కొత్త బడ్జెట్పై కోటి ఆశలు

కొత్త బడ్జెట్పై కోటి ఆశలు

2023 – 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ సిద్ధమైంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆమెకు ఇది ఐదో బడ్జెట్ కాగా.. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున మోడీ సర్కారుకు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది. ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కేంద్రం బడ్జెట్లో అన్ని వర్గాలకు ఊరటనిచ్చే నిర్ణయాలు ప్రకటించే అవకాశముంది. 

ఆదాయ పన్ను కోత

ఈసారి బడ్జెట్ లో ఆదాయ పన్ను  భారాన్ని తగ్గించవచ్చని సగటు జీవి ఆశిస్తున్నారు. ప్రస్తుతం 60ఏండ్ల లోపున్న వారి వార్షిక ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5లక్షలుగా ఉంది. 2014 నుంచి ఇలాగే కొనసాగుతున్న శ్లాబును రూ.5 లక్షళకు పెంచాలని సామాన్యులు కోరుకుంటున్నారు. 2017లో 30శాతంగా నిర్ణయించిన అత్యధిక పన్ను రేటును 25శాతానికి తగ్గిస్తారని అంచనా వేస్తున్నారు. ధరలు గణనీయంగా పెరిగినందున హోమ్ లోన్లపై విధించే పన్ను పరిమితులను సైతం సవరించాలని జనం కోరుకుంటున్నారు. సెక్షన్ 80సీ పరిమితిని రూ.1.5లక్షల నుంచి రూ.2.5 లక్షలకు, అలాగే స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ఏడాదికి రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచాలని అంటున్నారు. వీటితో పాటు వ్యక్తిగత పొదుపు, దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా 6 ఏ కింద పరిమితులు కూడా పెంచాలని కోరుకుంటున్నారు. రిటైరైన వారు పాత పెన్షన్ విధానం మళ్లీ అమల్లోకి వస్తుందని ఎదురుచూస్తున్నారు.

సొంతింటి కల 

సొంతింటి కలను నెరవేర్చుకోవాలని చూస్తున్న వారికి ఈసారి బడ్జెట్‌లో తీపి కబురు అందొచ్చని స్థిరాస్తి రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. తొలిసారి ఇంటిని కొనుగోలు చేసే వారికి ఎక్కువ ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థిరాస్థి రంగం వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ నేరుగా వడ్డీ రేట్లను తగ్గించలేని పక్షంలో ఇతర విధానాల్లో ఉపశమనం కల్పించాలని కోరారు. ఇల్లు కొనాలనుకునే వారికి ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్‌పై గృహ రుణ వడ్డీ మినహాయింపు పరిమితిని పెంచడం, మూలధన లాభం పన్నును తగ్గింపు తదితర చర్యలు తీసుకోవాలని అంటున్నారు. 

పారిశ్రామిక వర్గాలు 

2023 బడ్జెట్లో కేంద్రం పన్ను రాయితీలను మరింత పెంచుతుందని పారిశ్రామిక వర్గాలు ఆశపెట్టుకున్నాయి. ప్రొడక్షన్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీంను మరికొంత కాలం పాటు పొడగించాలని కోరుకుంటున్నారు. 100శాతం టాక్స్ మినహాయింపు ఇవ్వాలని స్టార్టప్ లు ఆశిస్తున్నాయి.  దేశంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్న మానుఫ్యాక్చరర్లు మరిన్ని ఇంటెన్సివ్ లు కోరుకుంటున్నారు. 

మౌలిక వసతుల కల్పన

మోడీ 2.0 సర్కారుకు ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడం, 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా కేటాయింపులు ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. భారీ ప్రాజెక్టులు ప్రకటించడంతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపైనా దృష్టి సారించే అవకాశముంది. వీటితో పాటు సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధుల కేటాయింపులను భారీగా పెంచే ఛాన్సుంది. 

విద్యా రంగం

విద్యారంగానికి   గతేడాది బడ్జెట్ లో రూ. లక్ష కోట్ల కేటాయించడంతో ఈ సారి కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. డీజీపీలో 6శాతాన్ని బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయించాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సూచించింది. అయితే అంతకు ముందుతో పోలిస్తే గతేడాది ఎడ్యుకేషన్ సెక్టార్ కు కేటాయింపులు పెరగడం కాస్త ఊరటనిచ్చింది. కేంద్రం ఇదే ఒరవడి కొనసాగించాలని విద్యారంగ నిపుణులు అంటున్నారు.  డిజిటలైజేషన్ కు ప్రాధాన్యమిస్తున్న మోడీ ప్రభుత్వ  విద్యారంగంలోనూ దాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గతేడాది ప్రకటించినట్లుగానే ఈసారి కూడా మరికొన్ని డిజిటల్ యూనివర్సిటీలు, పీఎం ఈ విద్య స్కీంకు నిధులను పెంచే అవకాశముంది. ప్రస్తుతం ఎడ్యూటెక్ సర్వీసులపై 18శాతంగా ఉన్న జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని విద్యారంగ నిపుణులు కోరుతున్నారు.