సేమ్ టూ సేమ్ ఎయిర్ ఇండియా ఫ్లయిట్ కూలినట్లే: లండన్‎లో గాల్లోకి లేచిన సెకన్లలోనే కుప్పకూలిన విమానం

సేమ్ టూ సేమ్ ఎయిర్ ఇండియా ఫ్లయిట్ కూలినట్లే: లండన్‎లో గాల్లోకి లేచిన సెకన్లలోనే కుప్పకూలిన విమానం

లండన్: 2025, జూన్ 12న అహ్మదాబాద్‏లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. భారతదేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోర విషాదాల్లో ఒకటిగా నిల్చిన ఈ ప్రమాదంలో దాదాపు 260 మంది చనిపోయారు. అహ్మదాబాద్‎లోని సర్దార్ వల్లభాభాయ్ పటేల్ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణికులతో లండన్‎ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఎయిర్ పోర్టు సమీపంలో కుప్పకూలింది. 

తాజాగా ఇలాంటి తరహా విమాన ప్రమాదం లండన్‎లో జరిగింది. 2025, జూలై 13 మధ్యాహ్నం ఇంగ్లాండ్‌లోని లండన్ సౌథెండ్ విమానాశ్రయంలో విమానం క్రాష్ అయ్యింది. టేకాఫ్ అయిన సెకండ్ల వ్యవధిలోనే ఎయిర్ పోర్టులో విమానం కుప్పకూలింది. ఫ్లైట్ క్రాష్ కావడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. వెంటనే మంటలు అంటుకుని విమానం కాలి బూడిదైంది. 

వెంటనే స్పందించిన అధికారులు, రెస్య్కూ టీమ్స్ ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ ఫ్లైట్ క్రాష్‎కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ఆకానంటేలా దట్టమైన పొగలు వెలువడుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాద తీవ్రతను భట్టి చూస్తే విమానంలో ఉన్నవారు బతికే అవకాశాలు లేనట్లే కనిపిస్తున్నాయి.

సౌథెండ్ విమానాశ్రయంలో 12 మీటర్ల జనరల్ ఏవియేషన్ విమానం క్రాష్ అయ్యిందని ఎసెక్స్ పోలీసులు ధృవీకరించారు. ఘటన స్థలంలో యుద్ధ ప్రాతిపదిక సహయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. వీలైనంత త్వరగా ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను అందిస్తామన్నారు అధికారులు. ఈ ప్రమాదం కారణంగా ఆదివారం మధ్యాహ్నం పలు విమానాలు రద్దు అయ్యాయి.