ఉగ్రవాదం మానవాళికి ముప్పుగా మారింది: జై శంకర్

ఉగ్రవాదం మానవాళికి ముప్పుగా మారింది: జై శంకర్

ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి పెను ముప్పుగా మారిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. 26/11 ముంబయి దాడుల బాధితులను గుర్తు చేసుకున్నారు. ఈ దాడులకు ప్లాన్ చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టాలన్నారు. 2008 ముంబయిలో  లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమాయకులైన 166 మంది చనిపోయారు. దాదాపు 300 మంది గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.  గత నెలలో  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)  రెండు రోజుల ఉగ్రవాద వ్యతిరేక సమావేశాన్ని  నిర్వహించింది.  సరిహద్దులు దాటి  వచ్చిన ఉగ్రవాదులు మూడు రోజులపాటు ముంబయిని దిగ్బంధనం చేశారని.. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలికి చెందిన కౌంటర్ టెర్రరిజం కమిటీ ప్రత్యేక సమావేశంలో విదేశాంగ మంత్రి అన్నారు.ఉగ్రవాదంపై పోరులో సభ్య దేశాలన్నీ పూర్తిగా సహకరించాలని కోరారు.  ఆసియా, ఆఫ్రికాలో ఉగ్రవాదం విస్తరిస్తుందని...ఇది  ప్రపంచానికి పెను  ముప్పుగా పరిణమిస్తోందని జై శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ శాంతి, భద్రతలకు ఉగ్రవాదం చాలా తీవ్రమైన ముప్పు అని హెచ్చరించారు. ఉగ్రవాదానికి సంబంధించిన అన్ని చర్యలు నేరపూరితమైనవేనని, సమర్ధనీయం కానివని తెలిపారు.

ముంబై దాడుల సూత్రధారులను శిక్షించే పని పూర్తవడం లేదు 

ఈ దాడి కేవలం ముంబయిపై మాత్రమే కాదని, అంతర్జాతీయ సమాజంపై జరిగిందని వివరించారు. ఉగ్రవాదులు హత్యాకాండకు పాల్పడటానికి ముందు ఎవరు ఏ దేశానికి చెందినవారో నిర్థరించుకున్న తర్వాతే హత్య చేశారని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నిటి నిబద్ధత బహిరంగ సవాలును ఎదుర్కొందని చెప్పారు. ఈ దాడికి సూత్రధారులను చట్టం ముందు నిలిపేందుకు తాము ప్రయత్నిస్తూనే ఉన్నామని, ఈ పని ఇప్పటికీ పూర్తి కాకుండానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు

ముంబయిలో ఉగ్రదాడులు జరిగి ఇవాళ్టికి 14 ఏండ్లు

ముంబయలో 2008 నవంబర్ 26 నాటి ఉగ్రదాడులు  జరిగి ఇవాళ్టికి 14 సంవత్సరాలు. కాలం పరుగులు తీస్తున్నా ఆ దాడులు మిగిల్చిన గాయాలు దేశంలోని అనేకమంది హృదయాలను ఇంకా వీడనేలేదు. ప్రాణాలతో బయటపడిన వారికీ, కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిని ఆ ఘటన నేటికీ వెంటాడుతూనే ఉంటుంది.  ఇప్పటికే ప్రధాన సూత్రదారులైన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్ లో దర్జాగా తిరుగుతున్నారు. దాయాది దేశం పాకిస్తాన్ చర్యలు తీసుకోవడం లేదు. అయితే కుట్ర పన్నిన లష్కరే చీఫ్ హఫీస్ సయీద్ మాత్రం లాహోర్ లో రాచభోగాలు అనుభవిస్తున్నాడు.ముంబై మారణహోమానికి కారణమైన ఉగ్రవాదుల్లో ఒకడైన కసబ్‌కు భారత ప్రభుత్వం, న్యాయస్థానం 2012 నవంబర్ 21 ఉరిశిక్ష విధించింది. కసబ్‌ను శిక్షించినప్పటికీ అసలు కారకులను శిక్షించేవరకు తమకు న్యాయం జరగనట్లే అని ఆ దాడులలో బంధువులను కోల్పోయినవారు, గాయపడినవారు కోరుకుంటుంటారు.2008 నవంబరు 26న జరిగిన ఈ ఉగ్రవాద దాడులకు కేంద్రం ముంబైలోని హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్.