ఏటా ఇబ్బందులు పడుతున్న వనపర్తిలోని మూడు గ్రామాల ప్రజలు

ఏటా ఇబ్బందులు పడుతున్న వనపర్తిలోని మూడు గ్రామాల ప్రజలు

వనపర్తి, వెలుగు: వానాకాలం వచ్చిదంటే చాలు కొత్తకోట మండలం పాతజంగమయ్యపల్లి, దేవరకద్ర మండలం వర్ని, ముత్యాలంపల్లి గ్రామాల ప్రజలు నరకం చూస్తున్నారు. ఈ గ్రామాలకు ఓ వైపు సరళాసాగర్‌‌ బ్యాక్ వాటర్‌‌, మరో వైపు సరళాసాగర్ వాగు, ఇంకోవైపు కోయిసాగర్‌‌ వాగు ఉండడంతో మూడు వైపులా రాకపోకలు బంద్ అవుతున్నాయి. రోడ్లన్నీ నీట మునుగుతుండడంతో ఇటు కొత్తకోట, అటు ఎన్‌హెచ్‌ 44, అడ్డాకుల మండలం వెళ్లేందుకు వీలు లేకుండా పోతోంది.  దేవరకద్ర వైపు దారి బాగానే ఉన్నా ఇక్కడి ప్రజల అవసరాలు, పిల్లల చదువులు కొత్తకోటతో ముడిపడి ఉండడంతో ఇబ్బందులు తప్పట్లేదు. రైతులు, స్టూడెంట్లు, పేషెంట్లు తప్పనిసరై వెళ్లాల్సి వస్తే  పుట్టి ఎక్కుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.  జంగమాయపల్లి, కనిమెట్ట మధ్య  ప్రభుత్వం ఎనిమిదేండ్ల క్రితమే బ్రిడ్జి మంజూరు చేసినా నేటికి నిర్మాణ పనులు మొదలు పెట్టలేదు.  

10 వేల జనాభా

మూడు గ్రామాల్లో10వేలకు పైనే జనాభా ఉంటుంది. వెళ్లే వైద్యారోగ్య సిబ్బంది, టీచర్లు, ఇతర ఉద్యోగులు ఈ గ్రామాలకు వెళ్లాలన్నా.. అక్కడి రైతులు, స్టూడెంట్లు కొత్తకోటకు రావాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జంగమాయపల్లి, కనిమెట్ట వద్ద సరళాసాగర్ వాగు దాటేందుకు గ్రామస్తులే ఓ పుట్టిని ఏర్పాటు చేశారు.  దీన్ని ఎవరూ నడిపేవారు ఉండరు. ఎవరికి వారు పుట్టి ఎక్కి తాడు సాయంతో చేదుకుంటూ ముందుకు పోవాల్సి ఉంటుంది.  ఆవలి నుంచి మళ్లీ ఎవరైనా వస్తేనే పుట్టి వాపస్ వస్తుంది.  మూడు నాలుగు నెలల పాటు ఇదే పరిస్థితి ఉంటుండడంతో చాలా మంది స్టూడెంట్లను వారి పేరెంట్స్‌ మహబూబ్‌నగర్‌‌, దేవరకద్ర పట్టణాల్లోని బంధువులు, హాస్టళ్లలో ఉంచుతున్నారు.  పాతజంగమయ్యపల్లి రేషన్ షాపు కనిమెట్టలో ఉండడంతో చాలామంది రెండునెలలుగా బియ్యం కూడా తీసుకోలేదు.  

రూ.12.30 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేసినా..  

కనిమెట్ట,  పాతజంగమయ్యపల్లి గ్రామాల మధ్య వాగుపై గ్రామస్తులు మట్టి రోడ్డు వేసుకుంటున్నా.. ప్రతి వానాకాలం కొట్టుకుపోతోంది.  స్థానికుల డిమాండ్ మేరకు ప్రభుత్వం 2014లో రోడ్డు బ్రిడ్జి మంజూరు చేయగా..  అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. కానీ, పనులు మొదలు పెట్టలేదు.  టీఆర్ఎస్‌  రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రూ.12.30 కోట్లతో నిరుడు మళ్లీ శంకుస్థాపన చేశారు.  అయినా కాంట్రాక్టర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు పెట్టలేదు.  

ఈమె పేరు సౌభాగ్య. కొత్తకోట పీహెచ్‌సీలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న ఈ మె ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డ్యూటీ చేయాల్సి వస్తోంది. కొత్తకోట మండలం కనిమెట్ట నుంచి జంగమాయపల్లెకు నిత్యం పుట్టిలోనే వెళ్తోంది. ఇటీవల వాక్సినేషన్ కోసం వెళ్తుండగా పుట్టి బోల్తాపడింది. ఆశా వర్కర్ జరీనా బేగానికి ఈత రావటంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.  అదృష్టం కొద్ది ఎవరికీ ఏమీ కాలేదని, ప్రతి వానాకాలం ఇలాగే ఉంటోందని ఆమె వాపోయారు. ఆదివారం కూడా ఇలా పుట్టిలోనే వెళ్లారు.

రూ.12.30 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం కోసం టెండర్లు... 

పాతజంగమయ్యపల్లి వద్ద సరళాసాగర్ వాగుపై బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం 12.30 కోట్లు మంజూరు చేసింది. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంభించే సమయంలో వరద వచ్చింది. దీంతో పనులు ముందుకు సాగలేదు.  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బ్రిడ్జి నిర్మిస్తం.  

మల్లయ్య, పంచాయతీరాజ్ ఈఈ