ఉద్దెరకు ఉల్లిగడ్డ.. క్యూ కడుతున్నకస్టమర్స్

ఉద్దెరకు ఉల్లిగడ్డ.. క్యూ కడుతున్నకస్టమర్స్

ఉడకవే ఉడకవే ఓ ఉల్లిపాయ.. నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు.. అని తెలుగులో చిన్నప్పుడు చదువుకునే ఉంటారు కదా! కానీ, ఇప్పుడు ఆ ఉల్లిని తెచ్చి కూరొండే పరిస్థితే లేదు. అంతలా మండిపోతున్నాయి దాని రేట్లు. అందుకే ఉత్తర్​ప్రదేశ్​లో ఉల్లిని ఉద్దెరకిస్తున్నారు. ఆధార్​కార్డో లేదంటే వెండి నగలనో తాకట్టు పెట్టుకుని ఉల్లిగడ్డలను జనానికిస్తున్నారు. అయితే, ఇదో రకమైన నిరసన లెండి. పెరిగిన ఉల్లి రేట్లకు నిరసనగా ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో కొందరు సమాజ్​వాదీ పార్టీ కార్యకర్తలు తమ తమ షాపుల్లో ఈ కొత్త ‘ఉల్లి ఉద్దెర’ నిరసనలకు బాటలు వేశారు. కొన్ని షాపుల్లో ఉల్లిగడ్డలను లాకర్లలో పెడుతున్నారని షాపు ఓనర్లు చెబుతున్నారు. ఇక, పోయిన శుక్రవారం యూపీ అసెంబ్లీ బయట కొందరు కాంగ్రెస్​ కార్యకర్తలు కిలో ఉల్లిని 40 రూపాయలకు అమ్మి తమ నిరసనను తెలిపారు.

ఆనియన్​ దోశె లేదు.. వంటలు రుచి లేవు

హోటళ్లలో ఆనియన్​ దోశెకు డిమాండ్​ ఎట్లుంటదో తెలిసిందే కదా. కానీ, ఈ కాలంలో ఆనియన్​ దోశె తినేటట్టే లేదు. హోటళ్లు వేసేటట్టే లేదు. అవును, బెంగళూరులోని హోటళ్లు ఉల్లి దోశెను బంద్​పెట్టాయి మరి. ‘‘హోటళ్లలో ఉల్లిగడ్డ వాడకాన్ని బాగా తగ్గించేశాం. మంచి రెస్టారెంట్లు రేట్లు పెంచి దానికి తగ్గట్టు కాస్ట్​ను కవర్​ చేసుకోగలవు. కానీ, మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీలు చిన్న చిన్న హోటళ్లకే ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి వాళ్లకు రేట్లు పెంచితే భారం పడుతుంది. కొన్ని వంటలను ఉల్లి లేకుండా చేయలేం. అయితే, చాలా వరకు మేం ఉల్లిని తగ్గించాం” అని బెంగళూరు హోటల్స్​ అసోసియేషన్​ ట్రెజరర్​ వి. కామత్​ అన్నారు. ఇక, ఉల్లిని తగ్గించడం వల్ల హోటళ్లలో తమకు ఇష్టమైన వంటకాల టేస్ట్​ తగ్గిపోయిందని కస్టమర్లు అంటున్నారు. కొన్ని ఈటరీలు, క్యాంటీన్లు పూర్తిగా ఉల్లి లేకుండానే వంటలను చేసేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు.

ఉల్లికి పూజలు

ఉల్లి దేవుడైపోయినట్టుంది. బీహార్​లోని ముజఫర్​పూర్​కు చెందిన కొందరు వ్యక్తులు ఉల్లిగడ్డకు పూజలు చేశారు. దండేసి హారతులిచ్చారు. ఈ మధ్య కాలంలో పేదోళ్లు, మధ్య తరగతోళ్లు ఉల్లిని కొనే పరిస్థితే లేదని ఆవేదన చెందారు. ఉల్లిని చూసి పూజ చేసే పరిస్థితులే ఉన్నాయంటున్నారు. నిన్నగాక మొన్న కొందరు వ్యక్తులు ఉల్లితో దండలు చేసి మెడలో వేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, హెల్మెట్​ పెట్టుకుని మరీ ఉల్లిని అమ్మారు మరికొందరు.