అన్ని ఫార్మాట్ల క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా

అన్ని ఫార్మాట్ల క్రికెట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా క్రికెట్‎కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు  ప్రకటించాడు. రెండు దశాబ్దాల క్రికెట్ కెరీర్‎కు ముగింపు పలుకుతున్నట్లు శుక్రవారం (జూన్ 6) సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు ఇన్స్ స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన ఆటగాళ్లు, సిబ్బంది, ఫ్రాంఛైజ్‎లు, బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘రెండు దశాబ్దాలకు పైగా మైదానంలో కొనసాగిన తర్వాత అందమైన ఆటకు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. ఆటలో తనకు అండగా నిలిచిన కోచ్‌లు, కుటుంబం, క్రికెట్ సంస్థలకు హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నాడు.

 భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నుంచి 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ విజేత జట్లలో భాగమైన ఈ అద్భుత జ్ఞాపకాలు ఎప్పటికీ నా హృదయంలో నిలిచి ఉంటాయని పేర్కొన్నాడు. నాపై నమ్మకం ఉంచిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు- పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎల్ నా కెరీర్‌లో నిజంగా ఒక ప్రత్యేకమైన అధ్యాయమని.. ఐపీఎల్‎లో ప్రతి క్షణాన్ని ఎంతో ఆనందించానని గుర్తు చేసుకున్నారు. 

ఒక క్రికెటర్‌గా నన్ను నేను అభివృద్ధి చేసుకోవడానికి సహకరించని  బీసీసీఐ, యూపీసీఏ (ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్), గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‎లకు కూడా పీయూష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నేను క్రికెట్ కు దూరమైనా.. క్రికెట్ ఎప్పుడూ నాలో ఉంటుందన్నారు.  కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి నేను ఇప్పుడు ఎదురు చూస్తున్నానని చావ్లా పేర్కొన్నాడు. 

చావ్లా క్రికెట్ కెరీర్

36 ఏళ్ల పీయూష్ చావ్లా టీమిండియా తరుఫున 3 టెస్టులు, 25 ODIలు మరియు 7 T20 మ్యాచులు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 43 వికెట్లు పడగొట్టాడు. 2007 T20 ప్రపంచ కప్,  2011 ODI ప్రపంచ కప్‌ గెలిచిన భారత విజేత జట్లలో చావ్లా కూడా ఒకడు. దేశీయ క్రికెట్‌లో గుజరాత్ తరఫున బరిలోకి దిగిన ఈ లెగ్ స్పిన్నర్ 137 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 446 వికెట్లు పడగొట్టాడు. క్యాచ్ రిష్ లీగ్ ఐపీఎల్‎లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తరుపున ఆడాడు. ఐపీఎల్‎లో మొత్తం 192 మ్యాచ్‌ల్లో 192 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‎లో అత్యధిక పడగొట్టిన బౌలర్ల జాబితాలో చావ్లా కూడా ఉన్నాడు.