25 రోజుల్లో 18సార్లు పెరిగిన పెట్రోల్ ధర..

25 రోజుల్లో 18సార్లు పెరిగిన పెట్రోల్ ధర..

దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. నేడు మరోసారి పెట్రోల్, డీజిల్ పై 35 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 106 రూపాయల 89 పైసలకు చేరగా.. డీజిల్ ధర 95 రూపాయల 62 పైసలకు చేరింది. ముంబైలో రికార్డు స్థాయిలో లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయల 78 పైసలకు చేరగా... డీజిల్ ధర 103 రూపాయల 63 పైసలకు పెరిగింది. కోల్ కతాలోనూ పెట్రోల్ ధర 107 రూపాయల 45 పైసలకు పెరగగా... డీజిల్ ధర 98 రూపాయల 73 పైసలకు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర 103 రూపాయల 92 పైసలకు పెరగగా... లీటర్ డీజిల్ ధర 99 రూపాయల 92 పైసలకు చేరింది. రాజస్థాన్‎లోని శ్రీ గంగానగర్‎లో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర 119 రూపాయల 5 పైసలుగా ఉండగా.. డీజిల్ ధర 109 రూపాయల 88 పైసలుగా ఉంది. 

ఇక తెలంగాణ విషయానికొస్తే.. హైదరాబాద్‎లో లీటర్ పెట్రోల్ ధర 111 రూపాయల 18 పైసలకు చేరగా.. డీజిల్ ధర 104 రూపాయల 32 పైసలకు చేరింది. తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్‎లో రూ. 113.82 పైసలుగా ఉంది. ఆ తర్వాత కొమురంభీం ఆసిఫాబాద్ లో రూ. 113.43 పైసలు, గద్వాల్ జిల్లాలో రూ. 113.21 పైసలు, నిర్మల్ లో రూ. 113.11 పైసలుగా ఉంది.

కాగా.. సెప్టెంబర్ చివరి వారం నుంచి పెట్రోల్ ధర 18 సార్లు పెరగగా... డీజిల్ ధర 21 సార్లు పెరిగింది. గత మూడు వారాల్లో డీజిల్‎పై 6 రూపాయల 85 పైసలు పెరగగా.. పెట్రోల్‎పై 5 రూపాయల 35 పైసలు పెరిగింది. అంతకుముందు మే 4 నుంచి జులై 17 మధ్య పెట్రోల్‎పై 11 రూపాయల 44 పైసలు పెరగగా.. డీజిల్‎పై 9 రూపాయల 14 పైసలు పెరిగింది.

పెట్రో ధరల పెంపుతో సామాన్యులు ఆందోళనచెందుతున్నారు. ధరల పెంపుతో మధ్యతరగతి ప్రజలు భారంగా బతుకుతున్నారు. పెట్రో ధరలు పెరగడంతో.. నిత్యావసరాలు, కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటివరకు కిలో టమాటో రూ. 30 ఉండగా.. ప్రస్తుతం 50కి చేరింది. పచ్చిమిర్చి రూ. 25 నుంచి రూ. 40కి చేరింది. ఉల్లిగడ్డ రూ. 30 నుంచి 50కి చేరింది. ఆలుగడ్డ రూ. 20 నుంచి రూ. 40కి చేరింది. వీటితో ఆకుకూరల ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి. మొన్నటివరకు ఆకుకూరలు ఏవైనా రూ. 10కి మూడు కట్టలు ఇచ్చేవాళ్లు.. ఇప్పుడు రూ. 20కి నాలుగు కట్టలు మాత్రమే ఇస్తున్నారు.

For More News..

మేడ్ ఇన్ ఇండియా వస్తువుల కొనుగోలుపై శ్రద్ధ పెట్టాలి

టార్గెట్ ఈటల.. అందుకే ఇంత డబ్బు