రూ.2 వేలనోట్లు రద్దు చేయండి : సుశీల్ కుమార్ మోడీ

రూ.2 వేలనోట్లు రద్దు చేయండి : సుశీల్ కుమార్ మోడీ

దేశంలో  రూ. 2 వేల  నోట్లను దశలవారీగా రద్దు చేయాలని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ రాజ్యసభలో డిమాండ్‌ చేశారు. వీటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు ప్రజలకు రెండేళ్ల గడువు ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని  కోరారు. రాజ్యసభ జీరో అవర్ లో ఎంపీ ఈ ప్రస్తావనను లేవనెత్తారు. దేశంలోని చాలా ఏటీఎంలలో 2 వేల రూపాయల నోట్లు ఖాళీ అయ్యాయని, ఆర్‌బీఐ  కూడా  2 వేల రూపాయల కరెన్సీ నోట్ల ముద్రణను  నిలిపివేసిందన్నారు.  త్వరలో ఈ నోట్లను రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతోందని.. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు.

500, 1000 రూపాయల నోటును రద్దు చేసి  2 వేల రూపాయల నోటును  చలామణిలోకి తేవడంలో అర్థమే లేదని సుశీల్ కుమార్ అభిప్రాయపడ్డారు . 2 వేల రూపాయల నోట్లను నిల్వ ఉంచడంతో డ్రగ్స్, మనీలాండరింగ్ వంటి అక్రమ వ్యాపారాల్లో తరచుగా ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. నల్లధనానికి 2 వేల  నోటు పర్యాయపదంగా మారిందన్నారు. కాబట్టి దీనిని  కేంద్రప్రభుత్వం  దశలవారీగా రద్దు చేయాలని  సుశీల్ కుమార్ మోడీ కోరారు.