పాఠశాల విద్యలో తెలంగాణకు 23వ స్థానం

పాఠశాల విద్యలో తెలంగాణకు 23వ స్థానం

‘పీజీఐ’ 2019-20 రిపోర్టు రిలీజ్  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యా శాఖ పనితీరు దిగజారుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలోని స్థితిగతులపై ‘పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ)’ 2019–20 రిపోర్టును కేంద్రం సోమవారం రిలీజ్ చేసింది. బడుల్లో సౌలతులు, విద్యా ప్రమాణాలు, పాలన, యాక్సెస్, ఈక్విటీ వంటి అంశాలపై పాయింట్ల ఆధారంగా గ్రేడింగ్ కేటాయించింది. దేశవ్యాప్తంగా మొత్తం15 లక్షల స్కూళ్లు ఉండగా, వాటిలో 97 లక్షల మంది టీచర్లున్నారు. 25 కోట్ల స్టూడెంట్లు చదువుతున్నారు. మూడేండ్ల నుంచి రాష్ర్టాల్లో విద్యాహక్కు అమలు, ఫెసిలిటీస్​ను తెలుసుకునేందుకు పీజీఐ రిపోర్టును కేంద్రం విడుదల చేస్తోంది. తాజాగా సోమవారం వచ్చిన రిపోర్టులో ఆయా రాష్ట్రాలు సాధించిన పాయింట్ల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చింది. 37 రాష్ర్టాల్లో తెలంగాణ వెయ్యి పాయింట్లకు గాను 772 పాయింట్లు సాధించి 23వ స్థానంలో నిలిచింది. గతేడాది ప్రకటించిన 2018–19 రిపోర్టులో తెలంగాణ 16వ స్థానంలో నిలువగా, ఈ సారి 7 స్థానాలు దిగజారింది. టాప్ లో పంజాబ్ (929), చండీగఢ్ (912), తమిళనాడు(906), కేరళ (901)నిలిచాయి. చివరిస్థానాల్లో లడఖ్ (545), మేఘాలయ(649) ఉన్నాయి.    

రాష్ట్రానికి ఏ విభాగంలో ఎంత ర్యాంక్?    

  • లర్నింగ్ అవుట్ కమ్స్ అండ్ క్వాలిటీలో 180 పాయింట్లకు గాను తెలంగాణ142 సాధించి 12వ ప్లేస్ లో నిలిచింది.
  • యాక్సెస్​లో 80 పాయింట్లకు గాను 69  సాధించి 19వ స్థానంతో సరిపెట్టుకుంది. 
  • ఇన్​ఫాస్ట్రక్చర్ ఫెసిలిటీస్​లో 150 పాయింట్లకు113 స్కోర్ తో 21వ ప్లేస్ లో నిలిచింది. 
  • ఈక్విటీలో 230 స్కోర్​కు గాను  210 పాయింట్లతో 26వ ర్యాంకు పొందింది. 
  • గవర్నెన్స్ ప్రాసెస్​లో 360 పాయింట్లకు గాను 238 స్కోర్ తో 26వ ప్లేస్ లో నిలిచింది.