
- వీరి పరిశోధనలు క్వాంటమ్ కంప్యూటర్స్, క్రిప్టోగ్రఫీ, సెన్సర్ల తయారీకి దోహదం చేశాయన్న నోబెల్ కమిటీ
స్టాక్ హోం (స్వీడన్): క్వాంటమ్ టెక్నాలజీలో కీలక పరిశోధనలు చేసిన ముగ్గురు సైంటిస్టులకు ఈ ఏడాది ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ లభించింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ పరిశోధకుడు జాన్ క్లార్కీ (83), యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాంటా బార్బరాకు చెందిన రీసెర్చర్లు మైకేల్ హెచ్. డివోరెట్(72), జాన్ ఎం. మార్టినిస్(67)ను అవార్డుకు ఎంపిక చేసినట్టు నోబెల్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ ప్రక్రియల్లో వీరు చేసిన పరిశోధనలకు గుర్తింపుగా 2025 ఫిజిక్స్ నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు వెల్లడించింది.
‘‘ఈ ముగ్గురు సైంటిస్టుల పరిశోధనలు క్వాంటమ్ టెక్నాలజీలో కీలక ఆవిష్కరణలకు మార్గం చూపాయి. ప్రధానంగా క్వాంటమ్ కంప్యూటర్లు, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ సెన్సర్ల తయారీకి వీరి పరిశోధన ఫలితాలు దోహదం చేశాయి. తద్వారా మరింత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ల తయారీకి, మరింత భద్రతతో కూడిన కమ్యూనికేషన్ల నిర్వహణకు, మరింత మెరుగైన సెన్సర్ల తయారీకి వీరి పరిశోధనలు మార్గం సుగమం చేశాయి” అని నోబెల్ కమిటీ ప్రశంసించింది.
రూ. 10 కోట్ల క్యాష్ ప్రైజ్..
నోబెల్ విజేతలకు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10న అవార్డును ప్రదానం చేస్తారు. ఫిజిక్స్ నోబెల్ అవార్డు కింద విజేతలు ముగ్గురికీ 11 మిలియన్ల స్వీడిష్ క్రోనార్ల(రూ. 10.39 కోట్లు)ను సమానంగా పంచుతారు. కాగా, జాన్ క్లార్కీ 1942లో బ్రిటన్ లో జన్మించారు. 1968లో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జిలో పీహెచ్ డీ చేసి, అమెరికాకు వెళ్లారు. మైకేల్ డివోరెట్ 1953లో ఫ్రాన్స్ లో జన్మించారు. 1982లో పారిస్ ఎస్ యూడీ యూనివర్సిటీలో పీహెచ్ డీ తర్వాత అమెరికా వెళ్లారు. జాన్ మార్టినిస్ 1958లో అమెరికాలో జన్మించారు. 1987లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో పీహెచ్ డీ చేశారు.