కరోనా విషయంలో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు సీఎం కేసీఆర్. అయితే నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించరాదన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ సోకిన వారు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తూ ప్రైవేటు ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎంత మందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉందని తెలిపారు సీఎం. కరోనా వ్యాప్తి నివారణలోనూ, చికిత్స లోనూ ఎంతో గొప్ప సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కరోనా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉందన్నారు. కేవలం తెలంగాణలోనే లేదని.. ఇక్కడే పుట్టలేదన్నారు. అంతేకాదు జాతీయ సగటుతో చూసుకుంటే మన రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉన్నదన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉన్నదన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
కరోనా వ్యాప్తి నివారణకు, వైరస్ సోకిన వారికి మంచి వైద్యం అందించడానికి ప్రభుత్వం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉందన్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే విషయంలో అత్యవసర పనులు నిర్వహించుకోవడానికి వీలుగా జనరల్ బడ్జెట్ కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించామన్నారు. ఆరోగ్య మంత్రి, సిఎస్ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి వీలుగా ఈ నిధులను అందుబాటులో పెడతారని తెలిపారు సీఎం కేసీఆర్.
