- వినియోగదారులకు అవగాహన కల్పించని ఆఫీసర్లు
- వనపర్తి జిల్లాలో దరఖాస్తు చేసుకొనేందుకు ఆసక్తి చూపని ప్రజలు
వనపర్తి, వెలుగు: విద్యుత్ వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో సోలార్ విలేజ్ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఈ పథకంపై సంబంధిత అధికారులు అవగాహన కల్పించడం లేదనే విమర్శలున్నాయి. గ్రామాల్లో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి సోలార్ విలేజీల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రెడ్కో సంస్థ, ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన(పీఎంఎస్జీఎంబీవై) పథకాన్ని అమలు చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తోంది. ఈ పథకం కింద సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో గ్రామానికి రూ. కోటి చొప్పున నజరానా ప్రకటించింది.
వనపర్తి జిల్లాలో 10 గ్రామాలు ఎంపిక..
వనపర్తి జిల్లాలో 10 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామస్తులంతా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కానీ, పూర్తి స్థాయిలో వారికి పథకం గురించి అవగాహన కల్పించడం లేదనే విమర్శలున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఖిల్లాగణపురం, మానాజీపేట, పెద్దమందడి, గోపాల్పేట, ఏదుట్ల, బుద్దారం, పాన్‌గల్, పెద్దగూడెం, శ్రీరంగాపురం, ఏదుల గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మొదట్లో కొన్ని గ్రామాల్లో అవగాహన కల్పించిన అధికారులు ఆ తరువాత పట్టించుకోవడం లేదు.
బిల్లులు ఎక్కువ వచ్చే వారికి ఉపయోగకరం..
ప్రతి నెలా రూ.2 వేలకు పైగా విద్యుత్ బిల్లులు చెల్లించే వారికి ఈ సోలార్ ప్యానెల్ ఉపయోగకరంగా ఉంటుంది. ఒకటి, రెండు, మూడు కిలో వాట్ విద్యుత్ వినియోగించే వారికి ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. కిలో వాట్ సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు రూ.30 వేల సబ్సిడీ, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లకు రూ.78 వేల చొప్పున సబ్సిడీ ఉంటుంది. సోలార్ ప్యానెల్ ఏర్పాటు కోసం 100 నుంచి 300 చదరపు అడుగుల రూఫ్ అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 102 దరఖాస్తులు రాగా, విస్తృత ప్రచారం కల్పిస్తే మరింత మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
