ఆన్​లైన్​లో బట్టల షాపింగ్ అందుకేనట!

ఆన్​లైన్​లో బట్టల షాపింగ్ అందుకేనట!

ఆన్​లైన్​లో బట్టలు కొంటే… నచ్చకపోతే నాలుగు రోజుల తర్వాతైనా రిటర్న్​ చేయొచ్చు. ఆఫ్​లైన్​లో ఆ సౌలభ్యం లేదు. అందుకే ఇటీవల చాలా మంది ఆన్​లైన్​లో బట్టలు కొంటున్నారట. అయితే ఆన్​లైన్​లో బట్టలు కొని రిటర్న్​ ఇస్తున్న వాళ్లంతా ఇలా నచ్చకపోవడమో, సైజ్​ సరిపోకపోవడమో, క్వాలిటీ బాగోలేకపోవడమో కాదట. ఇలా దుస్తులు రిటర్న్​ ఇవ్వడానికో విచిత్రమైన కారణం ఉంది. అదే ‘ఇన్​స్టాగ్రామ్’.

సోషల్​ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన రోజులివి. చాలా మంది యూజర్లు తమ ఫొటోల్ని ఫేస్​బుక్,  ట్విట్టర్,  ఇన్​స్టాగ్రామ్​లో అప్​లోడ్​ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఫొటోలు తీయించుకుని సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేస్తున్నారు. వీటికి వచ్చే లైకులు, కామెంట్ల కోసం వాళ్లు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. కొందరు సెలబ్రిటీలైతే వీటి కోసమే ఫొటో షూట్లు కూడా చేయించుకుంటున్నారు. సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల వరకు సోషల్​ మీడియా ఫొటోలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా డ్రెస్సులు వేసుకుని, మేకప్​ చేసుకుని, కొత్త ప్రదేశాల్ని ఎంచుకుని మరీ ఫొటోలు తీయించుకుంటున్నారు.

ఈ ఫొటోల్లో వీటన్నింటినీ చూసి ఫాలోవర్లు లైకులు, కామెంట్లతో స్పందిస్తున్నారు. కొంతమంది వేసుకునే డ్రెస్సుల్ని చూసి వావ్.. అంటున్నారు. అయితే ఇకపై ఎవరైనా మంచి డ్రెస్సుతో ఇలా పోస్ట్​ చేస్తే కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఆ డ్రెస్సు వాళ్లు సొంతంగా కొనుక్కున్నదై ఉండదు. జస్ట్… ఇన్​స్టాగ్రామ్​ కోసమే ఆన్​లైన్​లో ఆర్డరిచ్చుకున్నదై ఉంటుంది. ఈ ఫొటో షూట్​ అయిపోగానే వాటిని తిరిగి రిటర్న్​ చేస్తున్నారట చాలా మంది. అయితే మనదగ్గర కాదులెండి. బ్రిటన్​లోనట.

అక్కడి ‘బార్​క్లే కార్డ్’ అనే సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం ప్రతి పది మందిలో ఒకరు ఇలా కేవలం ఇన్​స్టాగ్రామ్​ కోసమే దుస్తుల్ని షాపింగ్​ చేస్తున్నారట. వచ్చిన దుస్తులతో ఫొటో తీయించుకోవడం.. ఇన్​స్టాలో అప్​లోడ్​ చేసేయడం.. ఎంచక్కా వాటిని రిటర్న్​ చేసేయడం… ఇదీ చాలా మంది చేస్తున్న పని. ఇది ఆడవాళ్లే చేస్తున్నారనుకుంటే పొరపాటు. మగవాళ్లే ఎక్కువగా ఇలా చేస్తున్నారట. అయితే కొన్ని బ్రాండ్లు ఇలా రెగ్యులర్​ వేర్​ కాకుండా ఇన్​స్టా కోసమే.. అంటే ఒకటి, రెండు సార్లు వాడి పక్కనపెట్టేసేలాంటి దుస్తుల్ని రూపొందిస్తున్నాయి.