వ్యాక్సిన్​ కోసం మహారాష్ట్ర పోతున్నరు

వ్యాక్సిన్​ కోసం మహారాష్ట్ర పోతున్నరు

జయశంకర్ భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: కరోనా వ్యాక్సిన్  కోసం తెలంగాణ ప్రజలు మహారాష్ట్రకు క్యూ కడుతున్నారు. శనివారం మహారాష్ట్ర లోని అంకీస, సిరోంచ హాస్పిటల్ లో సుమారు 100 మంది తెలంగాణవాసులు వ్యాక్సిన్​ వేయించుకున్నారు. భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్, పలిమెల మహాముత్తారం, కాటారం, మల్హర్ తదితర మండలాల్లో 18 నుంచి 44 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ ​ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ, అంకీస తదితర గవర్నమెంట్ హాస్పిటల్స్​లో మాత్రం మొదటి డోసును సోమవారం నుంచి ఉచితంగా వేస్తున్నారు. ఈ హాస్పిటల్స్ తెలంగాణ బార్డర్​కు 5 నుంచి 10 కి.మీ. దూరంలో ఉండడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాతోపాటు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలాల నుంచి కూడా ప్రజలు మహారాష్ట్రకు వెళ్లి వ్యాక్సిన్ ​వేయించుకుంటున్నారు.