ఆక్సిజన్​ మాకే సరిపోదు.. పొరుగోళ్లకు ఇయ్యలేం

ఆక్సిజన్​ మాకే సరిపోదు.. పొరుగోళ్లకు ఇయ్యలేం

తిరువనంతపురం: ఆక్సిజన్​ అవసరాలు తమకూ పెరిగాయని, ఇకపై పొరుగు రాష్ట్రాలకు ఇవ్వలేమని ప్రధాని నరేంద్ర మోడీకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ తేల్చి చెప్పారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలకు చాలా మొత్తంలో ఆక్సిజన్​ను సరఫరా చేశామన్నారు. దీంతో తమవద్ద కేవలం 86 టన్నుల బఫర్​ స్టాక్​ మాత్రమే ఉందని, ఆ స్టాక్​ తమ అవసరాలకూ సరిపోదని చెప్పారు. అయితే, సెంట్రల్​ కమిటీ ఆఫ్​ ఆక్సిజన్​ అలొకేషన్​ నిర్ణయం ప్రకారం మే 6న నిర్ణయించినట్టుగా తమిళనాడుకు 40 టన్నుల ఆక్సిజన్​ను పంపిస్తామన్నారు. ఆ తర్వాత వేరే ఏ రాష్ట్రానికీ ఆక్సిజన్​ను సరఫరా చేయలేమని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,02,640 యాక్టివ్​ కేసులున్నాయని, ఈ నెల 15 నాటికి అవి 6 లక్షలకు పెరిగే అవకాశముందని చెప్పారు. దీంతో ఆక్సిజన్​ అవసరం కూడా 450 టన్నులకు పెరిగే అవకాశముంటుందన్నారు. కాబట్టి రాష్ట్రంలో తయారయ్యే 219 టన్నుల ఆక్సిజన్​ను తమ రాష్ట్రానికే కేటాయించాలని ఆయన కోరారు. మరిన్ని క్రయోజెనిక్​ ఆక్సిజన్​ ట్యాంకర్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.