మొబైల్స్, కెమెరాలు కనిపిస్తే.. లాక్కుని హుండీలో వేస్తారు

 మొబైల్స్, కెమెరాలు కనిపిస్తే.. లాక్కుని హుండీలో వేస్తారు

బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ కీలక నిర్ణయం వెలువరించింది. ఇక నుంచి కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై నిషేధాన్ని ప్రకటించింది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఆలయ ప్రాంగణమంతా బోర్డులు కూడా ఏర్పాటు చేసింది.

ఆలయం లోపల ఎలాంటి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనుమతించబడదు. మీరు CCTV కెమెరాల నిఘాలో ఉన్నారు' అని తెలిపే బోర్డులను ఆలయ ప్రాంగణంలో అనేక ప్రదేశాల్లో ఉంచారు. కేదార్‌నాథ్ ధామ్‌ను సందర్శించే యాత్రికులు నిరాడంబరమైన దుస్తులు ధరించాలని  బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయ్ అజేంద్ర ఈ సందర్భంగా యాత్రికులను కోరారు. గతంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మార్గదర్శకాలను విడుదల చేసినట్లు చెప్పారు.

గతంలో కొంతమంది యాత్రికులు అసభ్యకరంగా ప్రవర్తించారనే వార్తలు రావడంతో ఆలయ కమిటీ ఈ నిషేధాన్ని విధించింది. మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయడానికి కేదార్‌నాథ్ వద్ద హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు.

ఇటీవల ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం దగ్గర ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ను ప్రపోజ్ చేసింది. ఈ క్రమంలో ఆ యువతి స్నేహితురాలు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇది వైరల్‌గా మారింది. వీడియో వైరల్ కావడంతో, ఇంటర్నెట్ లో నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ విషయం తెలియగానే బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించింది.

ఆలయ ఆవరణలో ఇలాంటి వీడియోలు లేదా రీల్స్ చేయడం వల్ల ఇక్కడి మత పవిత్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆలయ కమిటీ చెబుతోంది. ఇలాంటి వీడియోలు తీస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ పోలీసులను కోరింది.