
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) పై మధురై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అతని మానసికస్థితి బాగాలేదని, ఆయన తీసే సినిమాలు హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని లాయర్ రాజు మురుగన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వార్త తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తీసినవి ఐదు సినిమాలే అయినా ఇండియా లెవల్లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అందుకే ఈ దర్శకుడి సినిమాలకు పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఏర్పడుతోంది. అయితే ఆయన సినిమాల్లో కామన్ గా కనిపించే కొన్ని అంశాలు ఉంటాయి. అందులో మాఫియా, డ్రగ్స్ ముఖ్యమైనవి. ఆయన మొదటి సినిమా నగరం నుండి మొన్నొచ్చిన విక్రమ్ వరకు అన్ని సినిమాల్లోనూ దాదాపు ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. ఇక రీసెంట్ గా వచ్చిన లియో సినిమాలో కూడా ఇదే మెయిన్ కాన్సెప్ట్.
థియేటర్ లో సూపర్ హిట్ గా నిలిచినా ఈ సినిమా ఇటీవలే ఓటీటీలో రిలీజయింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో బ్యాన్ చేయాలంటూ మధురై కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. మధురైకి చెందిన న్యాయవాధి రాజు మురుగన్ ఈ పిటిషన్ వేసారు. లోకేష్ కనగరాజ్ మానసిక పరిస్థితి బాగాలేదన్న ఆయన.. సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. లోకేష్ సినిమాలో మారణాయుధాలు, డ్రగ్స్, హింసను ప్రేరేపించే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే లియో సినిమాను బ్యాన్ చేయాలంటూ కోరారు రాజు మురుగన్. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ కృష్ణ కుమార్, జస్టిస్ విజయ్ కుమార్ల ధర్మాసనం.. లోకేష్ తరపు న్యాయవాదులు హాజరు కాకపోవడంతో వాయిదా వేశారు.