
- తెలంగాణ, ఏపీ, ఒడిశా,చత్తీస్‌గఢ్ కూడలి భద్రాచలం
- ఇక నాలుగు రాష్ట్రాల ఆదివాసీలకు అందనున్న అధునాతన వైద్యం
భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలో వైద్యానికి మంచిరోజులు రానున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఇటీవల రాష్ట్రంలో ఐదు కొత్త పీజీ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలకు జాతీయ వైద్య మిషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. కింగ్‌కోఠి, పెద్దపల్లి, బాన్సువాడ, భద్రాచలం, మిర్యాలగూడెంలో వీటిని ఏర్పాటు చేసేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. దీంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రి బోధనాస్పత్రిగా తెలంగాణ, ఏపీ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల కూడలిలలోని ఆదివాసీలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్యాన్ని అందించనుంది. ఇకపై ఆదివాసీలు పెద్ద వైద్యానికి ఖమ్మం, హైదరాబాద్‌లాంటి నగరాలకు వెళ్లే పరిస్థితి తప్పనుంది.
విస్తరించనున్న 200 పడకల ఆస్పత్రి సేవలు..
నాలుగు రాష్ట్రాలకు కూడలిగా ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రి 200 పడకలతో అనేక సంవత్సరాలుగా ఆదివాసీలకు వైద్యసేవలు అందిస్తోంది. పీజీ కోర్సుల కోసం బోధనాస్పత్రిగా మారుతుండటంతో ఈ సేవలు ఇంకా విస్తరించనున్నాయి. ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంసీహెచ్లాంటి పీజీ కోర్సులు వస్తే డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, సహాయక సిబ్బంది సంఖ్య పెరుగుతుంది. ఈ పీజీ వైద్యశాల వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. బార్డర్‌లోని మారుమూల గిరిజన గ్రామాల్లో ఉండే ఆదివాసీలకు సర్కారు దవాఖానాలో ప్రత్యేక వైద్యసదుపాయాలు అందుతాయి. కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్ధోపెడిక్స్ లాంటి స్పెషలిస్ట్ వైద్యం అందుబాటులోకి రానుంది.
గిరిజన కష్టాలకు చెక్..
ప్రధానంగా వైద్యం అందని ద్రాక్షాగా ఉన్న భద్రాచలం ఏజన్సీలో ఈ పీజీ కళాశాల ఏర్పాటుతో గిరిజనుల కష్టాలకు చెల్లుచీటీ పలకనుంది. డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులతో ఏటా ఆదివాసీలు సతమతమవుతున్నారు. అధునాతన వైద్యం కోసం వరంగల్‌లోని గాంధీ ఆస్పత్రికి, హైదరాబాద్‌లోని నిమ్స్ కు ఇప్పుడు రిఫర్ చేస్తున్నారు. ఇకపై ఎలాంటి వైద్యమైనా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసే పీజీ కాలేజీలోనే గిరిజనులకు అందించనున్నారు. వైద్యుల, మందుల
కొరత తీరుతుంది.
సర్కారు నిర్ణయంతో గిరిజనులకు మేలు..
గిరిజనులకు మెరుగైన వైద్యం కోసం ఎన్నో ఏండ్ల నుంచి నిరీక్షిస్తున్నాం. ఇన్నాళ్లకు ఆ నిరీక్షణకు తెరపడింది. అధునాతన వైద్యం అందక ఆదివాసీ బిడ్డలు కన్నుమూస్తున్నారు. సర్కారు నిర్ణయం మా గిరిజనులకు మేలు చేస్తుంది.
ఇర్పా రాజు, ఆదివాసీ నేత
ఆదివాసీలకు ఆధునిక వైద్యం అందుతుంది
గిరిజనులకు ఇది గొప్ప అవకాశం. ఏండ్ల తరబడి ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు ఈ పీజీ కాలేజీ పరిష్కారం చూపుతుంది. ఆధునిక వైద్యం ఆదివాసీలకు అందుతుంది. వ్యాధులపై జరిగే పరిశోధనలు వారికి మేలు చేస్తాయి.
డా.రామకృష్ణ, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి