కౌలు రైతుకు కష్టాలు..వానలు,తెగుళ్లతో తగ్గిన దిగుబడి.. ఎకరానికి 10 బస్తాల వరకు షార్టేజ్

కౌలు రైతుకు కష్టాలు..వానలు,తెగుళ్లతో తగ్గిన దిగుబడి.. ఎకరానికి 10 బస్తాల వరకు షార్టేజ్
  •     సన్నాల బోనస్​తో పెరిగిన కౌలు రేట్లు

నిజామాబాద్​, వెలుగు: భూములు కౌలుకు తీసుకుని వరి పంట వేసుకున్న రైతులు నిండా మునుగుతున్నారు. ఈసారి భారీ వర్షాల కారణంగా ఒక దిక్కు వరి దెబ్బతినగా.. మిగిలిన పంటకు తెగుళ్లు సోకి దిగుబడులు తగ్గిపోయాయి. పెరిగిన కౌలు రేట్లు, తగ్గిన దిగుబడుల వల్ల కోలుకోలేని విధంగా దెబ్బ తినాల్సివస్తుందని కౌలు రైతులు వాపోతున్నారు. జిల్లాలో భారీ వర్షాల ప్రభావం వరి పంటపై పడింది. 

పంట పూత, పాలు పోసుకునే స్టేజ్​లో కురిసిన ఎడతెగని వానల కారణంగా పంటకు కొలికిరోగం, ఎండాకు తెగులు సోకాయి. క్రిమిసంహారక మందులు చల్లినా అదుపులోకి రాకపోవడంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. సొంతంగా సాగు చేసుకున్న రైతులకు పెట్టుబడి అయినా వస్తుంది కానీ.. కౌలురైతులు మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సివస్తోంది. 

జిల్లాలో వానాకాలం సీజన్​లో 5.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 4.27 లక్షల ఎకరాల్లో వరి, 47,678 ఎకరాల్లో మొక్కజొన్న, 37,859 ఎకరాల్లో సోయాబిన్, 1,332 ఎకరాల్లో పత్తి, 855 ఎకరాల్లో కంది, 514 ఎకరాల్లో శనగ, 356 ఎకరాల్లో వేరుశనగ సాగు వేశారు. 3.70 లక్షల ఎకరాల్లో సన్న రకాలు సాగు చేశారు. 1.40 లక్షల ఎకరాల్లో కౌలు రైతులే వరి వేశారు. 

ప్రభుత్వం సన్న వడ్లకు రూ. 500 బోనస్​ ప్రకటించడంతో జిల్లాలో కౌలు రేట్లు బాగా పెరిగాయి. గతంలో ఎకరానికి రూ. 18 వేలున్న కౌలు ఇప్పుడు ఎకరానికి రూ. 22 వేలకు పెంచేశారు. వడ్ల రూపంలో గతంలో ఎకరానికి 13 క్వింటాళ్లు ఉండగా ఇప్పుడు 16 క్వింటాళ్లకు పెంచారు. ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి.

 ఇందులో 28,131ఎకరాల్లో వరి పంట పూర్తిగా దెబ్బ తిన్నది. మిగతా పంటను కొలికిరోగం, ఎండాకు తెగులు దెబ్బతీశాయి. ఎకరానికి 40 బస్తాల దిగుబడి రావాల్సిఉండగా తెగుళ్ల కారణంగా 30 నుంచి 32 బస్తాలు మాత్రమే వస్తున్నాయి. ఎకరానికి నుంచి 10 బస్తాల దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా 12.5 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసి అధికారులు 1.50 లక్షల టన్నుల వరకు దిగుబడి తగ్గుతుందని తాజాగా లెక్కలు వేశారు.

తిండి గింజలు కూడా మిగల్లే 

ఉపాధి కోసం గల్ఫ్​వెళ్లి.. భార్యాపిల్లలకు దూరం ఉండడం బాధనిపించి వాపస్​ వచ్చిన. ఐదెకరాలు కౌలు తీసుకొని వరి వేసిన. ఎకరానికి 30 బస్తాల దిగుబడి వచ్చింది. కౌలు కింద 15 బస్తాలు ఇవ్వాలి. పెట్టుబడి పోగా తిండి గింజలు కూడా మిగలలే. - గోపీ, రెంజల్​