
కాగజ్ నగర్, వెలుగు : ఓట్ల కోసం ప్రజలకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మోసపూరిత వాగ్దానాలు ఇస్తున్నాయని, ఆ అబద్ధపు హామీలను నమ్మవద్దని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు. ఆ మూడు పార్టీలను ఓడించాలని ఓటర్లను ఆయన కోరారు. శనివారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం, పెంచికల్ పేటలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఆచరణ సాధ్యంకాని, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు.
బీసీ సామాజికవర్గానికి చెందిన నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నా బీసీ కులగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో తొమ్మిదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల్లో డబ్బులు పంచే, ప్రలోభాలకు గురిచేసే పార్టీలకు ఓట్లు అమ్ముకోవద్దని సూచించారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ దోపిడీ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అగ్రకుల ఆధిపత్య రాజకీయ పార్టీలను ఓడించి బహుజనుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని కోరారు.