మేడ్ ఇన్ ఇండియా వస్తువుల కొనుగోలుపై శ్రద్ధ పెట్టాలి

మేడ్ ఇన్ ఇండియా వస్తువుల కొనుగోలుపై శ్రద్ధ పెట్టాలి

రోగానికి ఉన్నోళ్లు లేనోళ్లని తేడాలేనప్పుడు వ్యాక్సిన్లకు మాత్రం ఎందుకు?

రోగానికి ఉన్నోళ్లు లేనోళ్లని తేడా లేదని.. అటువంటప్పుడు వ్యాక్సిన్లకు మాత్రం తేడా ఎందుకని ప్రధాని మోడీ అన్నారు. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని.. కవచం ఎంత బాగున్నా, ఎంత ఆధునికత ఉన్నా.. యుద్ధం జరుగుతున్నంత కాలం ఆయుధాలను వదిలెయ్యకూడదని మోడీ అన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ 100 కోట్లు దాటిన సందర్భంగా ఆయన జాతినుద్దేశించి మాట్లాడారు.

‘దేశంలో 100  కోట్ల డోసులు ఇవ్వగలిగాం. అది కేవలం సంఖ్య కాదు, భారత సామర్థ్యానికి ప్రతీక. గతంలో వ్యాక్సీన్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. ఇతర దేశాల నుంచి భారత్ వ్యాక్సీన్ల కొనగలదా? ఇంతపెద్ద జనాభాకు టీకాలు వేయగలరా? అన్న సవాళ్లుండేవి. కానీ, ఈ 100 కోట్ల డోసులు ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చింది. డబ్బులు తీసుకోకుండా వ్యాక్సీన్లు వేశాం. ప్రపంచం మొత్తం భారత సామర్థ్యాన్ని గుర్తించింది. అందరికీ ఉచిత వ్యాక్సీన్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. రోగానికి ఉన్నోళ్లు లేనోళ్లని తేడాలనప్పుడు.. వ్యాక్సీన్లకు మాత్రం ఎందుకు? ధనవంతులైనా సరే సామాన్యులకు లభించినట్లే టీకా అందుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వ్యాక్సీన్లు తీసుకోడానికి విముఖత చూపిస్తున్నారు. ప్లేట్లతో దేశవ్యాప్తంగా చప్పుడు చేసినప్పుడు కరోనా పోతుందా అన్నారు, కానీ అందులో దేశ ప్రజల ఐకమత్యం కనిపించింది. ఒక రోజులో ఒక కోటి డోసులు వేయగలిగాం. భారత వ్యాక్సీన్ కార్యక్రమం శాస్త్రీయంగా, సైంటిఫిక్‌గా నిర్వహించాం. అందరి సహకారంతో దీన్ని సాకారం చేయగలం.

ఈ దీపావళి మాత్రం వంద కోట్ల డోసులతో ఉత్సాహంగా కనిపిస్తోంది
దూర ప్రాంతాలకు వ్యాక్సీన్లను సరఫరా చేయడం కూడా పెద్ద సవాలుగా ఉండేది. ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి ఎన్ని వ్యాక్సీన్లు పంపాలన్న అంశంలోనూ సైంటిఫిక్‌గా పని చేశాం. ఇప్పుడు అందరిలో ఉత్సాహం, ఆశావహ థృక్పథం కనిపిస్తోంది. భారత్‎లోని కంపెనీల్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. హౌసింగ్ సెక్టార్‌లోనూ సానుకూలత కనిపిస్తోంది. కరోనా కాలంలో ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉండేలా వ్యవసాయ రంగం చేయగలిగింది. పెరుగుతున్న వ్యాక్సీన్ల సంఖ్యతో పాటు అన్ని రంగాల్లో సానుకూలత వేగం పుంజుకుంటోంది. రాబోయే పండగలు దీని వేగాన్ని మరింత పెంచుతాయి. ఒకప్పుడు విదేశాల్లో తయారైన వాటిపై మోజు ఉండేది కానీ ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యం లభిస్తుంది. ప్రజలు కూడా మేడ్ ఇన్ ఇండియా వస్తువుల కొనుగోలుపై శ్రద్ధ పెట్టాలి. మేడ్ ఇన్ ఇండియా వస్తువుల కొనగోలును ప్రజా ఉద్యమంలా చేయాలి. గతేడాది దీపావళి ఉదాసీనంగా ఉంది, కానీ ఈ దీపావళి మాత్రం వంద కోట్ల డోసులతో ఉత్సాహంగా కనిపిస్తోంది. పండగలను అప్రమత్తతో చేసుకోవాలి. చెప్పులు వేసుకొని బయటకు వెళ్లడం ఎంత సహజమో.. మాస్కు ధరించడాన్ని కూడా అంతే సహజ అలవాటుగా మార్చుకోవాలి. వ్యాక్సిన్లు తీసుకున్నవారు మిగిలినవారిని టీకా తీసుకునేలా ప్రోత్సహించాలి. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ’ అని మోడీ అన్నారు.