
మోకాళ్లపై కూర్చుని, ఆరేళ్ల కొడుకును పట్టుకుని కళ్లనిండా నీళ్లు తీసుకుంటున్న ఈ తల్లి. ఎదురుగా చేతిలో మెషీన్ గన్ పట్టుకున్న సైనికుడు. ఆ సైనికుల పహారాలోని మెక్సికో సరిహద్దులు దాటి అమెరికాలోకి వెళ్లాలనుకుంది ఆ తల్లి. కానీ, అక్కడే కాచుకు నిలబడిన మెక్సికో నేషనల్ గార్డ్ సైనికులు ఆమెను వెళ్లనిస్తేనా? వీల్లేదంటూ అడ్డుగా నిలబడ్డారు. ఏం చేయాలో తోచని స్థితిలో ఇదిగో ఇలా తమను వెళ్లనివ్వాలని వేడుకుంటూ కొడుకును పట్టుకుని బోరున ఏడ్చేసింది. ఆ తల్లి పేరు లెటీ పెరెజ్. ఆ చిన్నారి పేరు ఆంథోని డియాజ్. గ్వాటెమాల నుంచి దాదాపు 2410 కిలోమీటర్లు ప్రయాణించింది. మెక్సికో సరిహద్దుల్లోని సియుడాడ్ జువారెజ్ సిటీకి వచ్చింది. ఇంకొంచెం సేపైతే ఆమె అమెరికాలో కాలు పెట్టేదే. కానీ, సైనికులు అడ్డుకోవడంతో అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. మనసును కదిలించే ఈ ఫొటోను రాయిటర్స్ ఫొటోగ్రాఫర్ జోస్ లూయిస్ గోంజాలెజ్ తీశాడు.