
- రాజకీయ జోక్యం వద్దని హైకోర్టు చెప్పినా బేఖాతరు
- ఈసారి ప్రతి నియోజకవర్గంలో 250 మందికే అమలు!
- అదీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు సాగదీత
హైదరాబాద్, వెలుగు: దళిత బంధు పథకానికి అర్హుల ఎంపిక బాధ్యతను మళ్లా ఎమ్మెల్యేలకే రాష్ట్ర సర్కారు అప్పగించింది. ఎమ్మెల్యేలు ఎవరి పేర్లయితే సిఫార్సు చేస్తారో వాళ్ల పేర్లే అర్హుల జాబితాలో ఉండనున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ కింద 2021లో ఎమ్మెల్యేలు ఇచ్చిన పేర్లనే అర్హుల లిస్ట్‌గా ఫైనల్ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. దళితబంధు పథకం కోసం జిల్లాల కలెక్టర్లు నియోజకవర్గాల్లో సంబంధిత ఎమ్మెల్యే, అధికారులతో కలిసి అర్హులను ఎంపిక చేస్తారని గత నెల ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే కలెక్టర్లు కాకుండా.. ఎమ్మెల్యే తెచ్చిన లిస్ట్‌నే ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఆ లిస్టుతోనే ముందుకు వెళ్లాలని కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు వెళ్లాయి. గతంలో ఓ వ్యక్తి తనకు దళితబంధు ఇవ్వాలని నేరుగా కలెక్టర్‌కు అప్లికేషన్ పెట్టుకోగా.. ఎమ్మెల్యే సిఫార్సు లేదని కలెక్టర్ తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వ పథకాల్లో రాజకీయ జోక్యం తగదని స్పష్టం చేసింది. అప్లై చేసుకునే అవకాశం ఇచ్చి.. వాటిని పరిశీలించేలా వ్యవస్థ ఉండాలంది.
పైగా ఈ స్కీంలో కొందరు ఎమ్మెల్యేలు కమీషన్ తీసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని సీఎం కేసీఆరే స్వయంగా హెచ్చరించారు. దీంతో ఈసారి అర్హుల ఎంపికలో మార్పులుంటాయని అంతా భావించారు. కానీ మళ్లీ పాత పద్ధతికే సర్కారు ఓకే చెప్పింది. ఈ పథకానికి దళితుల నుంచి ఎలాంటి అప్లికేషన్లు తీసుకోవద్దని, ఆన్లైన్లో కానీ.. ఆఫ్‌లైన్‌లో కానీ దరఖాస్తు ప్రక్రియ ఉండదని కలెక్టర్లకు స్పష్టం చేసింది. ఎమ్మెల్యే ఇచ్చే లిస్ట్‌లోని పేర్లనే పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈసారి ప్రతి నియోజకవర్గంలో 1,100 దళిత కుటుంబాలకు దళితబంధు ఇస్తామని ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నిధుల కటకటతో 250 మందికే అమలు చేయాలని, దీన్ని అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించాలని భావిస్తున్నది.
అప్లికేషన్లు వస్తే సమాధానం చెప్పలేమని..!
దళితబంధు కోసం అప్లికేషన్లు తీసుకుంటే తమకు సమస్యగా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నది. సర్కార్ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 18 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. ఈ లెక్కన దరఖాస్తులకు అవకాశం ఇస్తే కనీసం 15 లక్షల నుంచి 16 లక్షల అప్లికేషన్లు వస్తాయని, దరఖాస్తు చేసుకున్నోళ్లంతా దళితబంధు ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తే మొదటికే మోసం వస్తుందని సర్కారు భావిస్తున్నది. పైగా మొన్నటి దాకా ఎమ్మెల్యేలు దళితబంధు స్కీం కింద సంబంధిత నియోజకవర్గాల్లో చాలామంది పేర్లు రాసుకున్నారు.
దళితబంధు స్కీం ఇస్తామని, ఎలక్షన్ల అయ్యేదాకా తమవెంటే తిరగాలని కండిషన్లు పెట్టి మరీ తిప్పించుకుంటున్నారు. ఇప్పుడు అప్లికేషన్ ప్రక్రియ తీసుకొస్తే.. తాము డమ్మీగా అయ్యామనే అభిప్రాయం దళితుల్లోకి వెళ్తుందని ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. దీంతో అది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేర ప్రభావం చూపుతుందో తెలియదని, ఎమ్మెల్యే ఏ లిస్ట్ తెస్తే దానినే ఓకే చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దళితబంధుకు అర్హులను ఎంపిక ఎలా చేస్తున్నారనే దానిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా విస్మయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఏదో ఒక రకంగా అప్లికేషన్లు తీసుకోవాలి కదా అని ప్రశ్నించినట్లు తెలిసింది. అలా కాకుండా కేవలం ఎమ్మెల్యేలకే అర్హుల జాబితా తయారీ బాధ్యతలు ఇవ్వడం ఏమిటని అన్నట్లు సమాచారం.
చెప్పే లెక్క ఒకటి..
ఇచ్చేది మాత్రం కొందరికేవాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో దళిత బంధు స్కీంకు ప్రభుత్వం రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ మొత్తాన్ని నియోజకవర్గానికి 1,500 మంది చొప్పున (హుజురాబాద్ మినహా) 1.77 లక్షల మంది అర్హులకు జమ చేయాలి. బడ్జెట్‌కు సంబంధించి రిలీజ్ ఆర్డర్ రెండు నెలల కిందటే ఇచ్చారు. అయితే కొత్త సెక్రటేరియెట్ ప్రారంభం సందర్భంగా నియోజకవర్గానికి 1,100 చొప్పున 1.30 లక్షల కుటుంబాలకు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చారు. అయితే 1,100 దాంట్లోనూ అందరికీ ఈ ఏడాదిలో ఇవ్వడం కష్టమని ఆఫీసర్లు చెప్తున్నారు. వీళ్లందరికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలంటే దాదాపు రూ. 13 వేల కోట్లు అవసరమవుతాయి. అయితే ప్రభుత్వ ఖజానా నుంచి అంతా డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. రూ.3 వేల కోట్లు మాత్రమే ఇస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మొత్తంతో నియోజకవర్గానికి 250 దళిత కుటుంబాలకే దళిబంధు సాయం అందనుంది.
నిరుడు ఒక్కరికీ ఇయ్యలే..
దళిత బంధు అమలు కోసం రాష్ట్ర సర్కార్ గతేడాది ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. 2022–23 బడ్జెట్‌లో రూ. 17,700 కోట్లు కేటాయించింది. ఈ లెక్కన 1.77 లక్షల మందికి సాయం అందాలి. కానీ, ఏ ఒక్కరికీ అందలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధికారికంగానే ప్రతి నియోజకవర్గంలో అర్హుల సంఖ్యను 1,100కు ప్రభుత్వం కుదించింది. అది కూడా ఇప్పుడు నిధులు లేవని చెప్పి ఒక్కో సెగ్మెంట్లో 250 మందికే స్కీమ్‌ను పరిమితం చేయాలని భావిస్తున్నది. 2021లో హుజూరాబాద్ బై ఎలక్షన్ టైమ్‌లో దళిత బంధు స్కీంను ప్రభుత్వం ప్రకటించింది. పైలెట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ మొత్తం, మరో 4 అసెంబ్లీ సెగ్మెంట్లలోని 4 మండలాలు, యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రిలో అమలు చేసింది. మిగతా సెగ్మెంట్లలో ఒక్కో చోట వంద మందికి యూనిట్లు గ్రౌండ్ చేసింది. దాదాపు రెండేండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.