పింక్ స్లిప్:3వేల మంది ఉద్యోగుల్ని సాగనంపే పనిలో ఐటీ సంస్థ..?

పింక్ స్లిప్:3వేల మంది ఉద్యోగుల్ని సాగనంపే పనిలో ఐటీ సంస్థ..?

సిటీలో ఐటీ జాబర్లు సాఫ్ట్ టార్చర్ అనుభవిస్తున్నారు. ఫోర్సుడ్​ రిజిగ్నేషన్​ తరహాలో చేపడుతున్న పింక్​ స్లిప్​ ఎఫెక్ట్​ గురించి బయటకు చెప్పుకోలేక ఐటీ ఉద్యోగులు మానసికంగా వేదనకు గురవుతున్నారు. అమెరికాకు చెందిన ఓ కంపెనీ గంపగుత్తగా 3వేల మందిని తొలగిం చినట్టుగానే గచ్చిబౌలి కేంద్రంగా నడుస్తున్న సాఫ్ట్​వేర్​ సంస్థ ఒకేసారి 3వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపే ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిసింది. ఐటీ అనుబంధ సేవలు అందిస్తున్న ఇంకో కంపెనీ కూడా దాదాపు 150 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్పులను జారీ చేసింది. మరో బ్యాంకింగ్​ సిటీ క్యాంపస్ లో పనిచేస్తున్న 350 మందిని తొలగించే పనిలో ఉంది.

– హైదరాబాద్​, వెలుగు

‘‘ గతేడాది అక్టోబర్​లో అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఒకేసారి 3 వేల మంది ఉద్యోగులను రోడ్డు మీదకు తీసుకురాగా, హైటెక్ సిటీ కేంద్రంగా బ్యాంకింగ్, ఐటీ అనుబంధ సేవలను అందిస్తున్న మరో కంపెనీ కూడా   150 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్​లను జారీ చేసింది’’.

‘‘అమెరికా కేంద్రంగా పనిచేసే బ్యాంకింగ్ రంగ సంస్థ హైదరాబాద్ క్యాంపస్ లో పనిచేస్తున్న 350 సిబ్బందిని తొలగించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా గచ్చిబౌలి కేంద్రంగా పనిచేస్తున్న మరో కంపెనీ కూడా ఇదే తరహాలో దాదాపు 3వేల మంది ఉద్యోగులకు పింక్ స్లిప్​లు జారీ చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది’’.

హైదరాబాద్, వెలుగు :

ఐటీ కొలువు .. ఐదంకెల్లో జీతం.. ఐదు రోజులు వర్క్‌.. వీకెండ్ లో పార్టీలు, తక్కువ టైంలోనే ఇంక్రిమెంట్లు.. అదృష్టం బాగుంటే ఆన్ సైట్ ఉద్యోగావకాశాలు. ఇంకేముందు డాలర్ల వేటలో సరదాగా గడిచిపోయే ప్రొఫెషన్ మాత్రమే అనుకుంటారు. ఈ వృత్తిలో కంపెనీలు, మేనేజ్‌మెంట్లు తీసుకుంటున్న సడెన్ డిసిషన్లతో ఐటీ ఎంప్లాయ్‌ల్లో  టెన్షన్‌ మొదలైంది.  ఉద్యోగానికి సరిపోవు, కంపెనీ కొత్త ప్రాజెక్టుల విస్తరణలో ఆప్ గ్రేడేషన్ లో భాగంగా, కంపెనీ వృద్ధిని దృష్టిలో పెట్టుకుని కొంతమంది సిబ్బందిని లేదా, మూకుమ్మడిగా విధులకు రావద్దంటూ మర్యాద పూర్వకంగా చెప్పే విధానమే పింక్ స్లిప్. ఐటీ ఎగుమతుల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ టెక్కీలను ఇప్పుడు ఇదే కలవరపెడుతుంది. ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. ప్రస్తుతం 6 లక్షలకు పైగా ఎంప్లాయ్‌లు  ఐటీ, అనుబంధ రంగాల్లో పని చేస్తున్నారు. ఇతర నగరాలతో పోల్చితే సిటీలో మౌలిక వసతులు, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండడంతో  కంపెనీలను నెలకొల్పేందుకు ఇంట్రస్ట్‌ చూపుతుంటాయి. దీనికితోడు లివింగ్ కాస్ట్, హ్యుమన్ రిసోర్సెస్ ఎక్కువగా ఉండడం, ఏటేటా లక్షల్లో బీటెక్ స్టూడెంట్స్‌ మార్కెట్‌లోకి వస్తుండడం అన్నింటా కంపెనీలకు అనుకూలమైన వాతావర ణం. అయితే కంపెనీ తొలినాళ్లలో భారీ సంఖ్యలో తీసుకుని, కాలం గడుస్తున్న కొద్దీ, మారుతున్న ఆర్థిక స్థితిగతులు, డాలర్ రేటు పడిపోవడం వంటి కారణాలు ఈ రంగాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని కంపెనీలు కాస్ట్ కట్టింగ్, గ్రోత్ విస్తరణ వంటి అంశాల ఆధారంగా కంపెనీల్లో 6–10 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ స్థాయి ఉద్యోగులను తొలగిస్తుంటాయి. ఈ క్రమంలోనే మర్యాదపూర్వకంగా ప్రస్తుతం ఈ ఉద్యోగం వదిలేయండి… రెండు నెలల సాలరీ ఇస్తాం, లేదా నేటి నుంచే ఉద్యోగానికి రాకూడదంటూ హెచ్ఆర్ విభాగం అనుసరించే విధానం. హైదరాబాద్ కేంద్రంగా ఇటీవల ఈ తరహా సాఫ్ట్ టార్చర్ ఏదొక కంపెనీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆయా కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు బయటకు చెప్పుకోలేక, ఇతర ఉద్యోగ అవకాశాలను వెదుక్కోలేక మానసికంగా ఎంతో సంఘర్షణకు గురవుతున్నారు.

కంపెనీలు ఎలా చెబుతాయంటే..

ఆర్థిక సంక్షోభం, ఐటీ రంగం డౌన్ ట్రెండ్ లో వెళ్తున్న క్రమంలో అమలు చేస్తారు. కంపెనీకి చెందిన అసిస్టెంట్ కన్సల్టెంట్, మేనేజర్ స్థాయి ఉద్యోగులే కాకుండా, ఐటీ రంగంలో 6 నుంచి 10 ఏళ్ల అనుభవమున్న ఉద్యోగులను ప్రాజెక్టుకు సరిపోయే నైపుణ్యాలు లేని కారణంగానే తొలగిస్తున్నామని ఉద్యోగులకు చెబుతుంటాయి.  రెండు నెలల జీతంతో అడ్వాన్స్ గా చెల్లిస్తుందని ఇక నుంచి జాబ్ కు రావాల్సిన పనిలేదని పింక్ స్లిప్పు పేరిట స్పష్టం చేస్తుంటాయి.  అయితే కొన్ని కంపెనీలు ఉద్యోగులను నేరుగా తీసేయకుండా ప్రాజెక్టులను అసైన్డ్ చేయకుండానే బెంచ్ పిరియడ్ కు పరిమితం చేసి, మూడు నుంచి ఆరు నెలల తర్వాత, ఉద్యోగి నైపుణ్యాలకు సరిపోయే పొజిషన్ లేదని ఈ క్రమంలో తొలగించాల్సి వస్తుందని పేర్కొంటున్నాయి.

స్కిల్ ఎలా తగ్గుతుందంటే..

ప్రస్తుతం పింక్ స్లిప్ కానీ, ఫోర్సుడ్​  రిజిగ్నేషన్ పేరిట ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుండగా, బాధితులంతా రోడ్డున పడుతున్నారు. ఇతర కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు దృష్ట్యా ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఒకవేళ ఫిర్యాదు చేసి ఏదో చేద్దామనుకున్నా కెరీర్ దృష్టిలో పెట్టుకుని ఏం చేయలేని సందిగ్ధానికి గురవుతుంటారని టెక్కీలు చెబుతున్నారు. ‘‘ఉద్యోగంలో జాయిన్ అయ్యే క్రమంలోనే అన్ని అగ్రిమెంట్లపై సంతకాలు చేయించుకుని, ఇక ఉద్యోగిని తొలగించినా న్యాయపరంగా పోరాడే అవకాశాలు లేకుండా చేసే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉంటాయని, ”సెర్చింజన్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి తెలిపారు.

ఏం చేయాలంటే..

కంపెనీలో కాస్ట్ కట్టింగ్ పేరిట ఎంప్లాయ్‌లను ఊస్టింగ్ చేసే క్రమంలో నిర్ధాక్షిణ్యంగా తొలగించకుండా సంబంధిత రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించే దిశగా స్కిల్స్ ప్రోగ్రాం నిర్వహించాలి. కానీ పింక్ స్లిప్పుల పేరిట ఎంప్లాయ్‌లను తొలగించడం ద్వారా ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా తమిళనాడు, మహారాష్ట్ర తరహాలో ఐటీ కంపెనీలపై కార్మిక శాఖ అజమాయిషీ చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఈ తరహా యంత్రాంగం లేకపోవడంతో రహస్యంగా కంపెనీలు విధించే నిర్బంధ తొలగింపులను నియంత్రించవచ్చు. ఉద్యోగ భద్రత కల్పించే అవకాశం కూడా ఉంటుందని ఐటీ ఎక్స్‌పర్ట్‌  పేర్కొంటున్నారు.

లే ఆఫ్ ప్రకటించాలంటే..

ఏదైనా కంపెనీలో ఉద్యోగులను తొలగించాలంటే కార్మిక చట్టాలు, ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ యాక్ట్‌ ప్రకారం తొలగించే ముందు ప్రభుత్వ రంగ సంస్థకు నోటీసులివ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు ఉద్యోగులకు  అలవెన్సులు, ముందస్తు జీతం చెల్లింపు వంటి  హామీలతో పాటు కొంత టైం ఇచ్చి, ఆ తర్వాత తొలగించాలి. అయితే ఇదంతా కంపెనీలకు న్యాయపరమైన చిక్కులు తీసుకువచ్చే అవకాశం ఉండడంతో లే ఆఫ్ ప్రకటించకుండా తెలివిగా కార్పొరేట్‌ మేనేజ్‌మెంట్లు పింక్ స్లిప్పులు, ఫోర్స్ డ్ రిజిగ్నేషన్లకు ఒత్తిడి తెస్తున్నాయి. ‘‘కంపెనీకి చెందిన హెచ్ఆర్  ఒక్కో ఉద్యోగితో  చర్చించి, వింటే సరి లేదంటే టెర్మినేషన్ జరుగుతుంది. ఇలా  సైకాలజికల్ పద్ధతిలో కౌన్సెలింగ్ చేస్తుంటాయని’’ ఈ రంగంలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న ఓ కంపెని ప్రాజెక్టు మేనేజర్ వివరించారు.