో మాత్రం వాహన కొనుగోళ్లకు డిమాండ్​ బాగా పెరిగింది. నిరుటి నుంచి ఇప్పటిదాకా 9 లక్షలకుపైగా కొత్త బండ్లను కొనుగోలు చేశారు. వీటిలో బైకులు 7.4 లక్షలు, కార్లు 1.3 లక్షలు, ఇతర వాహనాలు 30 వేల దాకా ఉన్నాయి. లగ్జరీ కార్ల కొనుగోళ్లూ ఎక్కువగా జరిగాయి. ఈ అమ్మకాలతో ఆర్టీఏకి కూడా ఆమ్దానీ బాగానే వచ్చింది. ఆర్టీఏ లెక్కల ప్రకారం నెలకు సగటున 70 వేల బండ్లకు రిజిస్ట్రేషన్​ చేశారు.

సెకండ్‌ హ్యాండ్‌ బండ్లు కూడా..

కొత్త బండ్లు కొనే స్థోమత లేనోళ్లు పాత బండ్ల వైపు మొగ్గు చూపారు. దీంతో సెకండ్​ వెహికల్​ సేల్స్​ కూడా బాగా పెరిగాయి. ధరలు తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది వాటిని కొన్నారు. అందులోనూ చాలా మంది ఆన్​లైన్​లోనే వెహికల్స్​ కొన్నారు. డీలర్లు, ఏజెంట్లు, తెలిసినోళ్ల దగ్గర కూడా కొందరు కొనుకున్నారు. నెలకు సగటున 60 వేల సెకండ్​ హ్యాండ్​ బండ్లకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. హైదరాబాద్​తో పాటు, వరంగల్​, కరీంనగర్​లాంటి సిటీల్లో సెకండ్​ హ్యాండ్​ వాహనాల ఏజెన్సీలు బాగా పెరిగాయి. కొందరు ఫైనాన్షియర్లు కూడా కిస్తీ కట్టని బండ్లను లాక్కొచ్చి తక్కువ ధరకు అమ్ముతున్నారు.  

ఏటేటా బండ్లు పెరుగుతున్నయ్​

రాష్ట్రంలో ఏటా బండ్లు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మే 31 వరకు 1.37 కోట్లకుపైగా వాహనాలున్నాయి. అందులో ఎక్కువగా బైకులే కోటీ 2 లక్షలున్నాయి. 18.3 లక్షల కార్లుండగా, మిగతావి గూడ్స్​ క్యారేజీలు, ఆటోలు, ఎడ్యుకేషనల్‌ బస్సులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. దీంతో ఆర్టీఏకి పన్నుల రూపంలో ఆదాయం బాగా వస్తోంది. ఒక్క 2020–21లోనే రూ.3,228 కోట్ల ఆదాయం వచ్చింది.

రోజూ 40 కార్లు అమ్ముడైనయ్​

లాక్​డౌన్​తో రవాణా వ్యవస్థ పూర్తిగా ఆగిపోయింది. దానికి తోడు పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​తో కరోనా సోకే ముప్పుందని చాలా మంది బండ్లు కొంటున్నరు. ఒక్కో షోరూంలలో రోజూ 25 నుంచి 40 వరకు కార్లు అమ్ముడైనయి. ఇప్పుడు రోజూ 5 నుంచి 10లోపు అమ్ముడుపోతున్నయి. ఎక్కువ మంది రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖరీదుంటున్న చిన్న కార్లనే కొంటున్నరు. 
- చైతన్య , ట్రూవాల్యూ కార్స్ ఎగ్జిక్యూటివ్, హబ్సిగూడ వరుణ్‌ మోటార్స్‌

బస్సుల్లో ఇబ్బందని బైక్​ కొన్న

నేను రోడ్​ సైడ్​ వ్యాపారం చేస్తున్న. లాక్​డౌన్​ టైంలో బస్సులు, రైళ్లు అందుబాటులో లేక చాలా ఇబ్బందులు పడిన. పిల్లలతో ఊరికి పోవాలంటే దోస్తు బండిని అడగాల్సొస్తుండే. ఎక్కడకు పోవాలన్న మస్తు ఇబ్బంది అయింది. బస్సుల్ల పోవాలన్న కరోనా భయం ఉంది. అందుకే ఫైనాన్స్​లో బైకును కొనుకున్న.  
- సునీల్​ కుమార్​,  సికింద్రాబాద్​