ప్రొ కబడ్డీ మ్యాచ్ ఇక టై అవ్వదు... సరి కొత్త ఫార్మాట్‌‌‌‌ లో పీకేఎల్‌‌‌‌ 12వ సీజన్‌‌‌‌

ప్రొ కబడ్డీ మ్యాచ్ ఇక టై అవ్వదు... సరి కొత్త ఫార్మాట్‌‌‌‌ లో పీకేఎల్‌‌‌‌ 12వ సీజన్‌‌‌‌

ముంబై:  ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్ అభిమానులకు మరింత మజాను అందించేందుకు సిద్ధమైంది. లీగ్ ఫార్మాట్‌‌‌‌లో కీలక మార్పులు చేసినట్లు నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. ఆటలో పోటీ మరింత పెంచి, రసవత్తరంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కొత్త సీజన్ ఈ నెల 29న వైజాగ్‌‌‌‌లో మొదలై ఆ తర్వాత జైపూర్, చెన్నై, ఢిల్లీలో కొనసాగనుంది. మారిన నిబంధనల ఫలితంగా ఇకపై పీకేఎల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ‘టై’ అయ్యే అవకాశం ఉండదు. ప్రతీ మ్యాచ్‌‌‌‌లో ఫలితం తేలనుంది. ఇందుకు గతంలో  ప్లేఆఫ్స్‌‌‌‌లో మాత్రమే ఉపయోగించిన ‘గోల్డెన్ రైడ్’ విధానాన్ని ఇప్పుడు లీగ్ దశలోని అన్ని మ్యాచ్‌‌‌‌లకు అమలు చేస్తారు. 

ఒకవేళ మ్యాచ్ టై అయితే  మొదట 5 -రైడ్‌‌‌‌ల షూటౌట్ నిర్వహిస్తారు. అప్పటికీ స్కోర్లు సమంగా ఉంటే  గోల్డెన్ రైడ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అయినా ఫలితం తేలకపోతే టాస్ ద్వారా విన్నర్‌‌‌‌‌‌‌‌ను తేలుస్తారు. రాబోయే సీజన్‌‌‌‌లో మొత్తం 108 మ్యాచ్‌‌‌‌లు జరుగుతాయి. ప్రతి జట్టు మిగిలిన ప్రత్యర్థులతో రెండేసి చొప్పున 18 మ్యాచ్‌‌‌‌లు ఆడుతుంది. అభిమానులకు పాయింట్ల పట్టిక సులభంగా అర్థమయ్యేలా కొత్త పాయింట్ల విధానాన్ని తీసుకొచ్చారు. ఇకపై గెలిచిన జట్టుకు 2 పాయింట్లు ఇస్తారు. ఓడిన జట్టుకు పాయింట్లేమీ ఇవ్వరు. 

ప్లేఆఫ్స్‌‌‌‌ దశలో ఈసారి ‘ప్లే-ఇన్స్’ అనే కొత్త రౌండ్‌‌‌‌ను ప్రవేశపెట్టారు. దీనివల్ల లీగ్ దశలో తొలి 8 స్థానాల్లో నిలిచిన జట్లకు ప్లేఆఫ్స్‌‌‌‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. లీగ్‌‌‌‌లో 5 నుంచి 8 స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఇన్స్ రౌండ్‌‌‌‌లో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్లు ఎలిమినేటర్‌‌‌‌లో తలపడేందుకు అర్హత సాధిస్తాయి. 3, 4వ స్థానాల్లో నిలిచిన జట్లు మినీ -క్వాలిఫయర్‌‌‌‌ లో ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు ముందుకు వెళ్తుంది. ఓడిన జట్టుకు కూడా ప్లే ఆఫ్స్ కోసం తదుపరి మరో చాన్స్ వస్తుంది.  లీగ్ స్టేజ్‌‌‌‌లో 1, 2వ స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫయర్ 1లో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌‌‌‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు క్వాలిఫయర్– 2 ద్వారా ఫైనల్ చేరే మరో అవకాశం ఉంటుంది. మొత్తంగా ఫైనల్ కు ముందు ప్లేఆఫ్స్‌‌‌‌లో మూడు ఎలిమినేటర్లు, రెండు క్వాలిఫయర్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు ఉంటాయి.