
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తు న్నాయి. తప్పులను ప్రశ్నించే ప్రతిపక్షాలపై, ప్రజాసంఘాలపై సీఎం హోదాలో నాడు కేసీఆర్ వేసిన స్కెచ్‌లు, ప్లాన్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు విచారణలో ఈ వివరాలన్నీ వెల్లడయ్యాయి. వీటిని రాధాకిషన్‌రావు కస్టడీ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు.
అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులపై కేసీఆర్ డైరెక్షన్లో ఫోన్ ట్యాపింగ్ నడిచిందని రాధాకిషన్‌రావు వెల్లడించాడు. బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, ఎన్టీవీ చైర్మన్ నరేంద్రనాథ్ చౌదరి, ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపైనా గత సర్కార్ ఫోన్ ట్యాపింగ్‌ను ప్రయోగించిందన్నాడు. ప్రభుత్వంలోని తప్పులను ప్రశ్నించినందుకు 2021 ఆగస్టులో తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయించింది. కేసీఆర్ ఆదేశాల మేరకే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్టు రాధాకిషన్ రావు స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
ఇదంతా నాటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు ఆధ్వర్యంలోనే చేసినట్లు వెల్లడించాడు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తెలిసి కొందరు స్నాప్‌చాట్‌లో మాట్లాడితే.. ఆ కాల్స్ కూడా ట్యాప్ చేసినట్టు తెలింది. ఎలక్షన్స్ టైమ్‌లో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి చెందిన డబ్బును రాజ్‌పుష్ప సంస్థ నుంచి తరలించామని, ఇలా అధికార పార్టీకి చెందిన డబ్బును ట్రాన్స్‌పోర్ట్ చేసేందుకు పోలీస్ వెహికల్స్ వాడినట్టు కూడా రాధాకిషన్‌రావు వెల్లడించాడు.
నాడు దుబ్బాక, హుజూరాబాద్ బై ఎలక్షన్స్‌తో పాటు మునుగోడు బై ఎలక్షన్‌ను కేసీఆర్ అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాగైనా బీజేపీ గెలుపును అడ్డుకోవాలని పథకం పన్నారు. ఈ క్రమంలోనే 2022 అక్టోబర్‌లో కొంతమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించి.. పైలట్ రోహిత్‌రెడ్డి నుంచి సమాచారం సేకరించారు. ఇందులో భాగంగా నాటి ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుతో కేసీఆర్ పలుమార్లు మీటింగ్స్ జరిపారు. అక్టోబర్ చివరి వారంలో నాటి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో ప్రభాకర్ రావు భేటీ అయ్యారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ నేతలను ట్రాప్ చేయాలని రాధాకిషన్‌రావుకు ప్రభాకర్‌రావు సూచించారు. ఇందుకు తగ్గట్టుగా నాటి ఎస్‌ఐబీ ఎస్‌ఓటీ చీఫ్ ప్రణీత్‌రావు టీమ్ నిఘా పెట్టింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ప్రైవేట్ వ్యక్తులను ఆ టీమ్ పూర్తిగా తమ సర్వెలైన్స్లోకి తీసుకుంది. ఫోన్‌ట్యాపింగ్ ద్వారా ఆడియో క్లిప్ సేకరించింది. ఆ ఆడియో క్లిప్‌ను కేసీఆర్‌కు చేరవేసింది. ఆ తర్వాత నాటి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పటిష్టంగా ట్రాప్ స్కెచ్ వేయాలని సూచించారు. ఇందులో భాగంగా నందుకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీతో రోహిత్‌రెడ్డి పలుమార్లు మాట్లాడారు. వీరి సంభాషణలు అన్నీ రికార్డ్ చేశారు. ఇదే క్రమంలో మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ను ట్రాపింగ్కు కేంద్రంగా ఎంచుకున్నారు.