ఫోన్లు ట్యాప్​ చేసి బ్లాక్​ మెయిల్​​ .. విచారణలో విస్తుపోయే నిజాలు

ఫోన్లు ట్యాప్​ చేసి బ్లాక్​ మెయిల్​​ .. విచారణలో విస్తుపోయే నిజాలు
  • ప్రతిపక్షం, స్వపక్షం.. అందరిపైనా ఇదే అస్త్రం వాడిన గత బీఆర్​ఎస్​ సర్కార్​
  • సినిమావాళ్లు, ఇండస్ట్రియలిస్టులు, బంధువులపైనా ప్రయోగం
  • బీఆర్ఎస్​కు ఎలక్టోరల్​ బాండ్స్​ నిధుల వెనుకా ఫోన్​ ట్యాపింగే
  • ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఇదే కథ
  • నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్​రావుకు టార్గెటెడ్​ 
  • ఫోన్​ నంబర్లు.. ఆయన నుంచి ప్రణీత్​రావు టీమ్​కు చేరవేత
  • అట్ల వచ్చిన ఫోన్​ నంబర్లను ట్యాప్​ చేసిన 30 మంది టీమ్​
  • -ఐటీ కంపెనీ పేరుతో ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ కొనుగోలు
  • ప్రత్యర్థుల ఇండ్లకు 200 మీటర్ల దూరంలో అమరిక

హైదరాబాద్‌‌, వెలుగు : ఫోన్​ ట్యాపింగ్​ను గత బీఆర్​ఎస్​ సర్కార్​ తిరుగులేని ఆయుధంగా వాడుకున్నట్లు తేలింది. ప్రతిపక్షాలతోపాటు స్వపక్షంపైనా ఈ అస్త్రాన్నే ప్రయోగించినట్లు బయటపడింది. సినిమా, ఫార్మా, రియల్‌‌ ఎస్టేట్‌‌, ఐటీ రంగాల ప్రముఖుల కాల్స్‌‌ను కూడా రికార్డ్​ చేసినట్లు వెల్లడైంది. బంధువులను కూడా వదలలేదని విచారణలో వెలుగుచూసింది. పారిశ్రామిక వేత్తల కాల్స్​ను రికార్డ్​ చేసి వాళ్లకే వాటిని తిరిగి పంపి బ్లాక్​ మెయిల్​ చేశారని, అట్ల బ్లాక్​ మెయిల్​ చేసి నాడు బీఆర్​ఎస్​కు కోట్లాది రూపాయల నిధులను ఎలక్టోరల్​ బాండ్స్​ ద్వారా రాబట్టకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఫోన్​ ట్యాపింగ్​లో పాలుపంచుకున్న ఆఫీసర్లు కూడా తమ సొంత ప్రయోజనాలకు ఆ టెక్నాలజీని వాడుకొని, ప్రైవేటు వ్యక్తుల నుంచి డబ్బులు గుంజినట్లు సమాచారం. ఫోన్​ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఎస్​ఐబీ మాజీ అధికారులు ప్రణీత్‌‌రావు, భుజంగరావు, తిరుపతన్న విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. కేసులో ఏ1గా ఉన్న నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ​ప్రభాకర్​రావును అరెస్టు చేస్తే ఇంకా అనేక విషయాలు వెలుగుచూస్తాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. 

 ప్రస్తుతం ప్రభాకర్​రావు పరారీలో ఉన్నాడు. ఆయనతోపాటు పరారీలో ఉన్న మరో నిందితుడు రాధాకిషన్​రావు కోసం ఇప్పటికే లుకౌట్​ సర్క్యులర్​ను జారీ చేశారు. ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారాన్ని సీరియస్​గా తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం.. దర్యాప్తును మరింత లోతుగా జరపాలని, సాక్ష్యాలను పకడ్బందీగా రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. 

ఎవరినీ వదలలే!

ప్రజారక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసింగ్‌‌‌‌‌‌‌‌ను గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన సొంత ఎజెండాకు వినియోగించుకుందని మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఫోన్‌‌‌‌‌‌‌‌ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ వ్యవహారం బయటకు రావడంతో అది వాస్తవమని రుజువైంది. ప్రణీత్‌‌‌‌‌‌‌‌రావు టీమ్‌‌‌‌‌‌‌‌తో బడా వ్యాపారుల నుంచి ఎలక్టోరల్‌‌‌‌‌‌‌‌ బాండ్స్‌‌‌‌‌‌‌‌ కొనిపించారని.. ప్రతిపక్ష నేతలు, పౌరహక్కుల సంఘాలను అణచివేసే విధంగా పోలీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో ఇల్లీగల్ ఆపరేషన్స్ చేసినట్లు ప్రస్తుతం పోలీసుల విచారణలో తేలింది.

కాంగ్రెస్​, బీజేపీ ముఖ్య నేతలు, వాళ్ల కుటుంబ సభ్యులు, సొంత పార్టీలోని నాయకులు, రూ. వేల కోట్ల లావాదేవీలు జరిపే ఇండస్ట్రియలిస్ట్‌‌‌‌‌‌‌‌లు, రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌, ఫార్మా, జువెల్లరీ వ్యాపారులు.. ఇట్లా ఎవరినీ వదలకుండా అందరినీ ఫోన్​ ట్యాపింగ్​ ద్వారా గత ప్రభుత్వం టార్గెట్​చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ఓ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్‌‌‌‌‌‌‌‌ నుంచి అత్యాధునిక సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ పరికరాలను కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇందుకు అవసరమైన డబ్బును ఇంటెలిజెన్స్​ మాజీ చీఫ్‌‌‌‌‌‌‌‌ ప్రభాకర్ రావు ద్వారా  చెల్లించినట్లు తెలిసింది. 

ఇల్లీగల్ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌ కోసం వాడాల్సింది..!

పోలీస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో స్పెషల్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌(ఎస్‌‌‌‌‌‌‌‌ఐబీ) అత్యంత కీలకమైన విభాగం. రాష్ట్రం, దేశభద్రతకు భంగం కలుగకుండా ఉండేందుకు ఎస్‌‌‌‌‌‌‌‌ఐబీ ద్వారా ఆపరేషన్స్ నిర్వహిస్తుంటారు. ఇందుకోసం కేంద్ర హోంశాఖ అనుమతితో ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీని వినియోగిస్తుంటారు. మావోయిస్టులు, టెర్రరిస్టులు సహా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి కదలికలను ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ ద్వారా గుర్తిస్తుంటారు.

ఇలాంటి వారు ఎవరితో మాట్లాడుతున్నారు.. ఎలాంటి విధ్వంసాలకు పథకం రచిస్తున్నారు.. అనేది గుర్తించి, ఆయా వ్యక్తులకు సంబంధించిన నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను ట్రేస్ చేస్తుంటారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ముందుస్తు చర్యలు తీసుకుంటుంటారు. కానీ, గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం మాత్రం ఎస్‌‌‌‌‌‌‌‌ఐబీ కేంద్రంగా ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌, ఇతర ఆపరేషన్స్ పూర్తిగా చట్ట విరుద్ధంగా జరిపినట్లు ప్రణీత్‌‌‌‌‌‌‌‌ రావు అరెస్ట్‌‌‌‌‌‌‌‌తో బయటపడింది. 

ఇజ్రాయిల్​లో సాఫ్ట్​వేర్​ కొని..!

ప్రణీత్‌‌రావు విచారణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కోసం రవిపాల్‌‌ అనే వ్యక్తి ద్వారా ఇజ్రాయిల్‌‌ నుంచి సాఫ్ట్‌‌వేర్​ను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. రవిపాల్​కు చెందిన ఐటీ కంపెనీ పేరుతో ట్యాపింగ్‌‌ పరికరాలు, అత్యాధునిక సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ను దిగుమతి చేసుకున్నారని, ఇందుకు ఎస్​ఐబీ ద్వారానే చెల్లింపులు జరిగినట్లు తేలింది. ఇట్ల కొన్న  ట్యాపింగ్ పరికరాలను ప్రతిపక్ష నేతలు, ప్రైవేటు వ్యక్తుల ఇండ్ల పరిసరాల్లో (200 మీటర్ల దూరంలో) రవిపాల్‌‌ టీమ్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేసిందని పోలీసులు గుర్తించారు. ఆయనను విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఫోన్​ ట్యాపింగ్​ కేసులో అరెస్టయిన భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి తీసుకునేందుకు మంగళవారం కోర్టులో పిటిషన్  దాఖలు చేయనున్నారు.

పైవాళ్ల నుంచి ప్రణీత్​రావు టీమ్​కు ఫోన్​ నంబర్లు!

మాజీ డీఎస్పీ ప్రణీత్‌‌రావు స్పెషల్‌‌ ఆపరేషన్ టార్గెట్స్‌‌(ఎస్‌‌వోటీ) చీఫ్‌‌గా పనిచేశాడు. ఎవరి ఫోన్లను ట్యాప్​ చేయాలో వాళ్ల ఫోన్​ నంబర్లు నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ప్రభాకర్​రావు ద్వారా 30 మంది సభ్యుల ప్రణీత్‌‌రావు టీమ్‌‌కు చేరేవి. ప్రతిపక్షాలు, వ్యాపారస్తులు, ప్రైవేట్‌‌ వ్యక్తులతో పాటు  సొంత పార్టీలోని కొందరు నేతల ఫోన్​ నంబర్లు కూడా ఇందులో ఉండేవి. అంతేకాదు వివిధ రంగాలకు చెందిన పలువురు మహిళల ఫోన్​ నంబర్లు సైతం ఈ టీమ్​ వద్దకు వచ్చేవి. 

ఎన్నికల్లో ప్రత్యర్థుల కదలికలే టార్గెట్​గా!

ప్రధానంగా రాష్ట్రంలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​కు ఎదురు లేకుండా చేసేందుకు ఫోన్​ ట్యాపింగ్​ టీమ్​ స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించేది. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌, 2019 ఎంపీ ఎన్నికలతో పాటు మునుగోడు, హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్​ ట్యాపింగ్​ను ఉపయో గించినట్లు తాజా విచారణలో బయట పడింది. ఎన్నికల టైమ్​లో ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్​ చేసి వారి ఆర్థిక లావాదేవీలను అప్పటి ప్రభుత్వం టార్గెట్​ చేసిందని నిందితులు ఒప్పుకున్నట్లు సమాచారం.

ఫోన్​ ట్యాపింగ్​ సమాచారం ఆధారంగా టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ డీసీపీ హోదాలోని రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి.. వివిధ కంపెనీలకు చెందిన డబ్బుతో పాటు ప్రతిపక్ష పార్టీల డబ్బును సీజ్ చేయించినట్లు తేలింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక కూడా ఫోన్​ ట్యాపింగ్​ ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.  ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఇప్పటి వరకు కొందరు పోలీసు అధికారులు, మీడియా సంస్థల అధినేతల పేర్లు బయటకు వచ్చాయి. ఇక బీఆర్​ఎస్​ నేతలు ఎవరెవరు ఏ విధంగా ఈ క్రైమ్​లో ఇన్వాల్వ్​ అయ్యారో కొద్దిరోజుల్లో తేలనుంది.