
- రోజంతా ఏదో ఒక దేశంతో చర్చల్లో ఉంటున్నాం: మినిస్టర్ పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ (ఈయూ), అమెరికా, చిలీ, పెరూతో సహా చాలా దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ (ఎఫ్‌టీఏల) కోసం ఇండియా చర్చలు జరుపుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. “ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. అనేక అభివృద్ధి చెందిన దేశాలు మనతో ఎఫ్‌టీఏలు కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నాయి.” అని ఆయన ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ట్రేడర్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పేర్కొన్నారు.
వాణిజ్య మంత్రిత్వ శాఖ రోజంతా ఏదో ఒక దేశంతో చర్చల్లో ఉంటోందని తెలిపారు. “ఉదయం ఆస్ట్రేలియా, జపాన్ కార్యాలయాలు తెరుస్తాయి. మధ్యాహ్నం యూరప్ చురుకుగా ఉంటుంది. సాయంత్రం అమెరికా, చిలీ, పెరూ వంటి దేశాలతో చర్చలు ప్రారంభమవుతాయి” అని గోయల్ అన్నారు.
భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) మార్చి నుంచి చర్చలలో ఉంది. ఇప్పటివరకు ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. ఆరో రౌండ్ కోసం అమెరికా తన పర్యటనను వాయిదా వేసింది. ట్రంప్ ప్రభుత్వం ఈ నెల 27 నుంచి భారత వస్తువులపై 50శాతం టారిఫ్ విధించనుంది. ప్రస్తుతం 25శాతం డ్యూటీ అమలులో ఉంది.