
జూలూరుపాడు, వెలుగు : మండలంలోని పడమటి నర్సాపురం గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ హైస్కూల్ లో శనివారం 16 మంది స్టూడెంట్స్ ను యూనిఫాం వేసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీఈటీ కొట్టిన ఘటనపై ఏటీడీవో రూపాదేవి సోమవారం విచారణ చేపట్టారు. స్టూడెంట్స్ తో మాట్లాడి సంఘటనపై ఆరా తీశారు. ఇదే సమయంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు స్కూల్ వద్ద ఆందోళన చేపట్టారు. స్టూడెంట్స్ ను కొట్టిన పీఈటీపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీఈటీపై చర్యలు తీసుకుంటామని ఏటీడీవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఏటీడీవో మాట్లాడుతూ యూనిఫాం విషయంలో స్టూడెంట్స్ ను కొట్టినట్లు స్టూడెంట్స్ చెప్పారని అన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని చెప్పారు. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.