
వాహనాదారులకు పెట్రోల్ దొరుకుతుందో.. లేదో.. అనే టెన్షన్ అవరంలేదు. జనవరి 3వ తేదీ బుధవారం హైదరాబాద్ సిటీలో పెట్రోల్ బంకులన్నీ ఓపెన్ అయ్యాయి. దీంతో ఈరోజు ఉదయం కూడా పెట్రోల్, డీజిల్ కోసం.. వాహనాదారులు పెట్రోల్ బంక్ లకు క్యూ కడుతున్నారు. అయితే వాహనాదారులు టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఇప్పటికే సమ్మె విరమించిన డ్రైవర్లు.. ఆయిల్ ట్యాంకర్లతో పెట్రోల్ బంకులకు చేరుకుంటున్నారు.
బంకుల్లో ఫుల్ స్టాక్ ఉంది. ఎంత కావాలంటే అంత పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంది. బంకులన్నీ ఒక్కసారిగా ఖాళీ కావటంతో.. అన్ని బంకుల యజమానులు.. రెండు, మూడు ట్యాంకర్లను ఆర్డర్ చేశారు. ఈ క్రమంలోనే స్టాక్ చాలా ఉందని.. కంగారు వద్దంటూ వాహనదారులకు సూచిస్తున్నారు బంకు సిబ్బంది. వాహనదారులకు మాత్రం ఇంకా ఎక్కడో డౌట్ కొడుతుంది. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ముందుగానే ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నారు. బంకుల దగ్గరకు క్యూ కడుతున్నారు.
హిట్ అండ్ రన్ కేసులో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేపట్టడంతో జనవరి 2వ తేదీ మంగళవారం పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంక్ ల వద్ద భారీగా రద్దీ నెలకొంది. డ్రైవర్ల సమ్మె ప్రభావం హైదరాబాద్ లోని పెట్రోల్ బంక్ లపై పడింది. ఇంధన కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో పెట్రోల్, డీజిల్ కోసం ఒక్కసారిగా వాహనాదారులు పెట్రోల్ బంక్ లకు క్యూకట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ క్రమంలో కేంద్రం.. ట్రక్కు డ్రైవర్లతో అత్యవసర చర్చలు జరిపి సమ్మె విరమింపజేశారు. అనంతరం డ్రైవర్లు.. యధావిధిగా విధులు నిర్వహించేందుకు బయల్దేరారు. దీంతో గందరగోళానికి తెరపడింది.