నిషేధిత PFI ట్విట్టర్ అకౌంట్ నిలిపివేత

నిషేధిత PFI ట్విట్టర్ అకౌంట్ నిలిపివేత

నిషేధిత PFI సంస్థపై ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు చేపట్టింది. తాజాగా PFI ఛైర్మన్ ఒమా సలామ్ ట్విట్టర్ ను కేంద్రం నిలిపివేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ నేతల అరెస్టులు కాగా.. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నలుగురు పీఎఫ్ఐ కార్యకర్తలను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. అందులో రెహమాన్, వహీద్, జాఫరుల్లా, అబ్దుల్ వారిస్ లు ఉన్నారు. వీరిని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించిన అధికారులు.. నలుగురు నిందితులను ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత ఎన్ఐఏ అధికారులు30 రోజుల కస్టడీకి అనుమతించాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 3 రోజుల కస్టడీకి అనుమతించిన ఎన్ఐఏ కోర్టు.. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను విశ్లేశించే పనిలో పడింది.

దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలతో సంచలనంగా మారిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్​ ఇండియా (పీఎఫ్ఐ), దానికి అనుబంధంగా ఉన్న 8 సంస్థలపై కేంద్రం ఇటీవలే నిషేధం విధించింది. టెర్రరిస్ట్ సంస్థలతో లింకులు ఉన్నాయని, దేశంలో ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం, ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేసినట్లు ఆధారాలు దొరకడంతో వీటిని నిషేధించినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద వీటిని ఐదేండ్ల పాటు బ్యాన్ చేస్తున్నామని, నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లు తెలిపింది. 

నిషేధిత సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) లీడర్లే పీఎఫ్ఐని స్థాపించారని, దీనికి జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జెఎంబీ)తోనూ లింకులు ఉన్నాయని పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్), ఇతర టెర్రరిస్ట్ సంస్థలతోనూ పీఎఫ్ఐకి సంబంధాలు ఉన్నట్లు కేంద్ర సంస్థల దర్యాప్తులో ఆధారాలు దొరికాయని వెల్లడించింది. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థల ఆస్తుల స్వాధీనంతో పాటు వీటి సభ్యులను అరెస్ట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారాన్ని ఇస్తూ కేంద్రం మరో నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని పీఎఫ్ఐ స్టూడెంట్ విభాగం క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్​ఇండియా పేర్కొంది.