
- జీటీఆర్‌ఐ వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఐసీఈఏ
- ఆగస్టు, సెప్టెంబర్లలో సాధారణంగానే ఎగుమతులు తగ్గుతాయని వెల్లడి
- కిందటేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో ఫోన్ల ఎగుమతులు 39 శాతం అప్
- అమెరికాకు ఎగుమతులు 148 శాతం జూమ్
న్యూఢిల్లీ: భారతదేశం నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు ఈ ఏడాది ఆగస్టులో ఏడాది లెక్కన 39 శాతం పెరిగి 1.53 బిలియన్ డాలర్లకు చేరాయని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) పేర్కొంది. అమెరికాకు ఎగుమతులు అయితే 148 శాతం పెరిగి 965 మిలియన్ డాలర్లకు చేరాయని వెల్లడించింది. ఇటీవల కొన్ని వార్తలు సరైన సందర్భం లేకుండా తప్పుదోవ పట్టించేలా పబ్లిష్ అయ్యాయని ఐసీఈఏ అభిప్రాయపడింది. తాజాగా గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) ఈ ఏడాది మేలో 2.29 బిలియన్ డాలర్లుగా ఉన్న అమెరికా ఎగుమతులు ఆగస్టులో 964.8 మిలియన్ డాలర్లకు తగ్గాయని పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇది ఆందోళనకరమైన విషయమని, టారిఫ్‌లు లేకపోయినా ఇలా తగ్గడం అసాధారణం అని పేర్కొంది. ఐసీఈఏ మాత్రం ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నవిగా కొట్టిపారేసింది. ఒకే ఆర్థిక సంవత్సరంలోని వేర్వేరు నెలలను పోల్చడం కంటే, అంతకు ముందు ఏడాదిలోని సేమ్ నెలలో జరిగిన ఎగుమతులతో పోల్చాలని సూచించింది. అప్పుడే ట్రెండ్ అర్థమవుతుందని తెలిపింది.
ఐసీఈఏ ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్–ఆగస్టు) అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 8.43 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది 2024–25లోని ఇదే కాలంలో నమోదైన 2.88 బిలియన్ డాలర్లతో పోల్చితే దాదాపు మూడు రెట్లు అధికం. ఈ ఐదు నెలల్లో జరిగిన ఎగుమతులు, 2024–25 మొత్తంలో అమెరికాకు జరిపిన 10.56 బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో 80 శాతాన్ని చేరుకున్నాయి.
ఎగుమతులు తగ్గడం సాధారణమే
ఆగస్టు, సెప్టెంబర్ నెలలు సాధారణంగా ఎగుమతులు నెమ్మదిస్తాయని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రూ అన్నారు. కంపెనీలు కొత్త మోడళ్లను సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్‌లో విడుదల చేస్తాయని, దీని వల్ల గ్లోబల్ కస్టమర్లు కొత్త మోడళ్ల కోసం ఎదురుచూస్తూ, ఆగస్టులో కొనుగోళ్లు తగ్గిస్తారని, తద్వారా ఎగుమతులు తగ్గుతాయని వివరించారు. పాత మోడళ్లపై డిస్కౌంట్లు వచ్చే అవకాశం ఉండటంతో, వాటి కొనుగోళ్లు కూడా తాత్కాలికంగా తగ్గుతాయన్నారు.
‘‘అలాగే, ఆగస్టు, సెప్టెంబర్ ప్రారంభంలో ప్లాంట్లు, మెషినరీలు కొత్త మోడళ్లకు అనుగుణంగా మార్చే పనులు జరుగుతాయి. ఇది ఉత్పత్తి తగ్గుదలకు, తద్వారా ఎగుమతుల తగ్గుదలకు దారితీస్తుంది. దీన్ని డిమాండ్‌కు అనుగుణంగా ముందుగానే ప్లాన్ చేస్తారు” అని పంకజ్ పేర్కొన్నారు. ఐసీఈఏ ప్రకారం, దీపావళి, ఇతర పండుగల సమయాల్లో కంపెనీలు లోకల్‌గా సప్లయ్ పెంచుతాయి. అందువల్ల సెప్టెంబర్, అక్టోబర్ ప్రారంభంలో ఎగుమతులు తగ్గుతాయి.
దీపావళి తర్వాత, థాంక్స్‌గివింగ్, బ్లాక్ ఫ్రైడే, క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి వెస్ట్రన్ దేశాల పండుగల వల్ల అంతర్జాతీయ డిమాండ్ పెరిగి ఎగుమతులు మళ్లీ ఊపందుకుంటాయి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్ ప్రారంభమైన 5 సంవత్సరాల కాలంలో, స్మార్ట్‌ఫోన్ రంగం భారతదేశంలో అత్యుత్తమ ఎగుమతి రంగంగా ఎదిగింది. ఎగుమతుల పరంగా 2014–15లో 167వ స్థానంలో ఉన్న ఈ రంగం, 2024–25 నాటికి దేశంలోనే అగ్రస్థానానికి చేరింది.