
- ఆదాయం పెంచుకునేందుకు 'కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ' ప్లాన్
- ఇప్పటికే మా సిటీ, ఓసిటీ, యునీ సిటీ ప్లాట్ల విక్రయం
- తాజాగా బాలసముద్రంలోని 2.27 ఎకరాలు వేలం వేసేందుకు నిర్ణయం
- ఆక్షన్ కు డేట్ ఫిక్స్.. నవంబర్ 3న వేలం వేయనున్న ఆఫీసర్లు
- వచ్చే ఫండ్స్ తో పెండింగ్ ప్రాజెక్టుల పనులు చేపట్టేలా కసరత్తు
హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో చాలా పనులకు నిధుల కొరత అడ్డంకిగా మారింది. సరైన ఫండ్స్ లేక ముఖ్యమైన ప్రాజెక్టులు కూడా పెండింగ్ లో పడిపోయాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆమ్దానీ పెంచుకోవడంపై ఫోకస్ పెట్టింది.
ఇప్పటికే మా సిటీ, ఓ సిటీ, యునీ సిటీ పేరుతో వెంచర్లు చేసి, ప్లాట్లు విక్రయించిన కుడా ఇప్పుడు హనుమకొండ నడిమధ్యన బాలసముద్రంలో ఉన్న ప్రైమ్ ఏరియాలోని భూమిని వేలం వేసేందుకు రెడీ అయ్యింది. గ్రేటర్ సిటీలోనే డిమాండ్ ఉన్న ఏరియా కావడంతో రూ.వంద కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఆ నిధులతో నగరంలోని పెండింగ్ ప్రాజెక్టులతోపాటు కొత్త పనులు చేపట్టేందుకు కుడా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆదాయంపై 'కుడా' ఫోకస్..
వరంగల్ నగరాన్ని రాష్ట్ర రెండో రాజధానిగా డెవలప్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దానికి అనుగుణంగా 'కుడా' కూడా నగరంలో పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు, కాకతీయ మ్యూజికల్ గార్డెన్ డెవలప్మెంట్, వరంగల్ బస్ టెర్మినల్, రాంపూర్ ఆక్సిజన్ పార్కు, దేవునూరు ఎకో పార్క్ ఇలా వివిధ ప్రాజెక్టులకు నిధుల సమస్య అడ్డంకిగా మారగా, వాటన్నింటినీ పూర్తి చేసేందుకు కుడా కసరత్తు చేస్తోంది.
వాటితోపాటు కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు కూడా సన్నద్ధమవుతోంది. ఇందుకు పెద్ద ఎత్తున నిధులు అవసరం కాగా, ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా బడ్జెట్ సమకూర్చుకునే పనిలో పడింది. ఈ మేరకు కుడా పరిధిలోని భూములను వేలం వేసి, ఆదాయాన్ని రాబట్టుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే వరంగల్ ఓ సిటీ, మడిపల్లి మా సిటీ, ఉనికిచెర్ల యునీ సిటీలో వెంచర్లు డెవలప్ చేసి, కొంతమేర ప్లాట్లు విక్రయించిన కుడా, తొందర్లోనే ఆయా వెంచర్లలో మరో విడత వేలం నిర్వహించేందుకు రెడీ అవుతోంది.
ప్రైమ్ ఏరియాలో రెండున్నర ఎకరాలు వేలం..
ఇదివరకు వెంచర్లను డెవలప్ చేసిన కుడా ఇప్పుడు హనుమకొండ బాలసముద్రంలో ఫుల్ డిమాండ్ ఉన్న ప్రైమ్ ఏరియాలోని రెండున్నర ఎకరాల భూమిని వేలం వేసేందుకు రెడీ అయ్యింది. హనుమకొండ బస్టాండ్ కు కూతవేటు దూరంలో, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ పక్కనే ఉన్న 2 ఎకరాల 27.2 గుంటల (12,957.2 గజాలు) భూమిని ఆక్షన్ లో అమ్మేందుకు కుడా ఆఫీసర్లు నిర్ణయించారు. ఈ మేరకు నవంబర్ 3న హనుమకొండలోని కుడా ఆఫీస్ లో బహిరంగ వేలం నిర్వహించేందుకు డేట్ ఫిక్స్ చేశారు. ప్రైమ్ ఏరియాలో ఉన్న ల్యాండ్ కావడంతో 'కుడా'కు ఆదాయం బాగానే వస్తుందని భావిస్తున్నారు.
రూ.వంద కోట్ల వరకు ఆదాయం.!
రాష్ట్ర రెండో రాజధానిగా డెవలప్ అవుతున్న నేపథ్యంలో వరంగల్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భూములకు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా నగరం నడిమధ్యన ఉన్న బాలసముద్రం వరంగల్ ట్రై సిటీలోనే ఫుల్ డిమాండ్ ఉన్న ఏరియా. హోటల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ఆఫీసులకు అనుకూలంగా ఉండటం, ఏ బిజినెస్ కు అయినా అనువుగా ఉండే ప్రాంతం కావడంతో ఇక్కడ గజం జాగ విలువ రూ.లక్షకు పైగానే పలుకుతోంది.
ఇప్పుడు కుడా వేలం వేసేందుకు నిర్ణయించిన స్థలం హనుమకొండ బస్టాండ్ కు సమీపంలోనే ఉండటం, షాపింగ్ కాంప్లెక్స్ లు, ఐటీ కంపెనీలు, ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ ఏర్పాటుకు అనువుగా ఉండటంతో ఈ స్థలానికి డిమాండ్ బాగానే ఉంది. ఇక్కడ గజం కనీస ధరను కుడా రూ.65 వేలుగా నిర్ణయించనున్నట్లు తెలిసింది. వేలంలో ఆ రేటు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ లెక్కన 'కుడా'కు రూ.85 కోట్ల నుంచి రూ.వంద కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇలా భూముల వేలంతో వచ్చే ఆదాయంతో కుడా పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులను స్పీడప్ చేయనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాగా ఓ వైపు బాలసముద్రంలోని భూమిని వేలం వేసేందుకు కుడా కసరత్తు చేస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష పార్టీ నేతలు కొందరు ప్రభుత్వ భూములు అమ్మొద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.