రేషన్​ బియ్యాన్ని తినడానికి జనం ఇష్టపడడం లేదు

రేషన్​ బియ్యాన్ని తినడానికి జనం ఇష్టపడడం లేదు
  • క్వాలిటీ పట్టించుకోని సివిల్ ​సప్లయీస్​ కార్పొరేషన్​ 
  •     టెక్నికల్ ​అసిస్టెంట్ల ఖాళీలతో చెకింగ్​ నామమాత్రం  
  •     గతంలో ఎఫ్​సీఐ ద్వారా నాణ్యమైన బియ్యం సప్లై 
  •      క్వాలిటీ పెంచడం, సన్నబియ్యంతోనే పరిష్కారం   

మంచిర్యాల, వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.వందల కోట్లు వెచ్చించి పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్​ బియ్యాన్ని జనం తినడానికి ఇష్టపడడం లేదు. దొడ్డు బియ్యం ఇస్తుండడం, క్వాలిటీ లేకపోవడంతో వండితే ముద్దయి గొంతు దిగడం లేదని లబ్ధిదారులంటున్నారు. ముక్కిపోయి..పురుగులు పట్టి.. రంగుమారి..వాసన వస్తుండడంతో ముద్ద నోట్లోకి పోవడం లేదని, తింటే అజీర్తి చేసి అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. దీంతో చాలామంది రేషన్​బియ్యాన్ని డీలర్లకు, దళారులకు కిలో రూ.10 చొప్పున అమ్మేస్తున్నారు. రాష్ర్టంలో 90 లక్షలకు పైగా రేషన్​కార్డులుండగా, ఒక్కో యూనిట్​కు 6 కిలోల చొప్పున ప్రతి నెలా 2లక్షల టన్నులను పంపిణీ చేస్తున్నారు. ఇందులో సుమారు 70 నుంచి 80 శాతం బయటికే పోతోంది. మళ్లీ వాటిలో 40 శాతం రీసైక్లింగ్​ ద్వారా మిల్లుల నుంచి లబ్ధిదారులకే చేరుతోంది. మిగతావి కోళ్లు, చేపల దాణాకు, రవ్వ, పిండికి, బేవరేజెస్ కంపెనీల పాలవుతున్నాయి. 

క్వాలిటీ చెకింగ్ ​పట్టని కార్పొరేషన్​ 

ప్రభుత్వం సివిల్ సప్లయీస్ ​కార్పొరేషన్​ ద్వారా పీడీఎస్​ రైస్​ను మిల్లుల నుంచి సేకరిస్తోంది. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల దగ్గర కొన్న వడ్లను మిల్లులకు ఇస్తోంది. మిల్లింగ్ ​చేసిన తర్వాత బియ్యాన్ని సేకరించి స్టేజ్​వన్​ గోదాముల్లో నిల్వ చేస్తోంది. అక్కడినుంచి ప్రతి నెలా మండల్ ​లెవల్​స్టాక్​ (ఎంఎల్​ఎస్​) పాయింట్లకు తరలించి రేషన్​షాపులకు పంపిస్తోంది. ఈ క్రమంలో ఎక్కడా క్వాలిటీ చెకింగ్​ జరగడం లేదు. గతంలో లెవీ సిస్టం అమలులో ఉన్నప్పుడు కేంద్రం ఎఫ్​సీఐ ద్వారా బియ్యాన్ని సేకరించి రాష్ర్టాలకు కేటాయించేది. 2013లో లెవీని 75 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. అప్పటి ఉమ్మడి రాష్ర్ట సీఎం కిరణ్​కుమార్​రెడ్డి 'మన బియ్యం' పేరిట కొత్త స్కీం తీసుకువచ్చారు. దీని ప్రకారం రాష్ర్టానికి అవసరమైన బియ్యాన్ని ప్రభుత్వమే కస్టమ్ ​మిల్లింగ్ ​రైస్​(సీఎమ్మార్​) ద్వారా సేకరించుకుంటోంది. ఈ సబ్సిడీ మొత్తాన్ని మినిమమ్​ సపోర్ట్​ ప్రైస్​ రూపంలో కేంద్రం రాష్ర్టానికి చెల్లిస్తోంది. అప్పుడు బియ్యం నాణ్యత విషయంలో ఎఫ్​సీఐ రూల్స్​ స్ర్టిక్ట్​గా అమలు చేసేది. 'మన బియ్యం' పథకంతో రైస్​ క్వాలిటీ దెబ్బతినగా టీఆర్ఎస్ ​ప్రభుత్వం వచ్చాక పూర్తిగా దిగజారింది. సివిల్​సప్లయీస్​కార్పొరేషన్​లో రాజకీయ జోక్యం ఎక్కువైంది. మరోవైపు సిబ్బంది కొరతతో ఎఫ్​సీఐలో పనిచేసి రిటైర్ ​అయిన వాళ్లను ఔట్​సోర్సింగ్​లో టెక్నికల్​అసిస్టెంట్లుగా నియమించుకుంటోంది. వీళ్లు కూడా సరిపోయేంత సంఖ్యలో లేకపోవడంతో క్వాలిటీ చెకింగ్​ కాగితాలకే పరిమితవుతోంది.   

రీసైక్లింగ్​తో మరింత నాసిరకం.. 

పీడీఎస్​ బియ్యం క్వాలిటీ లేకపోగా రీసైక్లింగ్​వల్ల నాణ్యత కోల్పోతోంది. చాలామంది మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన వడ్లను మిల్లింగ్​ చేసి ఓపెన్​ మార్కెట్​లో రూ.30కి కిలో చొప్పున అమ్ముకుంటున్నారు. దీంతో ఎఫ్​సీఐకి, సివిల్​ సప్లయీస్​ కార్పొరేషన్​కు బాకీ ఉన్న సీఎంఆర్​ లోటును పూడ్చుకునేందుకు మిల్లుల ఓనర్లు రీసైక్లింగ్ ​మార్గాన్ని ఎంచుకున్నారు.  ఎఫ్​సీఐ క్వాలిటీ విషయంలో నిక్కచ్చిగా ఉండడంతో వారి పప్పులు ఉడకడం లేదు. దీంతో సివిల్​సప్లయీస్​ఆఫీసర్లను 'మేనేజ్​' చేసి ఆ బియ్యాన్ని పీడీఎస్​కు అంటగడుతున్నారు. 

రీసైక్లింగ్​ దందా ఇలా.... 

రాష్ట్రంలో చాలామంది రేషన్​ డీలర్లు.. కార్డుదారులతో వేలిముద్ర (బయోమెట్రిక్​) వేయించుకొని కిలో బియ్యానికి రూ.10 చొప్పున చెల్లిస్తున్నారు. కొందరు చిరు వ్యాపారులు పల్లెలు, పట్టణాల్లో వాడవాడలా తిరిగి బియ్యం కొంటున్నారు. దళారులకు కిలో రూ.15కు అమ్ముతున్నారు. వాళ్లు బడా వ్యాపారులకు, రైస్​మిల్లర్లకు రూ.20 నుంచి రూ.22 వరకు విక్రయిస్తున్నారు. ప్రతి నెలా పంపిణీ చేస్తున్న కోటాలో సుమారు 70 నుంచి 80 శాతం బియ్యం ఇలానే పక్కదారి పడుతున్నాయి. ఇందులో 40 శాతం లబ్ధిదారులకే చేరుతోంది. ఈ క్రమంలో బియ్యం మిల్లింగ్​చేసి ఎక్కువ రోజులు కావడంతో పాడవుతున్నాయి. ఈ విషయం సివిల్​ సప్లయీస్​ ఆఫీసర్లకు తెలిసినప్పటికీ మిల్లర్లతో మిలాఖత్​ అయి పట్టించుకోవడం లేదు.    

కలర్​ టెస్టింగ్​ సిస్టమ్​ ఉన్నా నో యూజ్​​.. 

రేషన్​ బియ్యం రీసైక్లింగ్​దందాను అరికట్టేందుకు ప్రభుత్వం కలర్​ టెస్టింగ్​ సిస్టమ్​ తీసుకొచ్చింది. కలర్​ టెస్టింగ్​లో మిథైల్​రెడ్​, బ్రోయోథైమోల్​ బ్లూ, ఇథైల్​అల్కాహాల్​, ప్యూరిఫైడ్​వాటర్​ లిక్విడ్​లో ఐదు గ్రాముల బియ్యం వేసి నిమిషం పాటు ఉంచితే రంగు మారుతుంది. దీని ప్రకారం ఎన్ని నెలల కిందటి బియ్యం అని గుర్తించే అవకాశం ఉన్నా ఉపయోగించుకోవడం లేదు.  

క్వాలిటీ రైస్​, సన్నబియ్యం ఇస్తేనే ఉపయోగం.. 

పేదలకు ఆహార భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు వందల కోట్లు ఖర్చు పెడుతున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. కిలో బియ్యంపై కేంద్రం సుమారు రూ.30, రాష్ర్టం రూ.2 చొప్పున భరిస్తూ లబ్ధిదారులకు రూపాయికి కిలో బియ్యం అందజేస్తున్నాయి. తెలంగాణలో 90 లక్షల పైచిలుకు రేషన్​ కార్డులుండగా, 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం బీపీఎల్​సర్వే ప్రకారం రాష్ర్టంలో 54.37 లక్షల కార్డులు, 1.91 కోట్ల యూనిట్లకు నెలకు 5 కిలోల చొప్పున బియ్యం అందిస్తోంది. మిగతా కార్డుదారులకు అయ్యే ఖర్చును రాష్ర్ట ప్రభుత్వమే భరిస్తోంది.​ ఎన్నికలప్పుడు కొత్త రేషన్​ కార్డులు జారీ చేస్తామని హామీ ఇవ్వడం, సంక్షేమ పథకాలకు లింక్​ చేయడం వల్ల రాష్ర్టంలో రేషన్​కార్డుదారుల సంఖ్య భారీగా పెరిగింది. రేషన్​బియ్యం తినని వర్గాల వాళ్లు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి కార్డులు పొందారు. ఇలాంటి వాళ్లను గుర్తించి కార్డులు కట్​ చేస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. నాణ్యమైన దొడ్డు బియ్యం ఇవ్వడం, లేదంటే కొంత రేటు పెంచి సన్నబియ్యం అందిస్తే పేదల కడుపులు నిండడంతో పాటు పథకం లక్ష్యం కూడా నెరవేరుతుంది.  

దొడ్డు బియ్యం తినలేకపోతున్నం...

నేను కూలి చేస్త. నెలలో పది పదిహేను రోజులే పని దొరుకుతది. మా ఇంట్ల ఆరుగురం ఉంటం. నెలకు 40 కిలోల బియ్యం పడ్తయి. రేషన్ షాపుల దొడ్డు బియ్యం పోస్తున్రు. కొన్నిసార్లు పురుగులు, తుట్టెలు వస్తున్నయ్. అసలు తినలేకపోతున్నం. మార్కెట్ల ఉప్పు పప్పులతోటి అన్ని సామాన్ల రేట్లు పెరిగినయి. సన్నబియ్యం కిలో రూ.40 పైనే ఉన్నయి. అయినా కొనక తప్పుతలేదు. మాలాంటి పేదోళ్లకు ఇది భారమే. కొద్దిగా రేటు పెంచి సన్నబియ్యం ఇస్తే అందరూ తింటరు. 
-  రమేష్, హన్మాన్​ బస్తీ, బెల్లంపల్లి 

తింటే అరుగుత లేదు... 

మా ఇంట్ల నేను, మా పెద్దాయన ఉంటం. మాకు భూములు జాగల్లేవు. వయసైపోయింది. పని చేద్దామంటే చేతగావట్లే. కారటి మీద 12 కిలోల బియ్యం వస్తున్నయ్. గా దొడ్డు బియ్యం అన్నం ముద్దయితుంది. గింత రుచి ఉంటలేదు. తింటే అరుగుత లేదు. బయట సన్నబియ్యానికి మస్తు రేటున్నది. మేము కొనుక్కొని తినలేం. మాకు ముగ్గురు కొడుకులు, నలుగురు బిడ్డలు. ఎవల బతుకులు వాళ్లవే. ఎప్పుడన్న కొడుకులు బియ్యం ఒక్క బత్త కొనిత్తరు. గవి ఎన్ని రోజులు తింటం. సన్న బియ్యం ఇయ్యాలె.
– రాజారపు మధునక్క, రాంపూర్ (కోటపల్లి మండలం)